సోమవారం నలుగురు. మంగళవారం 19 మంది. బుధవారం ఒకరు. గురువారం ముగ్గురు. 4 రోజుల్లో 27 మంది. ఈ లెక్కంతా పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి సస్పెండైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య. జూలై 18న మొదలైనప్పటి నుంచి సమావేశాలు జరుగుతున్న తీరు, గురువారం సోనియాకూ, పాలకపక్ష సభ్యులకూ మధ్య సభలో సంఘటనలు చూస్తుంటే... పార్లమెంట్ ప్రతిష్ఠ అంతకంతకూ దిగజారుతున్న భావన కలుగుతోంది. ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించకుండా అధికార పక్షం తమ గొంతు నొక్కేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణ. గందరగోళం రేపడమే ప్రతిపక్షాల ధ్యేయమై పోయిందని అధికార పక్షం వాదన. మరోపక్క సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల నిరసన దీక్ష మునుపెరుగని దృశ్యాలకు ప్రతీక.
ప్రజాసామ్య దేవాలయంలో సభ్యుల సస్పెన్షన్లు, వరుస వాయిదాలతో ఈ సమావేశాలు సైతం పలు పార్లమెంట్ సమావేశాలలానే నామమాత్రమవుతున్నాయి. సమస్యలు, బిల్లులు చర్చించాల్సిన వేదిక దూషణలు, నినాదాలకు పరిమితం కావడం శోచనీయం. సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఏం చేసినా సభలో ఎవరూ ప్రశ్నించకూడదు, చర్చించకూడదని అధికార పార్టీ అనుకుంటే అది మూక స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. సభలోకి ప్లకార్డులు తెచ్చి అడ్డుపడడం, నిబంధనావళిని చించి, సభాపతి పైకి కాగితాలు విసిరివేయడం ప్రతిపక్షాలకు పబ్లిసిటీకి పనికిరావచ్చేమో కానీ, దానివల్ల ప్రజాసమస్యలైతే పరిష్కారం కావు. ఈ రెండు వైఖరుల వల్ల నష్టపోతున్నది ప్రజలే. వారి బాధల్ని వినిపించడానికీ, వినడానికీ ప్రజాప్రతినిధులెవరికీ వీలుచిక్కని విచిత్ర పరిస్థితి.
గతంలో ప్రతిపక్షాలు సభలో నిరసన తెలిపినా అదీ హుందాగానే సాగేది. ప్రభుత్వం సైతం ఎవరెన్ని రోజులు నిరసన తెలిపినా, ఒక్క ఉదుటున సస్పెన్షనే పరిష్కారంగా భావించలేదు. ప్రతిపక్షాలతో చర్చించి ప్రతిష్టంభనకు తెర దించేవారు. ఇప్పుడా పరిస్థితే కనిపించట్లేదు. పైగా, నిన్నటి దాకా అసెంబ్లీలకే పరిమితమైన సుదీర్ఘ సస్పెన్షన్ల సంప్రదాయం పార్లమెంటుకూ పాకడం శోచనీయం. ధరల పెరుగుదల, జీఎస్టీ, అగ్నిపథ్, చైనా ముప్పు సహా రకరకాల సమస్యలపై చర్చ జరగాలనీ, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనీ ప్రతిపక్షం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, అందుకు సరైన పద్ధతిని అనుసరించక సభను అడ్డుకోవాలని చూస్తే తప్పే. సంయమనంతో ఉండాల్సిన పాలక పక్షం సైతం సస్పెన్షనే సర్వరోగ నివారిణి అనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు.
1978 వరకు నూరు శాతానికి పైగా పనిచేసిన ఘనత మన పార్లమెంట్‌ది. సభ స్తంభించి పోవడం అరుదు. తర్వాత నుంచి పరిస్థితి మారింది. కొన్నేళ్ళుగా అందులో సగమైనా పనిచేయని దుఃస్థితి. 1950, ’60లలో లోక్‌సభ దాదాపు 4 వేల గంటలు పనిచేస్తే, పూర్తికాలం సాగిన గత 16వ లోక్‌సభ 1615 గంటలే పనిచేసింది. ఇది లోక్‌సభల సగటు పనిగంటల కన్నా 40 శాతం తక్కువ. దీనికి అధికార, ప్రతిపక్షాలు రెండూ కారణమే! అలాగే, పార్లమెంటరీ చర్చల్లో వాయిదా తీర్మానాలు అత్యంత ప్రధానమైనవి. అయితే, ఆ పరిస్థితీ నేడు కనిపించట్లేదు. 2016 నుంచి పార్లమెంట్‌లో ఏ ఒక్క వాయిదా తీర్మానాన్నీ ఆమోదించిన దాఖలాలు లేవని పరిశీలకులు లెక్కలు తీశారు.
కరోనా సాకుగా మీడియాకు 2020 మార్చి నుంచి పార్లమెంట్‌లో పరిపూర్ణ అనుమతికి అడ్డం కొట్టిన పాలకులు కరోనా తగ్గినా సరే డైలీ పాసుల పద్ధతి మానలేదు. ఇప్పుడు సస్పెన్షన్లు, చర్చలకు నిరాకరణతో ఏకంగా ‘ప్రతిపక్ష ముక్త పార్లమెంట్’ను కోరుతున్నారనిపిస్తోంది. పార్లమెంట్ ప్రజలదే తప్ప, అయిదేళ్ళకు ప్రజలెన్నుకున్నంత మాత్రాన అది పాలకుల జాగీరైపోదు. రెండోసారి అధికారం లోకి వచ్చాక అధికార బీజేపీ ప్రవర్తన పూర్తిగా మారిందనేది విశ్లేషకుల భావన. ఉభయ సభలూ అధికార పార్టీ కనుసన్నల్లో, పాలకుల అభీష్టం మేరకు సాగుతున్నాయని ఆరోపణ.
2010లో 2జీ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోరుతూ మొత్తం సమావేశాల్ని నీరు గార్చిన చరిత్ర నాటి ప్రతిపక్ష బీజేపీది. అప్పట్లో పార్లమెంట్ స్తంభనా ప్రజాస్వామ్యమే, మంచిదే అంటూ అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు అన్న మాటను ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. పార్లమెంట్ నిర్వహణతో ఖజానాకు ప్రతి నిమిషానికీ రూ. 2.5 లక్షలు ఖర్చవుతాయని 2017 నాటి లెక్క. పార్లమెంట్ స్తంభనతో ప్రజాధనం కోట్లలో వృథా అవుతోంది. బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో పార్లమెంట్ ఆరోగ్యకర చర్చలతో సాగుతోంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన మన దగ్గరే ప్రతిష్టంభన. బ్రిటన్‌లో వారానికోరోజు ప్రతిపక్షాలు వేసే ఏ ప్రశ్నకైనా మంత్రులు జవాబిచ్చే సత్సంప్రదాయం ఉంది. మన దగ్గర అయిదేళ్ళుగా ప్రధాని ఒక్క ప్రశ్నకూ జవాబివ్వని పరిస్థితి.
ఒకప్పుడు అర్థవంతమైన చర్చలెన్నిటికో వేదికైన పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు ఏటా మూణ్ణాలుగుసార్లు తప్పనిసరి తద్దినాలుగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సుహృద్భావం మాట దేవుడెరుగు... పరస్పర విశ్వాసమైనా లేకుండా పోయింది. సభలో చర్చలు మొదలెడితే, ఆనక తమ చట్టాలు ఆమోదం పొందవేమోనని పాలకపక్ష అనుమానం. ముందే చట్టాలకు ఆమోదముద్ర పడిపోతే, ఆపైన అంశాలపై చర్చ లేకనే సభను వాయిదా వేసేస్తారని ప్రతిపక్షాల భయం. ఈ అను మాన భూతాన్ని ఎంత త్వరగా పారదోలితే దేశానికి అంత మంచిది. భిన్నాభిప్రాయాల వేదికగా పార్లమెంట్‌లో చర్చలే ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రాణవాయువు. వైరివర్గాలుగా చీలిన పాలక, ప్రతి పక్షాలకు గుర్తు చేయాల్సింది ఒకటే – ‘నూరు పూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ’!
ఇదేనా మన సంప్రదాయం?
Published Fri, Jul 29 2022 12:13 AM | Last Updated on Fri, Jul 29 2022 12:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment