అయోమయంలో ‘ఇండియా’ | Sakshi Editorial On India alliance in confusion | Sakshi
Sakshi News home page

అయోమయంలో ‘ఇండియా’

Published Fri, Dec 22 2023 12:01 AM | Last Updated on Fri, Dec 22 2023 12:01 AM

Sakshi Editorial On India alliance in confusion

పాలకపక్షాన్ని అధికారం నుంచి దించటమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పటికీ అయోమయాన్ని వదుల్చుకోలేకపోతున్నదని మంగళవారం జరిగిన సమావేశం రుజువుచేసింది. తాము ఎవరికి ప్రత్యామ్నాయమో, దేనిలో ప్రత్యామ్నాయమో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఈనాటికీ అర్థం కాలేదని ఆ సమావేశం తీరుతెన్నులు తేటతెల్లం చేస్తున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా ఆయన హిందీ అర్థంకాక ఇబ్బందిపడుతున్న డీఎంకే సీనియర్‌ నేత టీఆర్‌ బాలు విషయంలో నితీశ్‌ స్పందించిన వైనం దిగ్భ్రాంతికరం.

‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్థమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని అడిగిన ఆర్‌జేడీ సభ్యుడు మనోజ్‌ ఝాపై నితీశ్‌ నిప్పులు కక్కారు. పనిలో పనిగా ‘హిందీ మన జాతీయ భాష. అందరి భాష. అందుకే మన దేశాన్ని హిందూస్థాన్‌గా పిలుచుకుంటాం. అది అందరికీ తెలియాల్సిందే. మీరేమీ అనువాదం చేయకండి’ అన్నారట. నితీశ్‌ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలో బిహార్‌లో అవినీతికీ, అధికధరలకూ వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో ఎదిగి రాజకీయరంగ ప్రవేశం చేసిన వ్యక్తి. పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నవారు.

అలాంటి నాయకుడు హిందీ మన జాతీయ భాష అనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశానికి ఉమ్మడి భాష అవసరమనీ, దాన్ని అందరూ నేర్చుకోవాలనీ ఉత్తరాది నాయకులు పార్టీలకు అతీతంగా చెబుతూవుంటారు. మాతృభాష కాక మరికొన్ని భాషలు నేర్చుకోవాలని చెప్పటంలో తప్పేమీ లేదు. అలా నేర్చుకోవటం వల్ల దేశంలో ఏమూలకైనా వెళ్లి జీవనం సాగించటం సులభమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుంది.

సివిల్స్‌లో విజేతలై దక్షిణాది రాష్ట్రాల క్యాడర్‌కు వచ్చేవారు స్థానిక భాషలు స్వల్పకాలంలోనే నేర్చుకుని అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. హిందీ భాషా ప్రాంతాలనుంచీ, వేరే రాష్ట్రాలనుంచీ వస్తున్న హీరోయిన్‌లు చాలా తొందరలోనే తెలుగు భాష అర్థం చేసుకుని మాట్లాడుతున్న వైనం అందరికీ తెలుసు. కానీ హిందీ ‘ఉమ్మడి భాష’గా వుండాలనీ, అది మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనీ మన నేతలు సుద్దులు చెప్పటం వింత గొలుపుతుంది. భాషాద్వేషంలాగే భాషాదురభిమానం కూడా ప్రమాదకరమేనని ఈ నేతలు గుర్తించటం లేదు. 

మనకు జాతీయ భాషంటూ ఏమీ లేదు. రాజ్యాంగంలోని 343 అధికరణ ప్రకారం కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్‌ అధికార భాషలు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలు అధికార భాష లుగా వుంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో భారీయెత్తున ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాతే 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్‌లో జరపాలని నిర్దేశిస్తూ 1967లో ఆ చట్టానికి సవరణ కూడా చేశారు.

ఇంకా వెనక్కు వెళ్తే స్వాతంత్య్రోద్యమ కాలంలో సైతం హిందీ భాష పెత్తనంపై తిరగబడిన దాఖలాలున్నాయి. హిందీని ఉమ్మడి భాషగా గుర్తించాలని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించాలని పురుషోత్తందాస్‌ టాండన్‌ నేతృత్వంలో కొందరు ఉత్తరాది నాయకులు జాతీయ కాంగ్రెస్‌ మహాసభల్లో ప్రయత్నించినప్పుడు నాటి ఆంధ్రప్రాంత ప్రముఖ నేత స్వర్గీయ ఎన్‌జీ రంగా గట్టిగా వ్యతిరేకించి అడ్డు కున్నారు. కేంద్రంలో పాలకపక్షంగా యూపీఏ వున్నా, ఎన్‌డీఏ వున్నా హిందీ వినియోగాన్ని పెంచ టానికి శ్రమిస్తుండటం తరచు కనబడుతూనే వుంటుంది.

2008లో అప్పటి యూపీఏ సర్కారు కేంద్ర ప్రభుత్వ నియామకాల కోసం జరిపే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంతవాసులే లబ్ధిపొందుతారనీ, దక్షిణాది వారికి అన్యాయం జరుగుతుందనీ ఆయన ఎలుగెత్తారు. తాను కాంగ్రెస్‌ నాయకుడే అయినా, యూపీఏకు తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా హిందీ భాషను రుద్దాలన్న ప్రయత్నాన్ని ఆయన సాగనివ్వలేదు. ఈ చరిత్రంతా తెలుసుకోకుండా నితీశ్‌ ఆగ్రహించటం కూటమికి గానీ, వ్యక్తిగతంగా ఆయనకు గానీ ప్రతిష్ఠ తీసుకురాదు.  

అసలు తాము ఇండియా కూటమిగా ఎందుకు ఏర్పడ్డారో, దేశంలో ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారో భాగస్వామ్య పక్షాల నేతలకు అవగాహన వుందా? ఉంటే నితీశ్‌ వంటి నాయకుడి నుంచి ఇలాంటి స్పందన రాదు. ఏ భాష అయినా పౌరులు ఎంతో ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవాలి. సినిమాలు, టీవీ చానెళ్ల వల్ల ఈరోజుల్లో హిందీతో సహా ఏ భాష నేర్చుకోవటమైనా ఎంతో సులభమవుతోంది. కూటమి ఏర్పడి అయిదు నెలలవుతోంది. తాజా సమావేశం నాలుగవది.

సెప్టెంబర్‌ 14న ఢిల్లీలో సమావేశమైనప్పుడు లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం ప్రక్రియపై ‘త్వరలో’ చర్చించాలని తీర్మానించారు. అది కాస్తయినా ముందుకు కదల్లేదు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను ఖరారు చేద్దామన్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచన సమావేశంలో వీగిపోయింది. నితీశ్‌ కుమార్, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దీనిపై మండిపడగా, కాంగ్రెస్‌ అధినేతలు సోనియా, రాహుల్‌ కిక్కురుమనలేదు. దేశానికి భారత్‌గా నామకరణం చేయాలన్న ఎన్‌డీఏ ప్రతిపాదనకు నితీశ్‌ వంత పాడటం కూడా చాలామందికి నచ్చలేదంటున్నారు. ఇలా ఏ అంశంలోనూ ఏకాభిప్రాయానికి రాలేక, చరిత్రపై అసలే అవగాహన లేక ఇండియా కూటమి సాధించేదేమిటి? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement