ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి! | Sakshi Editorial On Chandrababu Purandeswari Sharmila | Sakshi
Sakshi News home page

ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!

Published Sun, Apr 7 2024 4:00 AM | Last Updated on Sun, Apr 7 2024 1:27 PM

Sakshi Editorial On Chandrababu Purandeswari Sharmila

జనతంత్రం

పురందేశ్వరి
భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్‌కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్‌ పోల్చారు.

చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్‌ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు.

షర్మిల
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్‌ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు.



తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను  మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్‌ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్‌ క్లెయిమ్‌ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి.

చంద్రబాబు నాయుడు
వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది.

ఈ ఛాలెంజ్‌ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్‌ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే!

పురందేశ్వరి
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్‌ వైస్రాయ్‌కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది.

బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే  పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్‌ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్‌లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు.

షర్మిల
తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్‌ జగన్‌లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్‌ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్‌రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు.

చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్‌. రెండోది జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్‌ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్‌కు చెందిన ప్రైవేట్‌ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి.

కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్‌లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్‌కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్‌ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్‌కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా!

చంద్రబాబునాయుడు
అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్‌డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్‌ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్‌కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్‌–స్టేషన్‌లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది!

యెల్లో కార్డ్‌
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్‌ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్‌కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగితే జగన్‌  ఖండించలేదట. మణిపుర్‌ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్‌లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు.

బీజేపీకి జగన్‌ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా ఎంజీఆర్‌ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్‌ పట్నాయక్‌ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్‌ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్‌ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది.

ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్‌రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్‌ హుందాగా స్పందించారు.

రెడ్‌కార్డ్‌
చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్‌ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement