అట్టహాసంగా భీమడోలు జాతర
భీమడోలు: భీమడోలు గ్రామదేవతలు శ్రీమద్దిరామమ్మ, శ్రీమహాలక్ష్మమ్మ, శ్రీగంగానమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. గ్రామంలోని పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. 33 రోజులుగా జాతర ఉత్సవాలు సాగాయి. కొర్లబండిని పొలిమేరకు పంపడంతో ఉత్సవాలు ముగిశాయి. శనివారం అర్ధరాత్రి కీలక ఘట్టమైన అమ్మవార్లకు కుంభాభిషేకం పూజలు ప్రారంభించి ఆ తర్వాత పొలిచేట గ్రామ పొలిమేరల్లో తిరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవార్లకు కుంభం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయాలు పోటెత్తాయి. అమ్మవార్లకు బూరెలు, గారెలు, అన్నం తదితర నైవేద్యాన్ని సమర్పించి భక్తిని చాటుకున్నారు. జాతర కమిటీ అధ్యక్షుడు దత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జాతర సమితి, యువకులు, పెద్దలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరసగా సెలువులు కావడంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆలయాల వద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు, బ్యాంకు యాజమాన్యాలు భక్తులకు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించాయి. శ్రీకల్కి సేవా సమితి ద్వారా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయించారు. భీమడోలు గ్రామంలోని ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది. మేళతాళాలు, బాణసంచాతో పాటు చిత్ర విచిత్ర వేషాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కొర్ల బండిని గణాచారులు, పెద్దలు, భక్తులు లాగి పొలిమేర వద్దకు పంపారు.
అట్టహాసంగా భీమడోలు జాతర
అట్టహాసంగా భీమడోలు జాతర
Comments
Please login to add a commentAdd a comment