ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ

Published Mon, Mar 10 2025 10:48 AM | Last Updated on Mon, Mar 10 2025 10:42 AM

ట్రిప

ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సోమవారం నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జాతీయస్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌ ‘టెక్‌జైట్‌–25’ను నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి, ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎం. విజయ్‌కుమార్‌, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ హాజరుకానున్నారు. ఫెస్ట్‌ను క్యాంపస్‌లోని స్టూడెంట్‌ డెవలప్‌మెంట్‌ క్యాంపస్‌ యాక్టివిటీ సెల్‌ (ఎస్‌డీసీఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. టెక్‌జైట్‌లో ట్రిపుల్‌ఐటీకి చెందిన 8 వేల మందితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 2 వేల మంది మొత్తంగా 10 వేల మంది వరకు విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. గతంలో నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లకు భిన్నంగా నూతన పంథాలో నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతిక ఉత్సవంగా ఇది నిలవనుంది.

సాంకేతిక, పరిశోధన సామర్థ్యాల మెరుగుదల

విద్యార్థుల్లో సాంకేతిక, సృజనాత్మకత పెరగడమే కాకుండా పరిశోధన సామర్థ్యాలు మెరుగుపడేలా టెక్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. కోడింగ్‌ సవాళ్లు, రోబోటిక్స్‌ పోటీలు, సర్క్యూట్‌ డిజైనింగ్‌, హ్యాకథాన్‌ల వరకు వివిధ సాంకేతిక పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారు. అలాగే పలు రంగాల్లో విశేష అనుభవం కలిగిన వారితో, విజయాలను సాధించిన నిష్ణాతులతో ఇప్పటికే వర్క్‌షాపులను నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీలోనే చదువుకుని వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు పోటీలు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పలు రకాల పోటీలను ఏర్పాటుచేశారు. మెగా ఎక్స్‌పో, హ్యాక్‌థాన్‌, వర్క్‌షాప్స్‌, ఈవెంట్స్‌, రోబోవార్స్‌ వంటి పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల విజ్ఞానాన్ని, వ్యక్తిత్వం, సమగ్రత, నాయకత్వ లక్షణాలను పెంచడానికి క్విజ్‌ పోటీలు, ఐపీఎల్‌ ఆక్షన్‌, ఫ్రీఫైర్‌, ఐఏఎస్‌ పోటీలు టెక్‌జైట్‌లో మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. సాంకేతిక రంగంలో వస్తున్న తాజా పురోగతులు, కెరీర్‌ మార్గదర్శకత్వం, వివిధ రంగాల్లో వస్తున్న నూతన ధోరణులతో సహా పలు రకాల అంశాలు టెక్‌జైట్‌లో ఉన్నాయి.

మెటావర్స్‌ థీమ్‌తో..

మెటావర్స్‌ థీమ్‌తో టెక్‌జైట్‌ను నిర్వహిస్తున్నారు. ‘నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదైపోతున్న నేటి ఆధునిక యుగంలో రాబోయే రోజులన్నీ ఈ మెటావర్స్‌దే’ అన్న ఉద్దేశంతో దీనిని థీమ్‌గా తీసుకున్నారు. విద్యార్థుల్లో ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలటీ (వీఆర్‌) గురించి మరింత విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ థీమ్‌ను ఎంపిక చేశారు.

నేటి నుంచి సాంకేతిక సంబరం

మూడు రోజులపాటు నిర్వహణ

సుమారు 10 వేల మంది సందర్శన

హ్యాకథాన్‌ పోటీలు

టెక్‌జైట్‌–25లో భాగంగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆదివారం హ్యాకథాన్‌ పోటీలను డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఏఐ హ్యాకథాన్‌ పోటీల్లో 71 జట్లు, రోబోటిక్‌ హ్యాకథాన్‌ పోటీల్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఏఐ హ్యాకథాన్‌లో ఉత్తమ పరిష్కారం కనుగొన్న రెండు జట్లకు రూ.10 వేల చొప్పున, రోబోటిక్‌ హ్యాకథాన్‌లో ఉత్తమ పరిష్కారం కనుగొన్న జట్టుకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామని డైరెక్టర్‌ తెలిపారు. హ్యాకథాన్‌ పోటీలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని ఏఓ బి.లక్ష్మణరావు తెలిపారు. డీన్‌ అకడమిక్స్‌, టెక్‌జైట్‌–25 కన్వీనర్‌ చిరంజీవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ 1
1/2

ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ

ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ 2
2/2

ట్రిపుల్‌ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement