మరో ప్రచ్ఛన్న యుద్ధ సైరన్‌! | Vardhelli Murali Article On Ukraine Russia War And India Stand | Sakshi
Sakshi News home page

మరో ప్రచ్ఛన్న యుద్ధ సైరన్‌!

Published Sun, Feb 27 2022 12:52 AM | Last Updated on Sun, Feb 27 2022 12:54 AM

Vardhelli Murali Article On Ukraine Russia War And India Stand - Sakshi

దౌత్యనీతిలో భావోద్వేగాలకు తావు లేదంటారు. ఆ రంగం లోని ప్రవక్తలందరిదీ ఇదే మాట. ఈ రహస్యం తెలియకపోవడం వలన మనవాళ్లు చాలామంది ఉక్రెయిన్‌ యుద్ధంపై ఉద్రేక పడుతూ సోషల్‌ మీడియాను ఉడుకెత్తిస్తున్నారు. ఈ యుద్ధంపై భారత్‌ వైఖరి ఎలా ఉండాలన్న దాని గురించి మూడు నాలుగు స్రవంతులుగా చీలిపోయారు. లక్షలాది క్యూసెక్కుల ఆవేశం ఆ స్రవంతుల గుండా ప్రవహిస్తున్నది.

కష్టకాలాల్లో మనకు అండగా నిలబడిన దేశం రష్యా. ఇప్పటికీ మన దేశ రక్షణకు ఆలంబన రష్యా. అణుపాటవ పరీక్ష చేసినప్పుడు ఐక్యరాజ్యసమితిలో మనకు వ్యతిరేకంగా ఓటేసిన దేశం ఉక్రెయిన్‌. కశ్మీర్‌ అంశంపై కూడా ఆ దేశానిది మనకు వ్యతిరేక వైఖరి. ఈ నేపథ్యంలో మనం స్పష్టమైన వైఖరి తీసుకుని మిత్రునికి అండగా నిలబడాలి కదా... ఇది ఒకటవ భావస్రవంతి! బలహీనునిపై బలవంతుని దౌర్జన్యం అమా నుషం. బలాఢ్యుడైన రష్యావాడు అర్భకుడైన ఉక్రెయిన్‌వాడిపై జరిపిన దండయాత్రను ఖండించాలనేది రెండో మానవీయ స్రవంతి! రష్యా, చైనాలతో కలిసి భారతదేశం కూడా ఒక కూటమిగా ఏర్పడి అమెరికా సామ్రాజ్యవాదులనూ, వారి ఏజెంట్లయిన ‘నాటో’ కూటమి దేశాలనూ ఆటాడించడానికి ఇదే సరైన అదను – ఇది ‘ఎర్ర’ సముద్రపు సూయెజ్‌ కాలువ ప్రవాహం! మన చదువుల దగ్గర్నుంచి కొలువుల దాకా, మాట్రిమోనియల్‌ కాలమ్స్‌ నుంచి పచ్చడి జాడీల దాకా మన జీవితాలతో ముడిపడిన దేశం అమెరికా. ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించడం మేలన్నది నాలుగవ డాలర్‌ కెనాల్‌! ఈ రకమైన జనచైతన్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెప్పలుగా పారుతున్నది. మంచిదే. నూరు పువ్వులు వికసించాలి. వెయ్యి ఆలోచనలు పోటీపడాలి.

అధికారికంగా భారతదేశం ఇప్పుడు శరణుజొచ్చిన వ్యూహం – మౌనం. దౌత్యవర్గాలు ఇప్పుడు దీన్ని ‘వ్యూహాత్మక మౌనం’ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎవరీ మాటను కాయిన్‌ చేశారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో భారత్‌ అవసరాలకు ఈ ‘వ్యూహాత్మక మౌనం’ సరిగ్గా సరిపోతున్నది. ఈ మౌనవ్యూహం మనకు వేదంతో పెట్టిన విద్య. ఇవ్వాళ్టిది కాదు. ఎవరి మోవిపై వాలితే మౌనమే మంత్రమగునో... వారే మునులు. ఆ ముని పరంపర నుంచి అత్యవసర సమయాల్లో ఆశ్రయించడానికి మౌనం, ధ్యానం అనే విద్యలు మనకు సంక్రమించాయి. మహాభారత యుద్ధకాలంలో ఉపఖండంలోని చాలా రాజ్యాలు అటు కౌరవుల పక్కనో, ఇటు పాండవుల పక్కనో చేరి యుద్ధంలో పాల్గొన్నాయి. ఏ పక్కనా చేరకుండా మౌనాన్ని ఆశ్రయించి, తటస్థంగా ఉండిపోయిన రాజ్యాలు కూడా చాలానే ఉన్నాయట! వీటికి ‘విబంధ రాజ్యాలు’ అనే పేరు భారతంలో ఉన్నదట!

పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ అలీనోద్యమాన్ని (Non-Aligned Movement) ప్రారంభించినప్పుడు తెలుగు పత్రికల్లో ఈ ‘విబంధ రాజ్యాల’ చర్చ జరిగిందట. అప్పట్లో ఆంగ్ల భాషలో ఉన్న ఏ కొత్త విషయాన్ని చెప్పవలసి వచ్చినా తెలుగులో అనువదించడానికి తంటాలుపడేవారు. ఇప్పటి మాదిరిగా ఆంగ్ల మాటల మీదనే తెలుగు తీర్థం చల్లి, యథాతథంగా వాడేసుకునే సాహసం అప్పట్లో చేసేవాళ్లు కాదు. ‘నాన్‌ అలైన్డ్‌ మూవ్‌మెంట్‌’ అనే మాటను ‘అలీనోద్యమం’గా నార్ల వెంకటేశ్వరరావు స్థిర పరిచారు. దీనికి ‘ఆంధ్రపత్రిక’ వారు అంగీకరించలేదు. మహా భారతం స్ఫూర్తితో ‘విబంధ రాజ్య ఉద్యమం’గా వ్యవహరిద్దా మన్నారు. నార్ల శిబిరం ఒప్పుకోలేదు. కాలక్రమంలో ‘ఆంధ్రపత్రిక’ వాదన వీగిపోయింది. ‘అలీనోద్యమం’ అనే మాట నిలబడిపోయింది. ఈ మాట నెహ్రూ గారితో ముడిపడి ఉన్నందువలన, నెహ్రూ ఇంటి మీద వాలిన కాకి కనిపించినా ఇప్పుడు కాల్చివేసే పరిస్థితులున్న కారణంగా– మన ప్రస్తుత వైఖరి అలీనోద్యమ వారసత్వంగా చెప్పే సాహసం ఎవరికీ లేదు. పైగా ఏక ధ్రువ ప్రపంచంలో అలీనమేముంటుంది... విలీనం తప్ప అనే వాదన కూడా ఉన్నది.

వ్యూహాత్మక మౌనం కాకుండా ఈ సంక్షోభంలో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరించాలంటే ఏం చేయాలి? ఒకటవ ప్రత్యామ్నాయం – మిత్రధర్మంగా రష్యాను సమర్థించడం! ఉక్రెయిన్‌ మీద రష్యా దండయాత్ర చేసినట్టు ఇండియా మీద చైనా చేయడానికి వారికి చాలా సాకులున్నాయి. లద్దాఖ్‌లో గానీ, అరుణాచల్‌ప్రదేశ్‌లో గానీ నిర్దిష్టమైన అంగీకృత సరిహద్దులు ఇప్పటికీ లేవు. లద్దాఖ్‌లో చైనా వాళ్లు మరిన్ని గల్వాన్‌ ఘర్షణలకు దిగితే రష్యా దండయాత్రను సమర్థించిన నోటితో చైనాకు వ్యతిరేకంగా ఏమని పిలుపునివ్వగలం? రెండో ప్రత్యా మ్నాయంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉక్రెయిన్‌కు బాసటగా నిలవడం! ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా ఏ కూటమిలోనైనా చేరే స్వేచ్ఛ ఉక్రెయిన్‌కు ఉన్నదని మనం గట్టిగా వాదిస్తే మనదేశ ప్రజాస్వామ్య పిపాసను లోకం మెచ్చుకోవచ్చు. కానీ రేప్పొద్దున భారత్‌ వల్ల తన భద్రతకు ముప్పు ఉన్నదని ప్రకటించి నేపాల్‌ దేశం చైనా సైనిక కూటమిలో చేరి మన కాశీకి, కలకత్తాకు గురిపెట్టి సరిహద్దుల్లో మిసైళ్ళను పేర్చితే? లోకానికి ఫిర్యాదు చేసే అవకాశం భారత్‌కు మిగులుతుందా? కనుక ఉక్రె యిన్‌ సంక్షోభంలో భారత్‌ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం సరైనదిగానే భావించాలి. ప్రధానమంత్రిగా మోదీ ఉన్నా, లేక పీలూమోదీ వున్నా ఇంతకు మించిన తరుణోపాయం లేదు.

రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్‌ పుతిన్‌ వ్యక్తిత్వంపైన కూడా చాలా రకాల కథనాలు వస్తున్నాయి. జార్‌ చక్రవర్తులకున్నంత అహంకారం, అత్యాశ ఉన్నాయనీ, సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత కోల్పోయిన భూభాగాలను మళ్లీ సాధించాలనే విస్తరణ కాంక్ష అతనికున్నదనీ చాలా ప్రచారం జరిగింది. ఉక్రెయిన్‌పై జరిగిన దాడిని కూడా ఈ కోణంలో నుంచి చూసే వారున్నారు. జరిగిన పరిణామాలను రష్యా వైపు నుంచి కూడా చూస్తేనే సమస్య సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది. 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. రష్యాతోపాటు మరో 14 రిపబ్లిక్‌లు సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉండేవి. ఇవన్నీ స్వతంత్ర దేశాలుగా ప్రకటించు కున్నాయి. వీటిలో కజక్‌స్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్ఘిజిస్థాన్‌లు సెంట్రల్‌ ఆసియా రిపబ్లిక్‌లు. యూరప్, పశ్చిమాసియా ఖండాలను విభజించే కాకేసస్‌ పర్వత శ్రేణుల సమీపంలో జార్జియా, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ రిపబ్లిక్‌లున్నాయి. రామాయణంలో కైకేయి పుట్టిన కేకయదేశం ఇదేనని మనవాళ్ల నమ్మకం. మిగిలిన ఆరు రిపబ్లిక్‌లు రష్యాకు పశ్చిమ సరిహద్దుగా పైన బాల్టిక్‌ తీరం నుంచి కింద బ్లాక్‌సీ తీరం వరకు విస్తరించి ఉన్నాయి. బాల్టిక్‌ తీరంలో లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, నల్ల సముద్ర తీరంలో మాల్డోవా, ఉక్రెయిన్, రెండు తీరాల నడుమ మైదాన సరిహద్దుగా బెలారూస్‌లున్నాయి. పశ్చిమ యూరప్‌ నుంచి చూస్తే రష్యాకు ఈ ఆరు రిపబ్లిక్‌లూ ఒక కవచంలాగా ఉంటాయి. వాస్తవానికి ఇది రెండో కవచం. సోవియట్‌ యూనియన్‌గా ఉన్నప్పుడు ఈ కవచంపైన ఎనిమిది తూర్పు యూరప్‌ దేశాలతో కూడిన మరో రక్షణ కవచం ఉండేది. అమెరికా – పశ్చిమ యూరప్‌ల ‘నాటో’ సైనిక కూటమికి దీటుగా ఈ ఎనిమిది తూర్పు యూరప్‌ దేశాలతో ‘వార్సా ప్యాక్ట్‌’ పేరుతో సోవియట్‌ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నది. తూర్పు జర్మనీ, పోలండ్, చెకోస్లోవేకియా (ఇప్పుడు చెక్, స్లోవేకియా), హంగెరీ, రుమేనియా, యుగోస్లావియా (ఇప్పుడు స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా, కొసావో, మాంటెనిగ్రో), బల్గేరియా, అల్బేనియాలు ఈ ‘వార్సా ఒప్పందం’లో సభ్యదేశాలు.

సోవియట్‌  యూనియన్‌ పతనానికి ముందూ వెనక ఈ ఎనిమిది దేశాల్లో తిరుగుబాట్లు తలెత్తి, కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. బెర్లిన్‌ గోడ బద్దలై తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలో విలీనమైంది. మిగిలిన ఏడు దేశాలకు కూడా అమెరికా ఆధిపత్యంలోని ‘నాటో’ కూటమి సభ్యత్వాన్నిచ్చింది. ఈ రకంగా రష్యా బాహ్యకవచం తెగిపడింది. 1990లో పతనా వస్థలో ఉన్న సోవియట్‌ యూనియన్‌ చివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి జేమ్స్‌ బేకర్‌కు మధ్య చర్చలు జరిగాయి. ‘నాటో’ కూటమిని ఈ ఎనిమిది దేశాలకు విస్తరించినట్లయితే రష్యా భద్రతకు ప్రమాద మని గోర్బచెవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక్క అంగుళం మేరకు’ కూడా ‘నాటో’ కూటమిని తూర్పు వైపునకు విస్తరించ బోమని, కూటమి తరఫున బేకర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ నమ్మకద్రోహం జరిగింది. ఆ తర్వాత కాలంలో సోవి యట్‌లో అంతర్భాగంగా ఉండి విడిపోయిన ఆరు యూరప్‌ రిపబ్లిక్‌లపైన కూడా ‘నాటో’ కన్ను పడింది. బాల్టిక్‌ తీర దేశాలైన లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియాలను ‘నాటో’లో చేర్చు కున్నారు. రష్యా రెండో కవచం సగం తెగింది. మిగిలిన మూడు దేశాల్లో బెలారూస్‌ రష్యాకు సన్నిహితంగా, మాల్డోవా తటస్థంగా ఉన్నాయి. మిగిలిన ఉక్రెయిన్‌కూ, కాకేసస్‌ ప్రాంతంలోని జార్జియాకు ‘నాటో’ సభ్యత్వం ఇవ్వాలని అమెరికా, బ్రిటన్‌ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికి వ్యతి రేకంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలకు రష్యా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. రష్యా సమస్యను జర్మనీ, ఫ్రాన్స్‌లు అర్థం చేసు కున్నాయి. కానీ, అమెరికా, బ్రిటన్‌లు వాటి ప్రయత్నాలను కొనసాగిస్తూనే వచ్చాయి.

ఈ నేపథ్యంలో 2014లో ఉక్రెయిన్‌ దక్షిణ సరిహద్దులో నల్లసముద్రంలోకి విస్తరించిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. క్రిమియాలో పెద్దసంఖ్యలో ఉన్న రష్యన్‌ మైనారిటీలను ఉక్రెయిన్‌ అణచివేస్తున్నదని రష్యా ఆరోపిం చింది. రష్యన్‌ల అణచివేత ఆరోపణల సంగతెట్లా ఉన్నా ఉక్రెయిన్‌లోని నల్లసముద్ర తీరం ఒడెసాలోనూ, అజోవ్‌ సముద్ర తీరంలోనూ సైనిక స్థావరాల ఏర్పాటుకు బ్రిటన్‌ ఏర్పాట్లు చేసింది. రష్యా నౌకాదళానికి ఇది పూర్తిగా ప్రాణ సంకటం. ఈ మార్గం నుండే మధ్యధరా సముద్రంలోకి రష్యా ప్రవేశించగలిగేది. అందుకే రష్యా వేగంగా స్పందించింది. వెంటనే ‘నాటో’ సభ్యత్వం కోసం ఉక్రెయిన్‌ మరోమారు పరుగెత్తింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్‌ – రష్యా సరిహద్దులోని రష్యన్‌లు గణనీయంగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతంలో డానెట్స్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా ప్రకటించింది. రష్యా నుంచి డాన్‌బాస్‌ మీదుగా క్రిమియా వరకు ఒక మైదాన కారిడార్‌ రష్యా చేతికి ఇప్పుడు దొరికింది. ఈ యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉన్నా, డాన్‌బాస్‌ ప్రాంతంపై రష్యా తన ఆధిపత్యాన్ని వదులుకోకపోవచ్చు.

ఉక్రెయిన్, రష్యాల వైరం జాతి వైరంగా పరిణమించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే రష్యా ఆధిపత్యంలోని సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న 14 రష్యనేతర జాతులు ఏనాడూ వివక్షకు గురయినట్లు ఆరోపణలు రాలేదు. మూడు దశాబ్దాల పాటు సోవియట్‌ యూనియన్‌ను గుప్పెట్లో పెట్టుకొని, దాన్నొక మహత్తర శక్తిగా మలిచిన జోసఫ్‌ స్టాలిన్‌... రష్యన్‌ కాదు. జార్జియన్‌! స్టాలిన్‌ తర్వాత దశాబ్దానికి పైగా నాయకత్వం వహించి ప్రచ్ఛన్న యుద్ధ సన్నాహా లతో అమెరికాను వణికించిన నికటా కృశ్చేవ్‌... రష్యా – ఉక్రెయిన్‌ సరిహద్దు గ్రామంలో పుట్టినవాడు. రెంటికీ చెందిన వాడు. ఆ తర్వాత పదిహేనేళ్లపాటు రష్యాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులెత్తించిన లియోనిద్‌ బ్రెజ్నేవ్‌ స్వయంగా ఉక్రేనియన్‌. రష్యన్‌ల కంటే నాన్‌–రష్యన్‌లే ఎక్కువ కాలం సోవియట్‌ వ్యవహారాలను నడిపించారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం బహుశా జెలెన్‌స్కీ సర్కార్‌ను కూలదోసి రష్యన్‌ అనుకూల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంతో ఆగిపోవచ్చు. కానీ ఈ యుద్ధం ఇంతటికే పరిమితం కాదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టి కాపాడడం రష్యాకు సులభమైన పనేమీ కాదు. అఫ్గానిస్తాన్‌లో ఇటువంటి ప్రయత్నం వల్లనే సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన సంగతి అది మరిచిపోయి ఉంటుందని అనుకోలేము. ఈ మిషన్‌లో దానికి ఇంకేదో అండ కావాలి. అటువంటి రహస్య అండ లభించిన తర్వాతనే రష్యా అడుగు ముందుకు వేసి ఉండవచ్చు.

గ్లోబ్‌కు లిఖిత రాజ్యాంగం ఉండకపోవచ్చు కానీ, అలిఖితమైన ఆట నియమావళి ఒకటుంది. దాన్నే ‘వరల్డ్‌ ఆర్డర్‌’ (World Order) అంటున్నారు. ఆ ప్రపంచ ఆట నియమావళిని అన్ని దేశాలూ అర్థం చేసుకుని మసలుకుంటాయి. ‘సూపర్‌ పవర్‌’ అభీష్టం మేరకు ఆట నియమావళి ఉంటుంది. కాలక్రమంలో ‘సూపర్‌ పవర్‌’ బలహీనపడుతున్నట్టు కనిపిస్తే ఎదుగుతున్న మరో దేశం దాన్ని ఛాలెంజ్‌ చేస్తుంది. ఆట నియమావళి మారాలని డిమాండ్‌ చేస్తుంది. త్యుసిడుడీజ్‌ ట్రాప్‌ విసురుతుంది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ఈ సూత్రం ప్రకారం... బలహీనపడుతున్న సూపర్‌ పవర్‌తో బలపడుతున్న శక్తికి యుద్ధం తప్పదు. చైనా తన చేతికి మట్టి అంటకుండా విసిరిన ట్రాప్‌లో అమెరికా ఘోరంగా చిక్కుకుంది.

సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత 1990 నుంచి 2008 వరకు ప్రపంచ ఆట నియమావళి ఏక ధ్రువ ప్రపంచంగా సాగింది. అమెరికా ఆడింది ఆట, పాడింది పాట. సద్దామ్‌ హుస్సేన్‌ ధిక్కార స్వరానికి ఉరి వేసి, ఇరాక్‌ను అతలాకుతలం చేసినా చెల్లింది. కల్నల్‌ గడాఫీని మట్టుబెట్టినా చెల్లింది. అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించినా నడిచింది. ఆర్థిక వ్యవస్థలతో ఆడుకున్నా అడిగేవాడు లేడు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మందగమనం, అమెరికా బలహీనతల్ని బయటపెట్టింది. అదే సమయానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా చైనా శరవేగంగా ఎదిగింది. అమెరికా స్వరం కొద్దిగా బలహీనపడటం, చైనా గొంతులో దర్పం ధ్వనించడం మొదలైంది. ఈ పధ్నాలుగేళ్లలో చైనా ఆర్థికంగా, మిలటరీ పరంగా మరింత బలపడింది. అమెరికా మరింత బలహీనపడింది. ఇప్పుడు ‘వరల్డ్‌ ఆర్డర్‌’ మారాల్సిన అవసరం చైనాకు ఉన్నది. రష్యా వ్యవహారంలో అమెరికా తెలివితక్కువగా వ్యవహరించింది. ఇప్పటికీ అమెరికా, చైనాల తర్వాత మూడో బలమైన సైనిక శక్తి – రష్యా. అటువంటి శక్తి తటస్థంగా ఉండకుండా నంబర్‌ టూ చెంతకు చేరేలా వేటాడి వెంటాడింది. ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు ప్రయోగించినా రష్యాకు తక్షణం వచ్చే ఇబ్బందేమీ లేదు. ఆర్థిక నిపుణుల అంచనా మేరకు 630 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకం రష్యా దగ్గర ఉన్నది. కొంతకాలం వరకు ఢోకా లేదు. గ్యాస్‌ కొనుగోలుకు యూరప్‌ కస్టమర్లు దూరమైతే దాన్ని భర్తీ చేయడానికి చైనా అభయమిచ్చింది. ఈ గ్యాస్‌ డీల్‌తో నష్టపోయేది యూరప్‌ కస్టమర్లే తప్ప రష్యా కాదు. ఇప్పుడు తనకు తెలియకుండానే చైనా డిజైన్‌లో రష్యా భాగమైంది. ‘నీవే తప్ప నితఃపరం బెరుగ’నన్న రీతిగా ఇప్పుడు రష్యాకు చైనాయే సర్వస్వం. మాజీ సూపర్‌ పవర్‌ హోదాతో స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే రష్యాను చైనా క్యాంప్‌కు తరిమింది అమెరికాయే! దీంతో చైనా మరింత బలపడింది. ఇండో పసిఫిక్‌లో తనను అడ్డుకునేందుకు ‘క్వాడ్‌’ కూటమి ఏర్పాటుతో అమెరికా వేసిన ఎత్తుకు యురేషియాలో రష్యా ద్వారా చైనా పైఎత్తు వేసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో వినిపిస్తున్న శతఘ్నుల మోత బహుశా మరో ప్రచ్ఛన్న యుద్ధపు సైరన్‌ కూత కావచ్చు!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement