వారసులకు పరిహారం పరిహాసమేనా?
కుక్కునూరు: పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చట్ట ప్రకారం వచ్చే వాటిని కూడా రాకుండా చేయడం ఎంతవరకు న్యాయమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పరిహారం కోసం 2017లో నిర్వాసిత గ్రామాల్లో సర్వే నిర్వహించిన ప్రభుత్వం కుటుంబ వివరాలతో పాటు అన్ని ఆధారాలను తీసుకోని ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించేందుకు అర్హుల జాబితాను తయారు చేసింది. అర్హుల జాబితాను తయారు చేసిన వెంటనే పరిహారం చెల్లించకుండా 7 సంవత్సరాల తరువాత గత జనవరిలో ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేసింది. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వంటి పెను విపత్తులతో దేశవ్యాప్తంగా చాలా మంది మృతి చెందారు. విలీన మండలాల్లో కూడా పలువురు అనేక కారణాలతో మృతి చెందారు. మృతి చెందిన వారికి మంజూరైన పరిహారాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సింది పోయి ఆ పరిహారాన్ని రీస్టోర్ టు గవర్నమెంట్ అంటూ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు చూడడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క 2013 భూసేకరణ చట్టం ప్రకారం కుటుంబంలో అర్హులైన నిర్వాసితుడికి మంజూరైన పరిహారాన్ని అతడు మృతి చెందితే వారి వారసులకు ఇవ్వొచ్చని పలు రాజకీయ పార్టీల నాయకులు చెబుతుండగా.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా రీస్టోర్ టు గవర్నమెంట్ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అదే ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే ఇచ్చుంటే నిర్వాసితులకు న్యాయం జరిగుండేదని ప్రభుత్వం చేసిన తప్పుకు నిర్వాసితులు బలి కావాలా అని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మృతి చెందిన వారి పరిహారాన్ని వారసులకిచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కోర్టు ఆర్డర్‌ను పట్టించుకోవడం లేదు
మా నాన్న సర్వే అనంతరం అర్హుల జాబితా ప్రకటించిన తరువాత మృతి చెందాడు. మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వమని చెప్పడంతో మా నాన్న పరిహారాన్ని వారసురాలైన మా చెల్లికి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను. అయినా అధికారులు కనీసం కోర్టు ఆర్డర్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఘంటసాల చంద్రం, నిర్వాసితుడు, కుక్కునూరు
పరిహారాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం
ఓ వ్యక్తి మృతి చెందితే అతనికి రావాల్సినవి వారసులకు ఇవ్వాలని చట్టం చెబుతోంది. అసైన్‌మెంట్ ల్యాండ్‌కు సంబంధించిన యజమాని మృతి చెందితే తదనంతరం అతని వారసులకు చెందుతుంది. నిర్వాసితుడు మృతి చెందాడని అతని పరిహారం గవర్నమెంట్‌కు రీస్టోర్ చేయడం పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు చేసే యత్నంలో భాగమే.
ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఏలూరు
వారసులకు పరిహారం పరిహాసమేనా?
వారసులకు పరిహారం పరిహాసమేనా?
Comments
Please login to add a commentAdd a comment