రంజాన్‌స్పెషల్..హరీరా
●
ఐదు దశాబ్దాలుగా..
చింతలపూడి హరీరా ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంత ముస్లింలను అలరిస్తోంది. రంజాన్ వచ్చిందంటే నెలరోజుల పాటు హరీరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడ హరీరా మంచి ఆహారం. ఉపవాస దీక్షలో తప్పనిసరిగా ముస్లింలు హరీరా సేవించి దీక్షను విరమిస్తారు. రుచికరంగా ఉండటమే కాక పగలంతా ఉపవాసాలు ఉన్న వారికి శక్తిని ఇచ్చే ఔషధంగా పని చేస్తుంది.
– సయ్యద్ రహీం(బాబు), జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు
రంజాన్ నెలలో స్పెషల్
ప్రతీ సంవత్సరం రంజాన్ నెలలో 30 రోజులపాటు ఉపవాసాలు ఉండి హరీరా సేవించడం ఆరోగ్యానికి మంచిది. రోజంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు భగవంతుని కృప కోసం ఇఫ్తార్ సమయంలో హరీరా సేవిస్తారు.
– ఎండీ జిలాని,
జామియా మసీదు కమిటీ కార్యదర్శి
చింతలపూడి: ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆచరించే ఇస్లాం మార్గదర్శకాల్లో రంజాన్ ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఆచరించడంతో పాటు ఐదు పూటలా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలవంక దర్శనంతో మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే రోజా (ఉపవాసాలు) షవ్వాల్ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. ప్రతి ముస్లిం నమాజుతో పాటు తప్పని సరిగా ఉపవాసాలు పాటించాలని ఇస్లాం సూచిస్తోంది. తెల్లవారుజాముకు ముందు నుంచే ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సమయం (ఇఫ్తార్) వరకు పాటిస్తారు. పగటి సమయమంతా అన్నపానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోరు. సాయంత్రం ఇఫ్తార్‌తో దీక్ష విరమిస్తారు. పగలంతా ఉపవాసం పాటించిన దీక్షాపరులు సాయంత్రం నిర్ణీత వేళలో పండ్లు, ఫలహారాలతో దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. చింతలపూడి ప్రాంతంలో 67 ఏళ్ల క్రితం అప్పటి జమాతే ఇస్లామీ హింద్ నాయకులు బషార్‌తుల్లా హరీరా తయారు చేయడం ప్రారంభించారు. దూరప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ హరీరా సేవిస్తారు. ఇప్పటికీ రంజాన్ నెలలో హరీరా తయారు చేసి ముస్లిం సోదరులకు అందిస్తారు.
పోషకాలకు నెలవు
ఉపవాస దీక్ష విరమణలో వినియోగించే హరీరా(గంజి)కి ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉంది. గత 67 ఏళ్ళుగా చింతలపూడి హరీరాకు ప్రత్యేక స్థానం ఉంది. రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ హరీరా తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నిటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం విశేషం. తక్షణమే శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇందులో ఉపయోగించే మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తాయి. హరీరా తయారు చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేయడంతో దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
తయారీ విధానం
తయారీలో బియ్యం రవ్వ, మటన్ కీమా, నూనె, డాల్డా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క, పెసరపప్పు, కారం వంటి వస్తువులతో చేస్తారు. హలీంకు ఏమాత్రం తీసిపోకుండా రుచికరంగా ఉంటుంది. హరీరా (గంజి) బలవర్ధకమైన పానీయం. దీన్ని తాగితే ఉపవాస దీక్షా పరులకు బలం చేకూరడమే కాక, ఆరోగ్యవంతంగా కూడ ఉంటారని ఇక్కడి ముస్లింలు చెబుతారు. అందుకే ముస్లింలే కాకుండ హిందూ సోదరులు కూడ ఈ హరీరాను సేవించడానికి వస్తుంటారు.
67 ఏళ్ల నుంచి చింతలపూడి ప్రాంతంలో ప్రసిద్ధి
హరీరా సేవించి ఉపవాస దీక్ష విరమణ
రంజాన్‌స్పెషల్..హరీరా
రంజాన్‌స్పెషల్..హరీరా
రంజాన్‌స్పెషల్..హరీరా
Comments
Please login to add a commentAdd a comment