ముందుచూపు శాశ్వతమవాలి! | Sakshi Editorial on Corona Pandemic | Sakshi
Sakshi News home page

ముందుచూపు శాశ్వతమవాలి!

Published Tue, May 11 2021 12:15 AM | Last Updated on Tue, May 11 2021 8:12 AM

Sakshi Editorial on Corona Pandemic

ప్రతి విపత్తూ, మానవాళికి చేసే అపార కీడుతో పాటు మంచికి దారితీసే గుణపాఠాలూ నేర్పుతుంది. ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారికీ ఈ విషయంలో మినహాయింపు లేదు. మన వైద్య వ్యవస్థ ఎంత దయనీయంగా ఉందో ఎత్తిచూపి, కొత్త దారులు ఏర్పరచుకునే ఒత్తిడి తెస్తోంది. పౌర అవసరాలకు తగ్గట్టు వైద్య వ్యవస్థను మెరుగుపరచడంలో దశాబ్దాల పాటు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. పౌర సమాజం చూపిన అశ్రద్దను గుర్తుచేసింది. దీర్ఘకాలం దీన్నొక ప్రాధాన్యత లేని అంశంగా చూసిన పాపానికి తగు మూల్యం చెల్లించుకునే దుర్గతి పట్టించింది. చేతులు కాలుతుంటే ఆకులు పట్టుకునే ప్రయాసలో ఉన్నాయి పాలనా వ్యవస్థలు. మాస్కులు–సానిటైజర్ల నుంచి ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, వైద్యులు–సిబ్బందిని సమకూర్చుకోవడం, ఆక్సిజన్‌–వాక్సిన్లు–మందుల అందుబాటు.... పలు విషయాల్లో స్వయం సమృద్ది అవసరం ఒక చెర్నాకోలా దెబ్బలా వొంటికి తాకుతోంది. పశ్చిమ దేశాలు తుఫాన్‌లో తమలపాకులా అల్లాడిన తొలి ఉదృతి తర్వాత.. రెండో ఉదృతి కోవిడ్‌ కోరల్లో భారత్‌ ఇప్పుడు విలవిల్లాడుతోంది. తొలి ఉదృతిలో భారత్‌కు సహజసిద్దంగా లభించిన చిరు సానుకూలతను ఘనతగా జబ్బలు చరుచుకున్నందుకేమో, ఇప్పుడు నిస్సహాయ దుస్థితి మనది!

మన గణాంకాలు చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. మహమ్మారి వచ్చి ఏడాది దాటినా... తగు ముందు చూపు, ప్రణాళిక, కార్యాచరణ కొరవడి మనమిపుడు పెను సంక్షోభంలోకి జారిపోతున్నాం. ఏటూ తేల్చుకోలేక... జీవితాలకు–జీవనోపాధులకు నడుమ నలిగిపోతున్నాం. సంపూర్ణ లాక్‌డౌన్‌ అంటే, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలై చిన్నా, చితకా జీవితాలు అతలాకుతలమౌతాయి. కాదని, అన్నింటినీ అనుమతిస్తూ ముందుకు సాగితే... రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు, జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పదిలక్షల మరణాలతో ఆగస్టు తొలివారానికి ఏ దయనీయ స్థితికి చేరుతామో ‘లాన్సెట్‌’ జర్నల్‌ హెచ్చరించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లు..... ఇలా ఎందరో, తెల్లారేసరికి మృతుల జాబితాలోకి, ప్లాస్టిక్‌ కవర్లలోకి చేరిపోతుంటే కడుపు తరుక్కుపోతోంది. సానుభూతి వ్యక్తం చేసేంత వెసలుబాటూ లేకుండా చావు మీద చావు కబుర్లు చెవిని తాకుతున్నాయి. దుఃఖం పొరలు కడుతోంది. భయం భయంగా పడుకోవడం, గగుర్పాటుతో నిద్దర్లేవడం దినచర్య అవుతోంది.

మాస్కుల కోసం అలమటిస్తున్నపుడు వెంటిలేటర్ల ధ్యాస లేదు. వెంటిలేటర్లు సమకూర్చుకుంటున్నపుడు ఆక్సిజన్‌ అవసరం తోచలేదు. ఆక్సిజన్‌ అందక అసువులు ఆవిరవుతున్నపుడు.... రేపటి ప్రమాదం గుర్తురావడం ఒకింత ముందు చూపే! ఇదే గతి కేసుల సంఖ్య పెరిగితే రానున్న రోజుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది కొరత తారస్థాయికి చేరుతుంది. అప్పుడు ఈపాటి వైద్యం కూడా అందదు. పాఠాన్ని గ్రహించిన సంకేతాలే ఉపశమన చర్యలు! వైద్య కోర్సు ముగింపులో, హౌజ్‌సర్జన్‌షిప్‌లో ఉన్నవారూ... ఇలా అందరినీ వైద్య సేవల్లోకి వచ్చేయండంటూ ప్రధాని మోదీ మొన్న ఇచ్చిన పిలుపు తొలి అడుగు. యాబై వేల వైద్యుల్ని, ఇతర సిబ్బందిని సత్వరం నియమించుకోండి అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఆ బాటలోవే! ఎమ్బీబీఎస్, హౌజ్‌సర్జన్, పీజీ, బీఎస్సీ–ఎమ్మెస్సీ నర్సింగ్, అనుబంధ వైద్య కోర్సు ముగింపులో ఉన్న వారందరినీ మంగళవారం సాయంత్రం వరకు విధుల్లోకి తీసుకోండి అన్న ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఉత్తర్వులైనా ఆ కోవలోవే. కోవిడ్‌ నేపథ్యపు తాత్కాలిక చర్యలు. కానీ, ఇలాంటివి శాశ్వత ప్రాతిపదికన జరగాలి. దప్పిక అయినపుడే బావి తవ్వితే ఎలా? తగినంత వైద్యుల్ని, సహాయ వైద్య సిబ్బందిని సమకూర్చుకోవాలి. బడ్జెట్లో వైద్య రంగానికి నిధులు కేటాయించి మౌలిక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక కార్యాచరణ ఉండాలి. కేంద్ర– రాష్ట్రాలు వైద్యారోగ్య రంగానికి చేసే కేటాయింపులు నామమాత్రమేనని, ఈ పరిస్థితిని మార్చి ప్రాధాన్యత పెంచాలంటూ పార్లమెంటు స్థాయీ సంఘం చేసిన సిఫారసులను అమలు చేయాలి. ఆరోగ్య కేంద్రాలను పెంచడం ద్వారా ప్రజావైద్య వ్యవస్థను గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరించాలి.

వైద్యులు, వైద్య సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన సమకూర్చుకోవడం ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున (1:1000) డాక్టర్లు మనకు లేరు. ఆరు (తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, గోవా) రాష్ట్రాల్లోనే ఈ ప్రమాణాలున్నాయి. వైద్యవిద్య ఖరీదై దేశంలో తగినంత వైద్యులు రావటం లేదు. విప్లవాత్మక చైనా వైద్య నమూనా, ‘పాదచారి వైద్యులు’ (బేర్‌ ఫూట్‌ డాక్టర్స్‌) తరహాలో దివంగత నేత డా.వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక ఆలోచన చేశారు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో, రెండేళ్ల వైద్య కోర్సును భారత వైద్య మండలి అనుమతితో డిజైన్‌ చేయాలి. సర్జరీ వంటి పెద్దవి తప్ప చిన్న వైద్య అవసరాలన్నీ వీరు తీరుస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడున్న ఆరెంపీ వ్యవస్థకు కాలం చెల్లింది. వారు శాస్త్ర పరిజ్ఞానం ఆధునీకరించుకోవడం లేదు. పైపెచ్చు వారిలో పలువురు తమ వద్దకు వచ్చే రోగుల్ని కార్పొరేట్‌ ఆస్పత్రులకు సిఫారసు చేసే ఏజెంట్లుగా మిగిలిపోతున్నారు. ఈ మాధ్యమిక వైద్య వ్యవస్థతో  ‘ఒక దెబ్బ రెండు పిట్టలన్న’ట్టు రెండు సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలు తీరుతాయి. పెద్దఎత్తున నిరుద్యోగ సమస్యకూ కొంత పరిష్కారం. కోవిడ్‌ వంటి విపత్తులెన్ని వచ్చినా ఎదుర్కొనేలా మనను మనం సన్నద్దం చేసుకోవడానికి ముందుచూపు, వ్యూహం, కార్యాచరణ అవసరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement