
భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణం ఇది. ‘ఇండియా దటీజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’. రాజ్యాంగ ముసాయిదాలో మొదట ఇండియా అని మాత్రమే ప్రతిపాదించారు. రాజ్యాంగ సభలోని కొందరు సభ్యులకు ఇది రుచించలేదు. భారత్‌గా ప్రకటిద్దామని సూచించారు. మరి కొందరు ఇండియాగానే కొనసాగిద్దామని వాదించారు. ఇండియా దటీజ్ భారత్ అనే పదబంధాన్ని ప్రయోగించి డాక్టర్ అంబేడ్కర్ ఈ వివాదానికి తెరదించారు.
ప్రాచీన చరిత్రలో భరతఖండ, భరతవర్ష అనే పేర్లతోనే మన దేశం వాసికెక్కింది. ఆధునిక చరిత్ర మాత్రం ఇండియా అనే పేరుతోనే పిలవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా వలసపాలనతో ఇండియా పేరు విశ్వవ్యాపితమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఇండియా నామస్మరణే కొనసాగుతున్నది. దేశీయంగా మాత్రం క్రమంగా భారత్ పలుకుబడి పుంజుకుంటున్నది.
ఇండియా ఆధునికతకు సంకేతమని భావిస్తే, భారత్ ప్రాచీన యశస్సుకు గుర్తుగా భావించవచ్చు. ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాంతం వరకూ ఆర్థిక రంగంలో భారత్ ఒక సూపర్ పవర్‌గా కొనసాగింది. ఒకటో శతాబ్దం నుంచి 17వ శతాబ్ది వరకు ప్రపంచ దేశాల జీడీపీ లెక్కల్లో ఎక్కువ భాగం భారత్ అగ్రభాగాన కొనసాగిందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ వలసపాలన ఆ ప్రాధాన్యాన్ని పీల్చి పిప్పిచేసి మన మయూర సింహాసనం, కోహినూర్ వజ్రాలతో పాటు ఆర్థిక సూపర్ పవర్ టైటిల్‌ను కూడా కొల్లగొట్టింది.
ఇండియా అనే మాట వలసపాలన అవశేషంగా మాత్రమే మిగిలిపోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాణానికి స్ఫూర్తిమంత్రంగా కూడా నిలబడింది. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలకూ, ఆదర్శాలకూ, ఆశయాలకూ మోడరన్ ఇండియా ఒక ప్రయోగశాల. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికీ, లౌకిక విలువలకూ, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకూ నెహ్రూ పునాదులు వేశారు. కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృ తులు, భాషలు ఎన్ని వేల వర్ణాలుగా కనిపిస్తున్నా ఆ భిన్నత్వాన్ని ఆయన గౌరవించారు. ఆ ఇంద్ర ధనుసులోనే ఇండియా అనే ఏకత్వాన్ని ఆయన దర్శించారు. స్థూలంగా దీన్నే నెహ్రూ ఇండియా అంటారు.
ఇండియా, భారత్ అనే మాటలను పర్యాయ పదాలుగానే నెహ్రూ ఉపయోగించారు. విరుద్ధ భావాలుగా ఎప్పుడూ పరిగణించలేదు. కానీ నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించిన కొందరు గాంధేయవాదులూ, సోషలిస్టులూ తదితరులు ఈ విభజన తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల వాళ్లు, ఇంగ్లిష్ చదువుల వాళ్లనే నెహ్రూ విధానాలు బాగుచేస్తున్నాయనీ, గ్రామీణ ప్రజలకూ, రైతు కూలీలకూ ఉపయోగపడటం లేదనీ వారి అభియోగం. ఫలితంగా ఇండియా – భారత్‌గా దేశం విభజితమవుతున్నదని వారు ఆరోపించేవారు. పట్టణాలు, పరిశ్రమలు, ఇంగ్లిష్ చదువులు, ఉద్యోగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రణాళికలు వగైరా ఇండియా ఆస్తులైతే, వ్యవసాయం, చేతివృత్తులు, పల్లెటూళ్లు, వీధిబళ్లూ భారత్‌కు చిరునామాలుగా అప్పట్లో విమర్శకులు వర్గీకరించారు. ఈ రెంటిలో నెహ్రూ ఇండియా పక్షమని వారు వాదించేవారు.
అప్పుడది తరుణ స్వరాజ్యదేశం కనుక చదువుకున్నవాళ్లు, మేధావుల సంఖ్య తక్కువగా ఉండేది. ఉన్న కొద్దిమందీ సహజంగానే చాతుర్వర్ణాల్లోని టాప్ త్రీ కేటగిరీ వాళ్లే ఉండేవారు. ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు, తరువాత స్థానాల్లో వైశ్య, క్షత్రియ కులాలవాళ్లుండేవారు. శూద్ర వ్యవసాయ కులాల వాళ్లు అతి స్వల్పసంఖ్యలో ఈ అంతస్తును చేరుకోగలిగారు. రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రసీ ప్రధానంగా ఈ వర్గాల నుంచే తయారైంది. క్రమంగా వీరి వారసత్వం ఢిల్లీ అధికార పీఠాన్ని ప్రభావితం చేయగల అధికార కులీన సమూహంగా (పవర్ ఎలీట్) రూపొందింది.
సుమారు ఏడు దశాబ్దాల పాటు ఢిల్లీ దర్బార్‌లో ఇదే ఎలీట్ క్లాస్ చక్రం తిప్పింది. అధికారంలో ఎవరు ఉన్నా ఈ కోటరీ మాత్రం తప్పనిసరి. శూద్ర వ్యవసాయ కులాలు, చేతివృత్తి దారులు, దళితులు, గిరిజనులకు ఉండే స్థానిక, ప్రాంతీయ అస్తిత్వ భావనలు ఈ ఎలీట్ క్లాస్‌కు తక్కువ. ప్రాంతీయ సెంటిమెంట్లను అధిగమించిన ఇండియన్ నేషనలిస్టులు వీరు. ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడతారు. స్టీఫెన్స్, జెఎన్‌యూ, ఐఐటీ లేదంటే ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్‌లో చదువుకున్నవాళ్లు. రాజకీయాల్లోనూ, వ్యాపారరంగంలోనూ, బ్యూరోక్రాట్లలోనూ వీరు కనిపిస్తుంటారు. నెహ్రూ కాలంలో మొగ్గతొడిగి ఇందిరమ్మ జమానాలో వికసించిన తోట ఇది. బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యలో ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ పూదోట పదిలంగానే ఉన్నది.
2014లో ఎంటర్ ది మోదీ సినిమా విడుదలతో పాతకాలపు పవర్ ఎలీట్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది. ఈ పరిణామాన్ని మావోజెడాంగ్ నాయకత్వంలో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంతో ప్రొఫెసర్ సంజయ్ బారు పోల్చారు. ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్‌గా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారుకు ఢిల్లీ పవర్ ఎలీట్ మీద సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో ఆయన ఇటీవల ‘ఇండియాస్ పవర్ ఎలీట్’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రొఫెసర్ సంజయ్ లెక్క ప్రకారం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన ఇంగ్లిష్ బాబులెవరూ ప్రస్తుత ప్రధానమంత్రి కార్యాల యంలో లేరు. అందరూ ‘దేశీ’ బాబులే! వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వారి సొంత భాషల్లో మాట్లాడేవారు (ముఖ్యంగా హిందీ, గుజరాతీ), సరికొత్త సామాజిక వర్గాల నుంచి వచ్చినవాళ్లు ఇప్పుడు ఢిల్లీ పవర్ సర్కిల్స్‌లో చక్రం తిప్పుతున్నారట! కులీన అధికారిక సమూహం నుంచి తొలితరపు అగ్రవర్ణ మేధావులను తప్పించి శూద్ర వ్యవసాయ కుటుంబాల వారు ఆక్రమించడానికి డెబ్బయ్యేళ్లు పట్టిందన్నమాట!
తాము కూలదోసిన పాత తరాన్ని ‘లుటియెన్స్ ఎలీట్’గా, ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’గా కొత్త ఎలీట్ వేళాకోళం చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం లక్ష్యం కేవలం ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే కాదు. ఆ పార్టీ చుట్టూ అల్లుకున్న సంస్కృతిని ధ్వంసించడం. అధికార పీఠాల్లో అది ఏర్పాటు చేసుకున్న ఎకోసిస్టమ్‌ను దగ్ధం చేయడం కూడా! నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చాలావరకు సాధించింది కూడా. మారుమూల ప్రాంతాల వారికీ, మధ్యశ్రేణి సామాజిక వర్గాల వారికీ ఢిల్లీ అధికార సర్కిల్స్‌లో చోటు దొరకడం స్వాగతించదగ్గదే. రాజ్యాంగంలో చెప్పినట్టు ఇండియాతోబాటు భారత్‌కు కూడా అధికారంలో చోటు దొరుకుతున్నది. ఇదీ ఆహ్వానించదగినదే. నెహ్రూ కాలంలో మొదలైన ‘మూడు వర్ణాల’ ముచ్చటకు ప్రాధాన్యం తగ్గుతున్నది. దానితోపాటు నెహ్రూ పోషించిన లౌకిక విలువలకూ, భిన్నవర్గాల సౌభ్రాతృత్వానికి కూడా ఆదరణ తగ్గుతున్నది. కొత్త ఎలీట్ వాచాలత కోటలు దాటుతున్నది. దేశదేశాల విమర్శలకు తావిస్తున్నది. దేశంలో అభద్రతాభావం జనిస్తున్నది. విద్వేషం జ్వలిస్తున్నది.
రాజధానిలో ఠికానా వేసిన ఇండియన్ నేషనలిజాన్ని మారుమూల ప్రాంతాల్లోని భారత జాతీయతతో అనుసంధానం చేయడం వరకు మంచి పరిణామమే. ఈ సాంస్కృతిక విప్లవాన్ని ఇక్కడితో ఆపితే మేలు. ఇండియా, భారత్‌లను దాటి ‘హిందూస్థాన్’ దాకా ప్రస్థానాన్ని కొసాగించదలిస్తే మాత్రం చేటుకాలం దాపురించినట్టే. హిందీ, హిందూ సామ్రాజ్యవాదం తలకెక్కితే ఈ దేశం అంగీకరించదు. హిందీయేతర దేశీ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఈ దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. మైనారిటీ మతావలంబులు ఇరవై శాతానికంటే ఎక్కువే ఉన్నారు. మనం హిందువులుగా పిలుచుకునే దళితులు, గిరిజనులు, దిగువశ్రేణి శూద్రకులాల సంస్కృతి భిన్నమైనది. సవర్ణ హిందువులు దేవుడికి శాకాహార నైవేద్యం పెడితే, దిగువ కులాల ప్రజలు అమ్మవారికి మాంసాహార బోనం పెడతారు. నెహ్రూవియన్ పాలకులకు ఈ భిన్నత్వాన్ని గౌరవించడం తెలుసు. మోదిత్వవాదులు ఎంతమేరకు గౌరవించగలరు?
సాంస్కృతిక విప్లవ ప్రస్థానాన్ని ఆపివేసి, ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టవలసిన సమయం ఆసన్నమైనదని ఆర్థికవేత్తలు ఉద్ఘోషిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా కష్టాల బాటలు నష్టాల పేటలు దాటి వచ్చినప్పటికీ చరిత్ర మనకొక అమూల్య అవకాశాన్ని ఎదురుగా నిలబెట్టిందని వారు చెబుతున్నారు. వివిధ అంతర్గత నిర్ణయాల కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత తొలిసారిగా చైనా మందగమనం ప్రారంభమైంది. ఈ పరిణామం మనకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన దారులను ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం విజయవంతంగా పరిచింది. ఆయన అధికారం చేపట్టకముందు పదో స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఐదో స్థానానికి ఎగబాకింది.
మోదీ ప్రకటించిన ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సవరించుకోవాలని రఘురామ్‌రాజన్ వంటి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. 2035 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుంటే ఇదీ సాధ్యమేనని ఆయన అభిప్రాయం. ఇప్పటికే డిజిటల్ డ్రైవ్‌తో దేశంలోని చిల్లర శ్రీమహాలక్ష్మిని ఆర్థిక వ్యవస్థతో మోదీ అనుసంధానం చేశారు. ఎకానమీలో పారదర్శకత పెరిగింది. వైషమ్యాలు, విద్వేషాల ఎజెండాను పక్కనపెట్టి, సాంస్కృతిక విప్లవానికి బదులు ఆర్థిక విప్లవంవైపు దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపితే రఘురామ్‌రాజన్ చెప్పిన లక్ష్యం అసాధ్యం కాబోదు.
- వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment