మొన్న తమిళనాడు.. నిన్న పశ్చిమ బెంగాల్.. నేడు కేరళ.. మరి రేపు? వరుస చూస్తుంటే, కేంద్ర పాలకుల చెప్పుచేతల్లో ఉంటారని పేరుబడ్డ గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గట్టిగానే సమర శంఖం పూరిస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కులపతి అనే గౌరవ హోదా నుంచి గవర్నర్లను ఒక్కో ప్రభుత్వం సాగనంపుతోంది. ఇతర రాష్ట్రాల బాటలో ఇప్పుడు కేరళ శాసన సభ సంబంధిత బిల్లును ఆమోదించింది. గవర్నర్ స్థానంలో విద్యావేత్తల్ని ఛాన్సలర్‌గా నియమించే విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లుకు కేరళ అసెంబ్లీ మంగళవారం ఓకే అంది. పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థకూ, ప్రజాప్రభుత్వాలకూ మధ్య ఘర్షణకు ఇది తాజా ఉదాహరణ.
కేరళలోని వామపక్ష సర్కారుకూ, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అను గుణంగా జరగలేదంటూ, కేరళ టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని సుప్రీమ్ కోర్ట్ కొట్టేయడంతో రాజ్‌భవన్‌తో సర్కారు వారి రచ్చ షురూ అయింది. సుప్రీమ్ చట్ట విరుద్ధమన్న పద్ధతిలోనే మరో 11 మంది వీసీల నియామకం జరిగిందంటూ, ఆ వీసీలు రాజీనామా చేయాల్సిందేనని గవర్నర్ తాఖీదులిచ్చారు. నిజానికి, రాష్ట్ర ఉన్నత విద్యలో రాష్ట్ర చట్టాలు, యూజీసీ చట్టానికి విరుద్ధంగా ఉంటే తప్పు కానీ, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వీసీల నియామకాన్ని కొట్టేయడం సరి కాదని రాజ్యాంగ నిపుణుల మాట. మొత్తానికి, తలనొప్పి గవర్నర్లను వర్సిటీల నుంచి తప్పించడమే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మార్గమవుతోంది.
ప్రస్తుతం దేశంలో బీజేపీ మినహా మిగతా పక్షాలన్నీ ఢిల్లీ పాలకులతో, వారికి ఏజెంట్లుగా పని చేస్తున్నారని అపకీర్తి సంపాదిస్తున్న గవర్నర్లతో విసిగిపోతున్నాయనడానికి ఇది ఓ నిదర్శనం. గవర్నర్లను కులపతి పీఠం నుంచి కదిలించే ప్రక్రియ ఊపందుకుంది అందుకే. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాట స్టాలిన్ సర్కార్ రెండు బిల్లులు తెచ్చింది. గవర్నర్ బదులు రాష్ట్రప్రభుత్వమే వీసీలను నియమించేలా బిల్లులో నిబంధనలు పెట్టింది. ఇక, జూన్‌లో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర వర్సిటీలకు ముఖ్యమంత్రినే కులపతిని చేస్తూ, మమత మంత్రివర్గం నిర్ణయించింది. మహారాష్ట్ర సర్కార్ సైతం రాష్ట్ర వర్సిటీల్లో వీసీల నియామక ప్రక్రియను మారుస్తూ 2021లోనే బిల్లు తేవడం గమనార్హం.
తాజాగా కేరళ సర్కారు తన అధికారాలకు కత్తెర వేసిన కొత్త బిల్లును అక్కడి వివాదాస్పద గవర్నర్ ఎలాగూ ఆమోదించరు. కథ రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. తర్వాత మలుపులేమిటో చూడాలి. నిజానికి, రాష్ట్రాల సమాఖ్య అయిన మన దేశంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య సంబం ధాలు సవ్యంగా సాగట్లేదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై భారత ప్రభుత్వం గతంలో సర్కారియా కమిషన్ వేసింది. తర్వాత రెండు దశాబ్దాలకు 2007లో పూంఛీ కమిషన్ వేసింది. పూంఛీ కమిషన్ 2010లో గవర్నర్ల పాత్ర సహా అనేక అంశాలపై 273 సిఫార్సులు చేసింది. రాజ్యాంగంలో చెప్పని అధికారాలనూ, హోదాలనూ కట్టబెట్టి గవర్నర్‌పై భారం మోపితే, వివాదాలు, విమర్శలు తప్పవు అంది. ఇప్పుడు ఆ సిఫార్సు ఆసరాతోనే బెంగాల్ మమత నుంచి కేరళ పినరయ్ విజయన్ దాకా అందరూ గవర్నర్‌ను వర్సిటీల నుంచి పక్కనబెడుతున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఇలాగే చేసింది. 2013లో గుజరాత్‌లోని నాటి మోదీ సర్కార్ సైతం వర్సిటీల ఛాన్సలర్‌గా వీసీల నియామకానికి గవర్నర్‌కున్న అధికారాలు తీసేసింది. కేంద్రంలో సొంత సర్కారొచ్చాక 2015లో తమ గవర్నర్‌తో దానికి ఆమోదమూ వేయించుకుంది. అలాగే, కొత్త ప్రభుత్వం ఎన్నికైనప్పుడూ, ఏటా తొలి సమావేశంలోనూ అసెంబ్లీలో గవ ర్నర్ ప్రభుత్వ విధాన ప్రసంగం చేయడం 176వ అధికరణం కింద రాజ్యాంగ విహితం. జనవరి బడ్జెట్ సమావేశాల్లో దాన్ని పక్కనపెట్టాలని కేరళ సర్కార్ యోచిస్తోందట. ఇప్పటికే తెలంగాణ సర్కార్ తమతో తరచూ విభేదిస్తున్న గవర్నర్‌ను పక్కనబెట్టి, ఈ ఏడాది ఇలాంటి పనే చేసింది. నిరవధిక వాయిదా తర్వాత అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తున్నట్టు ప్రకటించలేదన్న సాంకేతిక మిష రాష్ట్ర సర్కార్లకు అందివస్తోంది. ఇతరులకిది అనుకోని ఆదర్శమైంది.
సాంకేతికంగా అది సరైనదైనా, సభా సంప్రదాయం, గౌరవాల రీత్యా సమర్థించలేం. రాష్ట్ర ప్రథమ పౌరులని పిలుచుకొనే గవర్నర్ పీఠానికే అది అగౌరవం. వ్యక్తుల వ్యవహారశైలి సరిగ్గా లేదని, వ్యవస్థనే తృణీకరించి, తూష్ణీభావం చూపితే అది భవిష్యత్తుకు సత్సంప్రదాయం కాదు. అలాగని రాజ్యాంగ నామినేటెడ్ పదవిలోని గవర్నర్లు సైతం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు పంపిన ఫైళ్ళను అకారణంగా పెండింగ్‌లో పెట్టడం తప్పు. రాజ్‌భవన్‌లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం పార్టీలకు అతీతంగా పాలకులందరూ కొన్నేళ్ళుగా చేస్తున్న తప్పున్నర తప్పు.
రాష్ట్రానికి పెద్దగా గవర్నర్ చేయాల్సింది – మంచీచెడూల మార్గదర్శనమే! అలా కాక, ప్రజ లెన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని తానే సర్వం సహా అనుకొని, పగ్గాలు చేతబట్టి సమాంతర సర్కార్ నడపాలనుకుంటేనే సమస్య. ప్రజా ప్రభుత్వాల అజెండాను కాక, పదవి ఇచ్చిన ఢిల్లీ పెద్దల అజెండాల ప్రకారం నడుచుకోవాలని గవర్నర్లు ప్రయత్నిస్తే అది వ్యవస్థ గౌరవాన్ని మరింత పలచన చేస్తుంది. రాష్ట్ర సర్కార్ల ప్రతిచర్యలను ప్రోత్సహిస్తుంది. గవర్నర్‌కూ, గవర్నమెంట్‌కూ మధ్య ఈ సంఘర్షణ వైఖరి ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు! ఎవరికీ శోభస్కరమూ కాదు!!
Comments
Please login to add a commentAdd a comment