ఎంత కాదనుకున్నా కొన్ని వార్తలు కలవరపెడతాయి. కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తొలగిందో లేదో ఇంకా తెలియనేలేదు. అప్పుడే థర్డ్ వేవ్ అంటుంటే కష్టమే. కానీ, కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. కేరళ తదితర రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం, డెల్టాను దాటి డెల్టా ప్లస్ ఉత్పరివర్తనాలు వస్తున్న వైనం, జీవనోపాధి కోసం ఇస్తున్న సడలింపుల్లో ప్రజల అజాగ్రత్తలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనం థర్డ్‌వేవ్ తప్పదనడంతో మళ్ళీ ఆత్మపరిశీలన అవసరమవుతోంది.
థర్డ్‌వేవ్ మాటెలా ఉన్నా, కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరి అని తేలిపోయాక, జీవితానికీ – జీవనోపాధికీ మధ్య ఏదో ఒకటి ఎంచుకోక తప్పడం లేదు. జీవనం కోసం బయటకు రావడం తప్పూ కాదు. కానీ, జనం విశృంఖలంగా వ్యవహరిస్తుండమే విషాదం. థర్డ్ వేవ్ సంగతి సరే... అసలు సెకండ్ వేవ్ సైతం ఇప్పటికీ ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య వర్గాలు వాపోతున్నాయి. కనీసం 8 రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా వ్యాప్తి జోరుగా ఉందని తాజా వార్త. నాలుగు పదులకు పైగా జిల్లాల్లో, అందులోనూ సడలింపులు పెరిగిన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు లాంటి నగరాల్లో నేటికీ కేసులు తెగ వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని సూచించే ‘ఆర్’ ఫ్యాక్టర్ గత నాలుగు వారాల్లో పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దేశంలో ఏకంగా 1.2 ఉందని కేంద్రమే చెబుతోంది. అది 0.6 లోపు ఉంటేనే కరోనా వ్యాప్తి అదుపులో ఉన్నట్టు! 1 అంటే ప్రమాదఘంటికల స్థాయి. అంతకుమించి ఉన్నదంటే, ఇప్పటికీ మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో లేదన్నమాట.
కేరళ పరిస్థితి మరీ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కరోనా తొలి కేసు నమోదైనదే కేరళలో! అప్పటి నుంచి తొలి వంద రోజుల్లోనే కేసులేమీ లేని రాష్ట్రంగా అవతరించడం కేరళ సాధించిన ఘనత. సమర్థమైన ఆరోగ్య వసతులను వినియో గించుకోవడం, చిత్తశుద్ధితో కృషి చేయడం ఆ పురోగతికి కారణమైంది. కానీ, ఆ పరిస్థితి క్రమంగా దిగజారింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోద వుతుంటే, వాటిలో సగానికి పైగా కేరళలోవే! కానీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ప్రతి 98 కేసుల్లో ఒకటే బయటకు చెబుతుంటే, కేరళ మాత్రం ప్రతి 6 కేసుల్లో ఒకటి వెల్లడిస్తోందని ఓ నివేదిక. ఆ నిజాయతీ వల్ల కూడా కేసుల సంఖ్య ఇంతగా తెలుస్తున్నాయనుకోవాలి. అది నిజమైనా, వంద రోజుల ఘనత చేజారడంలో పాలకుల, ప్రజల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. అసలు కారణం కనిపెట్టేందుకు చివరకు కేంద్రప్రభుత్వ బృందం మలయాళ సీమలో పర్యటించాల్సి వచ్చిందంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ వర్గాల కథనం ప్రకారం – ప్రాథమిక కాంటాక్ట్‌ల ట్రేసింగ్ సరిగ్గా సాగడం లేదు. ఆర్టీ పీసీఆర్ టెస్టులు తగినంత చేయడం లేదు. కంటైన్మెంట్ జోన్లు పెట్టడం లేదు. హోమ్ ఐసొలేషన్‌లోనూ అనేక అశ్రద్ధలు. ఇవన్నీ కలిసి కేరళలో తాజా దుఃస్థితికి కారణాలట. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి చోట్ల పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో థర్డ్‌వేవ్ ఇప్పటికే వచ్చిందా అనే అనుమానాలకు తావిస్తోంది.
మరోపక్క వివిధ దేశాల్లో పరిస్థితి ఉత్సాహజనకంగా లేదు. చైనా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి చోట్ల కరోనా అదుపు కోసం కొత్త షరతులు విధించాల్సిన పరిస్థితి. కరోనా పురుడు పోసుకున్న వూహాన్ ప్రాంత వాసులందరికీ కోవిడ్ పరీక్ష చేయాలని చైనా నిర్ణయించింది. ఒకసారి వాయిదా పడి ఈ ఏడాది సాగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ను పళ్ళ బిగువున జరుపుతూ వస్తున్న జపాన్ సైతం మరింత నిబంధనలు పెట్టింది. ఇతర దేశాల్లోనూ ఇలాంటివి అనేకం. అనేక దేశాల అనుభవం, తాజా అధ్యయనాలను బట్టి ఈ నెలాఖరు కల్లా మన దేశంలో థర్డ్ వేవ్ తప్పదని అంచనా. సెప్టెంబర్ నాటికి తారస్థాయికి చేరే ఈ వేవ్‌లో రోజుకు లక్ష నుంచి లక్షన్నర దాకా కేసులొస్తాయని లెక్క. అయితే, అది సెకండ్ వేవ్ అంత ఉద్ధృతంగా, ప్రాణాంతకంగా ఉండదంటున్నారు. అదొక్కటే ఉన్నంతలో ఆశావహ సమాచారం. అలాగని అలక్ష్యం వహిస్తేనే అసలు చిక్కు.
మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడమే కాక, రక్షణకు మన దగ్గరున్న ఆయుధం – టీకా. ఇప్పటికి దేశంలో 47.3 కోట్ల చిల్లర డోసుల టీకాలే వేశాం. ఇంకా చెప్పాలంటే, దేశజనాభాలో 10 శాతం మందికే పూర్తిగా టీకా వేశాం. జూలైలో రోజుకు సగటున 43 లక్షలు వేశామంటే, దాన్ని కనీసం రెట్టింపు చేయాలి. అప్పుడే ఈ ఏడాది చివరికైనా దేశంలోని వయోజనులందరికీ పూర్తిగా టీకాలు వేయలేం. కానీ, టీకాలు వేసే ప్రక్రియ వేగం తగ్గింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో టీకాల కోసం జనం తోసుకుంటున్న దృశ్యాలు వ్యవస్థ వైఫల్యానికి దర్పణాలు. కోల్‌కతా లాంటి చోట్ల టీకా వేయించుకోవడానికి జనం రాత్రి నుంచే క్యూలో నిలబడాల్సి వస్తోందంటే ఏమనాలి?
గిరాకీ, సరఫరాల మధ్య లోటు భర్తీ చేయాల్సింది పాలకులే. సత్వరంగా టీకాలు వేస్తేనే, వచ్చే కొత్త వేరియంట్లపై ఓ కన్ను వేసి ఉంచితేనే రాబోయే వేవ్‌ల నుంచి రక్షణ అని గుర్తించాలి. లేదంటే, కొత్త వేవ్‌ల నుంచి కాపాడే కవచం ప్రజలకు అందించనట్టే లెక్క! అదే సమయంలో, ప్రభుత్వాలు ఇస్తున్న సడలింపుల్ని సక్రమంగా అర్థం చేసుకోకపోతే ఆ తప్పు మనదే. తెలంగాణలోనూ బోనాల వేళ కరోనా నిబంధనలకు తూట్లు పడుతున్నాయి. బక్రీద్‌కు కేరళ సర్కారిచ్చిన మూడు రోజుల సడలింపు ఇప్పుడెలాంటి స్థితి తెచ్చిందో చూస్తున్నాం. పొరుగువాళ్ళను చూసైనా పాఠం నేర్చుకోక పోతే, ఆ తప్పు మనదే! ఎందుకంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం?
Comments
Please login to add a commentAdd a comment