మెనూ సక్రమంగా అమలు చేయాలి
బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న మెనూ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకరనాయక్ అన్నారు. మండలంలోని బూసరాజుపల్లి గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన, విద్యార్థులు అందిస్తున్న మెనూ వివరాలు, ఇతర మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత చదువుల్లో ముందుకు సాగాలని అన్నారు. పాఠశాలలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అవుట్‌సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీడీ పీవీఎస్ నాయుడు, తహసీల్దార్ పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
3న సామూహిక అక్షరాభ్యాసాలు
తాడేపల్లిగూడెం రూరల్: వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ నెల 3న వీరంపాలెం శైవక్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు శ్రీబాలా త్రిపుర సుందరి విద్య, ఆధ్యాత్మిక పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వసంత పంచమి మేధా సరస్వతి జన్మదినోత్సవమని, శుభాలకు ప్రతిరూపంగా ఈ పండుగను భావిస్తారని, ఈ పండుగ రోజు పసుపు వర్ణం దుస్తులు ధరించడం, పసుపు పూలు అమ్మవారికి సమర్పించడం శుభకరమన్నారు. వసంత పంచమి రోజున విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు.
3న బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ఈ నెల 8 నుంచి 11 వరకు పిఠాపురంలో అండర్–16 అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పక్రియ ఈ నెల 3న దెందులూరు నియోజకవర్గం కొవ్వలి జెడ్పీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తామని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 01–01–2009 తర్వాత పుట్టిన వారై ఉండాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 7780484313, 9440349534 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
నరసాపురం రూరల్ : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడని నరసాపురం రూరల్ ఏఎస్సై కేవీ సత్యనారాయణ తెలిపారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కొపనాతి లక్ష్మణస్వామి(57)కి చేపల వేట జీవనాధారం. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి నరసాపురం నుంచి లక్ష్మణేశ్వరం మీదుగా వెళ్లే వేములదీవి చానల్‌లో వేటకు వెళ్లాడు. శుక్రవారం అతని ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం వేకువ జామున అదే కాలువలో అతడి మృతదేహం కనిపించింది. లక్ష్మణస్వామి మృతదేహాన్ని గుర్తు పట్టిన స్థానికులు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. భార్య పిర్యాదు మేరకు ఏఎస్సై కేవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment