
‘యువత పోరు’కు తరలిరండి
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి విడుదల చేయకుండా పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరుపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పేరుతో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని యువత, విద్యార్థులతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం విద్యార్థి సంఘాలు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించకుండా కుటిల రాజకీయాలు చేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యంతో పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. ఐదు త్రైమాసికాలకు సంబంధించి సుమారు రూ.4,600 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఏడాదిలో మూడు విడతల్లో ఫీజులు, విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేసేవారని గుర్తు చేశారు.
కూటమివి కక్ష సాధింపులు
చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పేద పిల్లల ఉన్నత భవితకు బాటలు వేస్తూ సకాలంలో ఫీజులు చెల్లించారనీ, అయితే కూటమి సర్కారు కక్ష సాధింపులతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతిని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జీఎంఆర్, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ షమీం, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు బుద్దాల రాము, కంచుమర్తి తులసి, కె.జనార్దన్, బత్తిన మస్తాన్‌రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ, రాష్ట్ర యువజన కార్యదర్శి దాలి వెంకటేష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి తంగెళ్ల రాము, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు ఉన్నారు.
విద్యార్థుల జీవితాలతో కూటమి చెలగాటం
రేపు కలెక్టరేట్ వద్ద నిరసన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
Comments
Please login to add a commentAdd a comment