
కోకోకు మద్దతు ధర ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరించాలని, కిలో కోకో గింజలకు రూ.900 ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయం ముందు కోకో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సీవీ హరినాథ్ రెడ్డికి రైతులు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, జె.కాశీ బాబు, కోనేరు సతీష్ బాబు, బోళ్ళ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని రైతులను బెదిరిస్తూ సిండికేట్‌గా మారి కోకో గింజల ధరను తగ్గించి వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరిపి కిలో కోకో గింజలకు రూ. 900 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యపై ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోకో ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అమలు చేస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment