తిమిరంతో సమరానికి ప్రతీకగా దీపాల పండుగ మళ్ళీ వచ్చింది. టపాకాయలపై వివాదాన్ని తిరిగి తెర మీదకు తెచ్చింది. కాలుష్యానికి కారణమవుతున్న టపాసులు కాల్చడం సమంజసమేనా? తక్కువ కాలుష్య కారకాలతో, కొంత మేర పర్యావరణానికి అనుకూలమైన ‘హరిత టపాసులు’ కాలిస్తే ఫరవాలేదా? ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో విధించిన షరతులు, పశ్చిమ బెంగాల్– ఢిల్లీ– హర్యానా లాంటి రాష్ట్రాల్లో పూర్తి నిషేధాల మధ్య సుప్రీమ్ కోర్టు సోమవారం ఆచరణవాద ధోరణితో మళ్ళీ ఆదేశాలివ్వక తప్పలేదు. వేల కోట్ల రూపాయల వ్యాపారం, లక్షల కుటుంబాల జీవనం ఆధారపడ్డ టపాసులపై కలకత్తా హైకోర్టు అక్టోబర్ 29న విధించిన సంపూర్ణ నిషేధపుటుత్తర్వులను ‘తీవ్రమైనవి’గా పేర్కొంటూ, సర్వోన్నత న్యాయస్థానం వాటిని పక్కనపెట్టింది. దీపావళి, కాళీపూజ, ఛఠ్ పూజ మొదలు క్రిస్మస్ లాంటి పర్వదినాలకు టపాసుల కొనుగోళ్ళు, అమ్మకాలు, కాల్చడాన్ని దేశంలో ఎక్కడా గుడ్డిగా నిషేధించలేమని తేల్చింది.
అంటే – దేశంలో గాలి నాణ్యత నాసిగా లేని ప్రతి పట్నంలో జనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు సుప్రీమ్ గతంలో పలు పర్యాయాలు ఆదేశించినట్టు గ్రీన్ క్రేకర్స్ కాల్చుకోవచ్చన్న మాట. హానికారక రసాయనాల వినియోగం, టపాసులపై పెట్టిన షరతులు అమలయ్యేలా యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్‌కి సుప్రీమ్ చెప్పింది. దేశమంతటా క్షేత్రస్థాయిలో అది ఏ మేరకు అమలవుతుందన్నది పక్కన పెడితే, టపాసుల వ్యాపారులకు ఇది ఊరటే! గంపగుత్త నిషేధం అసంభావ్యమని సుప్రీమ్ కోర్టు అంగీకరించడం గడచిన కొద్ది రోజుల్లో ఇది రెండోసారి. నిజానికి, కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చిన రోజునే, టపాసులపై పూర్తి నిషేధం సముచితం కాదని మరో కేసులో సుప్రీమ్ పేర్కొంది. రాష్ట్రాలలో ఎక్కడైనా నిషేధిత టపాసులను వినియోగిస్తే, అక్కడి ఛీఫ్ సెక్రటరీలు, ప్రభుత్వ, పోలీసు అధికారులే వ్యక్తిగతంగా బాధ్యులని అప్పుడే హెచ్చరించింది.
టపాసుల వ్యవహారం కొన్నేళ్ళుగా కోర్టులకెక్కుతూనే ఉంది. సుప్రీమ్ 2018లోనే టపాసుల్లో బేరియమ్ సాల్ట్స్ వినియోగాన్ని నిషేధించింది. ‘హరిత టపాసుల’నే అనుమతించింది. నిజానికి, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలోని ‘పెట్రోలియమ్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (పెసో) ఇప్పటి దాకా 4 రకాలనే ‘హరిత టపాసులు’గా పేర్కొంది. ఈ సెప్టెంబర్ తొలి వారానికి దేశంలో 169 టపాసుల తయారీ సంస్థలు మాత్రమే ఈ గ్రీన్ క్రేకర్స్ తయారీకి దాని నుంచి అనుమతి పొందాయి. కానీ, విపణిలో అమ్ముతున్నవన్నీ నిజంగా ‘గ్రీన్’యేనా? మామూలు వాటికన్నా కేవలం 30 శాతమే తక్కువ కాలుష్యకారకమైన హరిత టపాసులైనా ఏ మేరకు సురక్షితం? కలకత్తా హైకోర్ట్ అన్నట్టు నిషేధిత టపాసులకూ, వీటికీ మధ్య తేడాను గుర్తించే వ్యవస్థ ప్రభుత్వాల వద్ద ఏ మేరకుంది? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నార్థకమే! టపాసుల తయారీదార్లలో అత్యధికులు నకిలీ క్యూఆర్ కోడ్లతో తమ ఉత్పత్తులను ‘గ్రీన్’ అని ముద్ర వేస్తున్నారు. ఆ టపాసుల్లో నిషేధిత బేరియమ్ సాల్ట్స్ వాడుతున్నట్టు సీబీఐ సైతం కనిపెట్టింది. ఈ మాట సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టే ఆ మధ్య చెప్పింది.
ఆరోగ్య, పర్యావరణ హాని అటుంచితే, చెవులు దిమ్మెత్తించే కాల్పులు, మోతల సంబరాన్ని ఓ ధార్మిక విశ్వాసానికి ముడిపెట్టి మాట్లాడడమూ ఇటీవల ఎక్కువైంది. పశుపక్ష్యాదుల నుంచి ప్రజల దాకా అందరికీ కాలుష్యంతో ఇబ్బంది తెచ్చే పద్ధతి మానుకొమ్మంటే, అది ఓ మతానికి వ్యతిరేకంగా కొందరు చేస్తున్న కుట్ర అనే మాటలూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. టపాసులను రోడ్డు మీద కాల్చద్దంటూ, పిల్లలకు రహదారి భద్రతను బోధిస్తూ నటుడు ఆమిర్ ఖాన్‌తో టైర్ల సంస్థ ‘సియట్’ వాణిజ్య ప్రకటన రూపొందిస్తే, దాన్ని కూడా వివాదాస్పదం చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఏకంగా ఇది ఓ మతానికి వ్యతిరేకమైన నటులు, ఆ మత విశ్వాసాలను దెబ్బతీసేలా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై మరో మతం చేసే దైవ ప్రార్థనల్నీ, రోజూ ప్రార్థన వేళల్లో మైకులో ఇచ్చే ఆ మతం పిలుపునూ తప్పుపట్టారు. వెరసి, టపాసుల కాలుష్యం కన్నా ధార్మిక విశ్వాసాలను రెచ్చగొట్టే భావ కాలుష్యం పెరగడం శోచనీయం.
దీపాల వరుసనే అసలైన అర్థంలో ప్రమిదలను వెలిగించి, గోగునార కట్టలను వెలిగించి, దివిటీలు కొడుతూ సంబరం చేసుకోవడం తొలినాళ్ళ దీపావళి. కాలగతిలో దాన్ని కాలుష్యకారక టపాసుల పండగగా మార్చేశాం. ఇప్పుడు 10 లక్షల కుటుంబాలు ఆధారపడ్డ రూ. 5 వేల కోట్ల వ్యాపారంగా, బాల కార్మిక వ్యవస్థకూ, అసురక్షిత వాతావరణానికీ అది ఆలవాలమైంది. తమిళనాట శివకాశిలోనే దేశంలోని 80 శాతం టపాసులు తయారవుతున్నాయి.
టపాసులతో జరుగుతున్న నష్టం తెలిశాక అయినా, ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అనే ఆర్ష సంస్కృతిని అనుసరిస్తూ, పర్యావణానికి హాని కలగని రీతిలో పండుగ జరుపుకొంటే ధార్మిక విశ్వాసాలను ధిక్కరించినట్టా? సమస్త ప్రకృతినీ దైవంగా భావించే సంస్కృతిని గౌరవించినట్టా? వృద్ధులు, పిల్లలు, చివరకు పెంపుడు జంతువులను కూడా భయపెట్టి, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా భారీ మోతల టపాసులు కాలిస్తేనే – ధర్మాన్నీ, దేవుణ్ణీ నమ్మినట్టా? ప్రపంచం పెనుముప్పులో పడి, పర్యావరణంపై ‘కాప్–26’ లాంటి సదస్సులు జరుపుతున్న వేళ వీటికి జవాబు తెలియనిదేమీ కాదు. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు. అందుకు ఎవరినీ అనుమతించరాదన్న సుప్రీమ్ మాటను ఇంట్లో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనదే!
చీకటి వెలుగుల రంగేళి
Published Wed, Nov 3 2021 12:29 AM | Last Updated on Wed, Nov 3 2021 9:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment