ఉల్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు
కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు ఈనెల 23న నిర్వహించే పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వయోజన విద్య, విద్యా శాఖ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాస్యత శిక్షణ పూర్తిచేసిన 7,321 మంది ఈ పరీక్షలు రాయనున్నారని అందుకోసం 732 పాఠశాలలు గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు.
ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం
ఏలూరు(మెట్రో) : స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఇందులో భాగంగా పీఎంఏవై 1లో ఇళ్లు మంజూరై, ఇంకా వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జిల్లాలో దాదాపు 49,436 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసి గిరిజనులకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. నిర్మాణాలు ఏప్రిల్ 2025లోగా పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంలో నిధుల మంజూరు కోసం మధ్యవర్తులు, ఇతరుల మోసపూరిత మాటలు నమ్మరాదని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల గృహ నిర్మాణ కార్యాలయం, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలన్నారు.
పాఠశాల మరుగుదొడ్లకు తాళాలు
ఫిర్యాదు చేసిన బాలికలు
దెందులూరు : గోపన్నపాలెం ఉన్నత పాఠశాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనంపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని ఈ పరిస్థితి ఉత్పన్నమైతే చర్యలు తప్పవని ఇన్‌చార్జి హెచ్‌ఎంకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల బాత్‌రూంలకు తాళాలు వేయడం కమిటీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. బాత్‌రూంలకు తాళాలు ఎందుకు వేయాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలాల్సి ఉంది.
ఇంటర్ పరీక్షలకు 18,050 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ఫిజిక్స్ –1, ఎకనామిక్స్–1 పరీక్షలకు మొత్తం 19,237 మంది విద్యార్థులకు 18050 మంది విద్యార్థులు హాజరయ్యారు. 16,660 మంది జనరల్ విద్యార్థులకు 15,882 మంది, 2577 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2168 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 94 శాతంగా నమోదైంది. ఎలాంంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment