కొల్లేరు సరిహద్దుల పరిశీలన
కై కలూరు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అటవీ శాఖ రాష్ట్ర దళాధిపతి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏకే నాయక్, రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్‌వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్‌ఎన్ మూర్తి ఆదివారం పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి బి.విజయ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు, కలకుర్రు, మాధవాపురం, ప్రత్తికోళ్లలంక పరిసర గ్రామాలు, మండవల్లి మండలం పులపర్రు కొల్లేరు గ్రామాల్లో ప్లస్ 5 కాంటూరు సరిహద్దులను పరిశీలించారు. కొల్లేరు అభ్యయారణ్యం సరిహద్దులపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో సుప్రీంకోర్టుకు అందిస్తామన్నారు. అభయారణ్యం ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దుల గుర్తింపు దిమ్మల ఏర్పాటుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థిస్తామని చెప్పారు. టెరిటోరియల్ డీఎఫ్‌ఓ శుభమ్, ఏలూరు రేంజర్ కేపీ రామలింగాచార్యులు, అటవీ శాఖ సిబ్బంది వారి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment