
పెద్దింట్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సోమవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నెల 1 నుంచి 13 వరకు జాతర నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన కల్యాణానికి దేవస్థానం తరఫున ఈవో కూచిపూడి శ్రీనివాసు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పంచహారతులు అందించారు. పెద్దింట్లమ్మకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన గొట్టుముక్కల ప్రసాదరాజు, ముదునూరి జానకీ సుబ్బరాజు, తాడిపూడికి చెందిన కూసంపూడి రామకృష్ణంరాజు, కై కలూరుకు చెందిన కలిదిండి సూర్యనారాయణవర్మ వ్యహరించారు. అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు, పాల పొంగళ్లు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శక్తి వేషాలు, గరగ డప్పుల నృత్యాలు, కేరళ చండా మేళం, తీన్మార్ డప్పులు ఆకట్టుకున్నాయి. జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ వి.రవికుమార్, రూరల్ ఎస్‌ఐ వి.రాంబాబుల ఆధ్వర్యంలో 120 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు.
పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment