గాలిబుడగలు సైతం గందరగోళం సృష్టించి, దేశాల మధ్య సంబంధాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తాయని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేశాయి. చైనా దేశపు నిఘా నేత్రంగా అనుమా నిస్తున్న భారీ బెలూన్ తన గగనతలంలో తిరగడం గమనించిన అమెరికా ఫిబ్రవరి 4న దాన్ని వివిధ యుద్ధ విమానాలతో చుట్టుముట్టి, క్షిపణి ప్రయోగంతో వ్యూహాత్మకంగా తన ప్రాదేశిక సముద్ర జలాలపై పేల్చివేసిన వైనం అంతర్జాతీయంగా ఒక సంచలనం. అంతకు మించి గత నవంబర్‌లో జీ–20 దేశాల బాలీ సదస్సు వేళ షీ జిన్‌పింగ్, బైడెన్‌ల భేటీతో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయని ఆశిస్తున్న చైనా – అమెరికా దౌత్య సంబంధాల్లో ఇది పెద్ద కుదుపు.
డ్రాగన్ దొంగ ఎత్తులపై మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ ఓ మేలుకొలుపు. చైనా సహా కట్టెదుటి ముప్పును గమనించిన ఏ సార్వభౌమ దేశమైనా చేసే పనినే అమెరికా చేసింది కాబట్టి తప్పు పట్టలేం. నిజానికి, చైనా గాలిబుడగ అనుమానాస్పదంగా కొద్ది రోజులుగా పయనిస్తోంది. కెనడా మీదుగా మోంటానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. అమెరికా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ క్షేత్రాలు మూడింటిలో ఒకటి అక్కడే ఉంది. సైనిక, వ్యూహాత్మక స్థలాలను కనిపెట్టడానికి చైనా దీన్ని సాధనంగా వాడుతోందని భావించిన అమెరికా, అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశంతో అదను చూసి పేల్చేసింది. గతంలో అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనూ ఈ గాలిబుడగల మూడో కన్ను పలుచోట్ల అగ్రరాజ్యపు వినువీధుల్లో విహరించింది. తెంపరిగా పేరున్న ట్రంప్ వాటిపై చర్యకు అప్పుడు తెగించలేదు. ఇప్పుడు దేశీయంగా అనేక ఒత్తిళ్ళలో ఉన్న బైడెన్ మటుకు 3 స్కూల్ బస్సుల పరిమాణంలోని ఆ గాలిబుడగను పేల్చేశారు.
మొదట అనిష్టంగా ఉన్నా, ఆఖరికి అది తమ బెలూనే అని చైనా విదేశాంగ శాఖ ఒప్పుకుంది. కాకపోతే, దాన్ని గూఢచరానికి వాడుతున్నామన్న వాదనను మాత్రం తోసిపుచ్చింది. అది వాతా వరణ పరిశోధనకు వాడే పౌర వైమానిక నౌక అనీ, దారితప్పి పొరపాటున అటు వచ్చిందనీ బుకాయించింది. విచారం వ్యక్తం చేసింది. నమ్మలేని ఆ మాటలు అటుంచితే, డ్రాగన్ ఇలా నిఘా బెలూన్లను వాడినట్టు తైవాన్, 2020, 2021ల్లో జపాన్ లాంటి దేశాల నుంచి గతంలోనూ ఆరోపణ లొచ్చాయి. భారత్‌పైనా ఇలాంటి ప్రయోగాలే సాగాయి. అవి చైనావేనన్న అధికారిక సాక్ష్యాధారాలు దొరక్కపోతేనేం... గత ఏడాది జనవరిలో అండమాన్, నికోబార్ దీవులపై గాలిబుడగలు తిరిగాయి. నిఘా ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి చౌకే కాదు, లక్షిత భూ ఉపరితలానికి దగ్గరగా వెళ్ళి మరింత స్పష్టమైన ఛాయాచిత్రాలు తీయగలవు.
సాధారణంగా వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గం కన్నా రెట్టింపు ఎత్తు దాటి, 80 వేల నుంచి లక్షా 20 వేల అడుగుల ఎత్తున నిఘా సాధనాలతో ఈ నిఘా బెలూన్లు వెళుతుంటాయి. కీలక సమాచారాన్ని సేకరించడానికీ, ఇతర సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికీ వీటిని వినియోగిస్తుంటారు. ఈ బెలూన్లలో సౌరవిద్యుత్‌తో నడిచే కెమెరా, రాడార్ లాంటివి ఉంటాయి. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి ఎంత ఎత్తులో ప్రయాణించాలనేది ఎప్పటికప్పుడు మారుస్తూ బెలూన్లను లక్షిత ప్రాంతానికి చేరేలా మార్గదర్శనం చేస్తారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చౌకగా గూఢచర్యం నిర్వహించే విధానంగా అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ నిఘా గాలిబుడగల పద్ధతిని వాడాయి. ఇటీవల సైతం ఇలాంటి చైనా నిఘా బుడగలు అనేకం ప్రపంచపు పెద్దన్న వియత్తలంలో విహారం సాగించాయి. అయితే, తాజా బెలూన్ దీర్ఘకాలంగా అక్కడక్కడే తిరుగుతుండడంతో, పేల్చివేతకు గురైంది.
తప్పు చేసినా సరే తననెందుకు తప్పుపడుతున్నారన్నట్టుంది చైనా వైఖరి. అమెరికా గగనతలంపైనే అయినా, తమ బెలూన్‌ను పేల్చినందుకు సదరు అగ్రరాజ్యం ఇంతకింత ఫలితం అనుభవిస్తుందని బెదిరిస్తోంది. ఈ ఘటనతో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈ 6న జరగాల్సిన తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. గత కొన్నేళ్ళలో ఒక ఉన్నత స్థాయి అమెరికా దౌత్యవేత్త చైనాకు వెళ్ళడం ఇదే తొలిసారి. తీరా అదీ రద్దయింది. పర్యటనపై ఇరుపక్షాలూ ప్రణాళిక ఏదీ వేసుకోలేదని బీజింగ్ బింకంగా చెబుతోంది కానీ, జరగాల్సిన దౌత్యనష్టం జరిగిపోయింది. స్నేహానికి చేయి చాస్తూనే, చాటున చేయదలుచుకున్నది చేసేయడంలో చైనా జగత్ కిలాడీ అని మళ్ళీ ఋజువైంది.
ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామంటూ తాజా ఘటన అనంతరమూ చైనా ప్రకటించింది. కానీ, డ్రాగన్ గత చరిత్ర, నేటికీ మారని నైజం తెలిసినవారెవరూ ఆ మాటలను విశ్వసించలేరు. భారత్ సహా తన అగ్రరాజ్య హోదాకు అడ్డనుకున్న ప్రతి దేశంతో సున్నం పెట్టు కోవడం, తైవాన్ లాంటివి తనవేనంటూ దాడులకు దిగడం చైనాకు నిత్యం అలవాటే. అమెరికా లాగా తానూ ప్రపంచ పోలీసు పాత్ర పోషించాలనే తహతహ చైనాలో చిరకాలంగా కనపడుతున్నదే. ఆ దుగ్ధ లేకపోతే ఇలాంటి నిఘా నేత్రాల పనేమిటి? ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో ఎంత బల మైన శక్తి రాజ్యమైనప్పటికీ, చైనా తన హద్దులు దాటి పరాయిగడ్డపై తన బెలూన్లను తిప్పాలనుకుంటే అది ఉపేక్షనీయం కాదు. ప్రపంచం అందుకు మౌనంగా అనుమతించాలనీ, అంగీకరించాలనీ బీజింగ్ కోరుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు. నిఘా సహా అనేక అంశాల్లో చైనా పాలకుల ఎలుక తోలు నైజం తెలిసిందే కాబట్టి, భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నక్కజిత్తులను సహించేది లేదని మాటల్లోనూ, చేతల్లోనూ చూపాలి. ఎందుకంటే, సమ యానికి ముకుతాడు వేయకుంటే డ్రాగన్ దూకుడు ఆగదని అమెరికా సహా అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment