మెడికల్ కళాశాల కల సాకారం
● సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ లబ్ధి
● పేదల వైద్యానికి పెద్దపీట
● నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
● నవరత్నాలతో పేదల ఉన్నతికి బాటలు
● జగనన్న సురక్షతో ఉచితంగా సర్టిఫికెట్ల జారీ
● ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల మంజూరు
● నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మల అభ్యున్నతికి ‘చేయూత’నందించారు. వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’ అయ్యారు.. అగ్రవర్ణాల పేద మహిళలకు ‘నేస్తం’గా నిలిచారు. పేదల చదువులకు ‘అమ్మఒడి’లా వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలు అందించారు. సాగులో రైతుకు, వేట విరామంలో మత్య్సకారులకు ‘భరోసా’గా ఉన్నారు. నేతన్నలకు ‘నేస్తం’ అయ్యారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు తెచ్చి కులమత వర్గాలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ లబ్ధిని పేదల చెంతకు చేర్చారు. నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్ కోసం అవ్వాతాతలు పడిగాపులకు చెక్ పెట్టారు. 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వెళ్లి పింఛన్ సాయాన్ని చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూరింది. ఉచిత పంటల బీమా, ఆర్‌బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేశారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మంది లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు.
జగనన్న ఆరోగ్య సురక్షలో 2.26 లక్షల మందికి సేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–1లో ఏలూరు జిల్లాలో 498 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. రూరల్‌లో 463, అర్బన్ పరిధిలో 35 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో 2,26,779 మంది వైద్యసేవలు పొందారు. ఫేజ్–2లో 551 మెడికల్ క్యాంపులు నిర్వహించగా రూరల్ ప్రాంతాల్లో 441, అర్బన్ పరిధిలో 110 క్యాంపులు ఏర్పాటు చేశారు. 61,140 మంది వైద్య సేవలు పొందారు.
నాడు– నేడు తొలి దశలో 648 పాఠశాలలకు మహర్దశ
నాడు – నేడు కార్యక్రమంలో తొలి విడతగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 648 పాఠశాలలను ఎంపిక చేసి రూ.134. 84 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతగా 889 పాఠశాలల అభివృద్ధికి రూ.295.54 కోట్లు కేటాయించారు.
బలివే వద్ద వంతెన నిర్మాణం
పెదవేగి మండలం విజయరాయి వద్ద బలివే వంతెన, ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు వంతెన నిర్మాణ పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగాయి.
ప్రగతి పరవళ్లు
ఏలూరు ప్రజల దశాబ్దాల కలగా ఉన్న ప్రభుత్వ వైద్యకళాశాల సాకారమవడంతో తరగతులు ప్రారంభమయ్యాయి. రూ.60 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. 2022–23 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించారు. రూ.525 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి మిగిలిన వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రిని టీచింగ్ ఆసుపత్రిగా అభివృద్ధి ప్రారంభించారు. తమ్మిలేరు రిటైనింగ్‌వాల్‌కు 2019లో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు.
నేడు ఆవిర్భావ దినోత్సవం
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు చేయనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం దగాతో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన జిల్లా కేంద్రాల్లో ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మెడికల్ కళాశాల కల సాకారం
Comments
Please login to add a commentAdd a comment