విదేశీ కోకో దిగుమతులు ఆపాలి
పెదవేగి : విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని, రైతులు వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెదవేగి మండలం విజయరాయి, గాంధీనగర్ షిరిడి సాయి కల్యాణ మండపంలో కోకో రైతుల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని, రైతులు వద్ద నుంచి తగినంతగా కోకో గింజలు కొనుగోలు చేయలేమని కొన్ని కంపెనీలు రైతులను బెదిరించడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వకుండా కంపెనీలు రైతులను మోసగిస్తూ ఇబ్బందులు గురి చేయడం అన్యాయమని విమర్శించారు. కిలో కోకోకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న జరిగిన కోకో రైతుల చలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించామని చెప్పారు. ఈ నెల 10న ఉద్యాన శాఖ కమిషనర్ దృష్టికి సమస్య తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం వద్దకు కోకో రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్, గుడిబండి రమేష్ రెడ్డి, ఎ.అనిల్ కుమార్, కె.రామిరెడ్డి, కె.గోపాలరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment