కట్టుకున్నవాడే కాలయముడై..
బుట్టాయగూడెం: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న 8 నెలలకే ఓ వివాహిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భర్త చేతిలో భార్య హత్యకాబడిన ఘటన మండలంలోని బూరుగువాడలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి గొడ్డా శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన గొడ్డా సాయి కిరణ్, బుట్టాయగూడెం మండలం బూరుగువాడకు చెందిన రేఖామాధురి(22) నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుని 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మాధురి తండ్రి గొడ్డా శ్రీను ఇద్దరినీ మందలించి సర్థిచెప్పడం జరిగేది. అయితే మంగళవారం చంద్రమ్మకాలనీ నుంచి భార్యాభర్తలిద్దరూ బుట్టాయగూడెం మండలం బూరుగువాడకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో పూచికపాడులో భార్యాభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. దీనితో రేఖామాధురి విషయాన్ని తండ్రి శ్రీనుకు ఫోన్‌లో చెప్పింది. వెంటనే తండ్రి ఆమెను బూరుగువాడుకు తీసుకువెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సాయికిరణ్ భార్య దగ్గరకు రావడంతో అల్లుడే కదా అని రానిచ్చారు. బుధవారం ఉదయం 6 గంటలకు రేఖామాధురి తండ్రి శ్రీను, తల్లి చిలకమ్మ, చెల్లెలు మాధురి అందరూ పొలం పనులకు వెళ్లిపోయారు. ఏడున్నర గంటల సమయంలో సాయికిరణ్ మామ శ్రీనుకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో కుమార్తె మృతదేహాన్ని పరిశీలించగా గాలిపంపు తాడును పీకకు బిగించి చంపినట్లు అనుమానం రావడంతో తండ్రి శ్రీను బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రేఖామాధురి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment