ఎన్ని అలలు ఎగిసినా...  | Sakshi Editorial On Upcoming Corona Third Wave In India | Sakshi
Sakshi News home page

ఎన్ని అలలు ఎగిసినా... 

Published Mon, Jun 7 2021 1:33 AM | Last Updated on Mon, Jun 7 2021 1:33 AM

Sakshi Editorial On Upcoming Corona Third Wave In India

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుదల ఆశావహ పరిస్థితులు కల్పిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ వాతావరణం నెలకొంటోంది. కొన్ని వారాలుగా దాదాపు అన్ని రాష్ట్రాలూ కఠిన ఆంక్షలు విధించి, అమలుపరచిన కట్టడి ఫలితమే ఇది! కోవిడ్‌–19 రెండో అల ఉదృతంగా వచ్చి, ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగటం, మరణాల రేటు అధికమవడం, నెల కింద దేశాన్ని కుదిపేసింది. స్థానిక పరిస్థితుల్ని బట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచన చేసింది. ఆ మేర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి ప్రకటించి, అవసరమైన నిర్ణయాలతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టాయి. అందుకు తగ్గట్టుగానే ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగించింది. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు..మన దేశంలో కోవిడ్‌ మూడో అల గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో కేసులు రమారమి తగ్గుతున్న తాజా పరిణామం ఆశాజనకమే! పలు రాష్ట్రాల్లో కట్టడి వివిధ స్థాయిల్లో, వేర్వేరు నమూనాల్లో ప్రస్తుతం అమలౌతోంది. కొన్ని చోట్ల సమయ పరిమితులుంటే, మరి కొన్ని చోట్ల పలు అంశాలపైన, వ్యవస్థలపైన ఈ కట్టడి పాక్షికంగానో, పూర్తిగానో కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గుతున్న పరిస్థితుల్లో కట్టడి ఉపసంహరణ ఎలా చేస్తారు? ఏ అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? తదనంతరం ఏయే జాగ్రత్తలు పాటిస్తారన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. దశల వారీ ఉపసంహరణ ప్రక్రియ అక్కడక్కడ మొదలవుతోంది. అత్యధిక కేసులు నమోదై తీవ్ర కలవరపాటుకు గురి చేసిన దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇటీవల కేసులు బాగా తగ్గిపోయాయి. ఆయా ప్రభుత్వాలు పాక్షిక ఉపసంహరణను ప్రకటించాయి. ఇవాల్టి నుంచి సదరు సడలింపులు అమల్లోకి వస్తున్నాయి. తమిళనాడు తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి  మెరుగవుతోంది. తాజా పరిస్థితిని మదింపు చేసి, తదుపరి నిర్ణయం వెల్లడించనున్నట్టు ఆయా ప్రభుత్వాలు సంకేతాలిచ్చాయి. పరిస్థితులు అదుపులోకి రాని తమిళనాడు, మేఘాలయ వంటి రాష్ట్రాలు కట్టడి పొడిగించాయి.

           పెద్ద జనాభా దేశంగా లెక్కించినపుడు, తాజా పరిస్థితి... రెండో అల బలహీనపడుతున్న సంకేతమే! ప్రభావవంత పునరుత్పత్తి రేటు 0.68కి పడిపోయింది. పరీక్షలు జరిపిన వారిలో వైరస్‌ సోకిన వారి సంఖ్య తగ్గుతోంది. వారపు సగటు 7 శాతంగా నమోదయినా, రోజువారీ రేటు 5 శాతానికి తగ్గింది. కిందటి వారపు సగటు (10 శాతం)తో పోల్చి చూస్తే కేసుల సంఖ్య తగ్గుముఖంలో ఉన్నట్టు స్పష్టమౌతోంది. అదే సమయం, దేశంలో మొత్తంగా రోజువారీ కేసుల సంఖ్య 1.30 లక్షల వరకుండటం, మరణాలు 2500 నుంచి 3000 వరకు నమోదవడం చూస్తే, మహమ్మారిని నిలువరించామని చెప్పలేని పరిస్థితి. ప్రపంచంలో ఇప్పుడిదే అత్యధికం! మన తర్వాత బ్రెజిల్‌ (64వేలు), అర్జెంటీనా (30వేలు)ల్లో రోజువారీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు పరీక్షల సంఖ్య పెరుగుతూ మరో వైపు పాజిటివిటీ రేటు తగ్గితే అది శుభ పరిణామం! ప్రస్తుతం దేశంలో ఒకరోజు 20.84 లక్షల పరీక్షలు జరుపగా టీపీఆర్‌ 4.8 శాతంగా నమోదైంది. కిందటి వారపు రేటు (9.8 శాతం)లో ఇది సగం. రాష్ట్రాల్లో కట్టడి ఆంక్షలు సడలించడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) కొన్ని మార్గదర్శకాల్ని సూచించింది. టీపీఆర్‌ 5 శాతం కన్నా తగ్గడం, ప్రాధాన్య వర్గాల్లో 70 శాతం మందికి టీకాలు ఇచ్చి వుండటం, కోవిడ్‌ సముచిత ప్రవర్తన (సీఏబీ)కి పౌరసమాజాలు ముందుకు రావడం... ఉన్న జిల్లాల్లో కట్టడిని సడలించ వచ్చన్నది వాటి అంతరార్థం!

         దేశంలో బాగా ప్రభావం చూపిన ఆల్ఫా (బి.1.1.7), డెల్టా (బి.1.617.2), ఈ రెండు కరోనా వైవిధ్య వైరస్‌లే రెండో అల ఉధృతికి కారణాలు. ‘ఈ రెండు వైవిధ్యాలే కడపటివి కావు, ఇప్పుడున్న రెండో అలే చివరిది కాదు!’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నిరోధంలో ఆంక్షలతో కూడిన కట్టడి మంచి ఫలితమిచ్చిన మాట వాస్తవమే! అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమూ పడింది. మనిషి మనుగడకు ‘ప్రాణం–ప్రాణాధారం’ రెండూ ముఖ్యమే! ప్రాణాలు కాపాడే క్రమంలో.. ప్రాణాధారమైన ఉద్యోగ, ఉపాధి పనులపై దెబ్బపడి, ఉత్పత్తి, వ్యాపార–వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవడం మంచిది కాదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, వైరస్‌ కట్టడి ద్వారా అటు ప్రజల ప్రాణాల్ని కాపాడాలి. కట్టడిని సడలించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించి సమాజ మనుగడనూ కాపాడాలి. వాటి మధ్య సమతూకం సాధించాలి. అవసరమైన పటిష్ట ప్రజా వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలి. వైరస్‌ ఏ వైవిధ్య రూపంలో వచ్చినా, మరే అల ఉధృతితో తోసుకువచ్చినా సమర్థంగా ఎదుర్కోగల స్థితి తీసుకురావాలి. తగిన సంఖ్యలో పరీక్షలు, పాజిటివిటీ అదుపు, మరణాల నియంత్రణ, కోలుకుంటున్న వారి సంఖ్య వృద్ధి సాధించాలి. వారంపై వారం పరిశీలన చేస్తూ, ఎపిడమాలజీ పరంగా, జీనోమ్‌ పరంగా పరిశోధనలు జరిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏది మూడో అలనో రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి. ఈ క్రమంలో చేపట్టే చర్యలకు పౌరసమాజం నిర్మాణాత్మక సహకారం అందించాలి. అప్పుడే, ఈ విపత్తు నుంచి అందరం బయటపడుతాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement