కౌలు రైతులకు చట్టం తేవాలి
చింతలపూడి : సమగ్ర కౌలు రైతుల చట్టం తేవాలని కోరుతూ మార్చి 17న కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. మండలంలోని సమ్మటివారిగూడెంలో శనివారం కౌలు రైతుల సంఘం సమావేశం సంకు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు రైతు చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు చట్టం ఆచరణలోకి తీసుకు రాలేకపోయారని విమర్శించారు. రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే పరిస్థితి లేదని, కౌలు రైతులకు నూతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ వేసవిలో చెరువులలో కాలువలలో ఉన్న గురప్రు డెక్కను తొలగించి సమగ్ర పూడిక పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కౌలు రైతులు సంకు వెంకటనారాయణ, వినుకొండ శ్రీను, వనమాల శాంతారావు, రైతు సంఘం నాయకులు తాడిగడప మాణిక్యాలరావు, తక్కలపాటి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment