వలస ఓట్లపై హడావిడి | Sakshi Editorial On Migrant votes Election Commission of India | Sakshi
Sakshi News home page

వలస ఓట్లపై హడావిడి

Published Tue, Jan 3 2023 2:16 AM | Last Updated on Tue, Jan 3 2023 2:16 AM

Sakshi Editorial On Migrant votes Election Commission of India

ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచడానికి చేస్తున్న సరికొత్త ఆలోచన చర్చ రేపుతోంది. దేశీయంగా వలస వెళ్ళిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్వీఎం)లను తీసుకురావాలనే ప్రయత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం జనవరి 18న ఈ కొత్త యంత్రాల ప్రయోగాత్మక ప్రదర్శన జరుపుతోంది. అది చూసి, నెలాఖరులోగా తమ సూచనలు తెలియపరచాలని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.

ఏడు పదులు దాటిన భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో ఇలా దేశంలోని లక్షలాది వలసజీవుల్ని సైతం భాగం చేయాలనే ఆలోచన స్వాగతనీయమే. కానీ, ఇప్పుడున్న ఈవీఎంల వినియోగంపైనే సందేహాలు మసురుతున్న వేళ... కొత్త ప్రయత్నం ఏ మేరకు లోపరహితమన్నది చూడాలి. ఇప్పటికే, కాంగ్రెస్, తృణమూల్, డీఎంకె సహా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు వెతకాలి.

వలస జీవులకు రిమోట్‌ ఓటింగ్‌ కల్పించడంపై ఎన్నికల సంఘంలో చర్చలు కొత్తేమీ కాదు. దేశీయ వలసదారులకు ఓటింగ్‌ అవకాశాలు కల్పించాలంటూ కొన్నేళ్ళుగా అభ్యర్థనలున్నాయి. అలా వచ్చిన ఓ అభ్యర్థనపై సుప్రీమ్‌ కోర్ట్‌ 2015లోనే ఆదేశాలిచ్చింది. రిమోట్‌ ఓటింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని నిర్దేశించింది. పరోక్ష ఓటింగ్, పోస్టల్‌ బ్యాలెట్, ఇంటర్నెట్‌ ఓటింగ్, ముందస్తు ఓటింగ్‌ లాంటి పలు మార్గాలను ఎన్నికల సంఘ అధికారుల కమిటీ పరిశీలించింది. రకరకాల కారణాలతో ఆ పద్ధతులను సిఫార్సు చేయలేదు.

సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సదరు కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం తాజాగా సమస్య సాంకేతిక పరిష్కారంతో, ఈ బహుళ నియోజకవర్గ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్వీఎం) నమూనాను ముందుకు తెచ్చింది. ఇప్పటికే వాడుతున్న ఈవీఎం మోడల్‌కు మార్పులు చేర్పుల రూపమే – ఆర్వీఎం. వలసజీవులు తాము పనిచేస్తున్న నగరాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లోనే తమ స్వస్థలానికి చెందిన నియోజక వర్గాల ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది.   

ఈ ప్రతిపాదన అమలైతే సొంతూరికి దూరంగా ఉన్న ఓటర్‌ తన సొంత నియోజక వర్గం తాలూకు రిటర్నింగ్‌ అధికారితో ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ముందుగా రిమోట్‌ ఓటరుగా రిజిస్టర్‌ చేయించుకోవాలి. అప్పుడు ప్రస్తుతం సదరు ఓటర్‌ నివసిస్తున్నచోటే ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం, ఆర్వీఎం పెడతారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ఈ ఆర్వీఎం వివిధ నియోజక వర్గాలకు ఒకేసారి పనిచేస్తుందట.

ఓటర్‌ నియోజక వర్గాన్ని బట్టి అప్పటికప్పుడు మారే డైనమిక్‌ బ్యాలెట్‌ డిస్‌ప్లే ద్వారా ఒకే రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజక వర్గాలకు అది పనికొస్తుందట. దీనికి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అవసరం లేదట. ఆలోచన మంచిదే. ఈ యంత్రాల్ని సరిగ్గా వినియోగిస్తే గనక స్వస్థలం నుంచి వలస వెళ్ళిన ఓటర్లు ఇప్పుడిక తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వినియోగానికి కష్టపడి సొంత జిల్లాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళలేని పరిస్థితుల్లో తమ హక్కును వృథా కానివ్వనక్కర లేదు. 

2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 37 శాతం జనాభా (45.36 కోట్ల మంది) తమ స్వస్థలాల్ని వదిలి, దేశీయంగా వలసపోయినవారే. వీరిలోనూ నూటికి 85 మంది తమ సొంత రాష్ట్రంలోనే విద్య, ఉద్యోగం, వివాహం లాంటి రకరకాల కారణాలతో గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. వీరంతా ఎన్నికల వేళ స్వస్థలాల్లో ఓటు వినియోగించుకోలేక పోతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.2 కోట్ల మంది భారతీయులకు ఓటు హక్కుంటే, వారిలో 67.4 శాతమే ఓటేశారు. 30 కోట్ల పైచిలుకు మంది తమ హక్కును వినియోగించుకోలేదు. అంటే, ప్రతి ముగ్గురిలో ఒకరు ఓటు వేయనే లేదు. వలస వల్ల అధికశాతం ఓటు హక్కు వినియోగించు కోవట్లేదు గనక, వారు ఎక్కడున్నా ఓటేసే వీలు కల్పిస్తే పోలింగ్‌ శాతం పెరుగుతుందనేది ఎన్నికల సంఘం ఆలోచన. 

దీనికి చట్టపరంగా, సాంకేతికంగా, పాలనాపరంగా అనేక సమస్యలున్నాయి. ‘వలసజీవి’ అనే మాటకు భారత రిజిస్ట్రార్‌ జనరల్, కేంద్ర కార్మిక శాఖ, జాతీయ నమూనా సర్వే సంస్థల్లో ఒక్కోచోట ఒక్కో నిర్వచనం ఉంది. అసలు స్వస్థలానికి ఎంతకాలంగా దూరంగా ఉంటే వలస ఓటర్‌? రిమోట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమలుచేసేదెట్లా? ఈ వలసజీవుల్ని ఎలా గుర్తించాలి, ఎలా సురక్షిత వాతావరణం కల్పించాలి? రిమోట్‌ ఓటర్ల డేటా లేదని ఎన్నికల సంఘమే చెబుతోంది. కానీ, 2023లో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఆర్వీఎంలను వాడాలనీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా అమలు చేయాలనీ పాలకుల పనుపున తహతహలాడుతోంది. 

అసలు ముందుగా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు నియమాలు మార్చాలి. ఆలోచించి చేయాల్సిన ఈ పనుల్ని హడావిడిగా నడిపించి, చటుక్కున చేతిలోకి రిమోట్‌ తీసుకుంటే అనుమానాలు బలపడతాయి. ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లేతో ఓటింగ్‌పై అంతర్జాతీయంగానూ అనుమానాలున్నాయి. బలమైన ఆధారాలు లేకున్నా ఎన్నికల్లో మోసాలకు ఇది వీలు కల్పిస్తుందని ఓ భావన.

సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో కుయుక్తులు, యంత్రాల భద్రత, వేసిన ఓట్లు ఏ మేరకు సురక్షితం లాంటి చర్చనీయాంశాలున్నాయి. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల్లో ఆఖరి గంటలో 10 – 12 శాతం ఓటింగ్‌ రేపిన సందేహాలనూ విస్మరించలేం. రేపు రిమోట్‌ ఓటింగ్‌లోనూ ఇలాంటివే పరిపాటైతే, అసలు ఎన్నికల ప్రక్రియపైనే నమ్మకం పోతుంది. అప్పుడిక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement