
మహిళా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 8వ తేదీన సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. సుమారు 25 స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 2కె మారథాన్, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహిళలకు హెల్త్ చెకప్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment