పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశం చౌక్): నిర్థిష్ఠ ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో గురువారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దర్యాప్తులో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ నేర నియంత్రణలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా పాత పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, రాత్రి సమయంలో రెగ్యులర్ బీట్లతో వాహనాల తనిఖీలు చేసి కట్టడి చేయాలని, నేర నియంత్రణకు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించేలా చేయాలన్నారు. అలాగే జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాలు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటించాలన్నారు. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, జవాబుదారీగా ఉండాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, నరసాపురం డీఎస్పీ జి.శ్రీ వేద, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
Comments
Please login to add a commentAdd a comment