ఊరిస్తున్న పొగాకు ధరలు
బుట్టాయగూడెం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1 –2 , కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు సంబంధించి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు కేజీ ధర గతేడాది రికార్డు స్థాయిలో రూ.411 పలకడంతో ఈసారి రైతులు పోటీపడి మరీ పొగాకు సాగు చేశారు. 2025 –2026 సీజన్‌కు సంబంధించి బోర్డు 58.94 మిలియన్ల కేజీల పొగాకు విక్రయానికి అనుమతి ఇవ్వగా 70 మిలియన్ల కేజీల వరకూ ఉత్పత్తి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా పొగాకు రైతులు పోటీపడి మరీ సాగు చేయడంతో సాగుఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. భూమి, బ్యారన్ కౌలుతో పాటు కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గతేడాది కంటే సరాసరి ధర ఎక్కువ వస్తేనే తాము గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు.
కర్ణాటక మార్కెట్ సరాసరి రూ. 268
ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలంలో ధరలు ఆశాజనకంగానే ప్రారంభమైనట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. హై గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ. 337 వరకూ పలికింది. మొత్తం సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మంళవారం నాడు రూ.216, లో గ్రేడ్ రూ 130 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిలాల్లో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లలో మొదటి రోజు రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ గతేడాది హై గ్రేడ్ కేజీ రూ.330 వరకూ పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పొగాకు కేజీ ధర రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఈ ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఇటు రైతులు, అటు అధికారులు భావిస్తున్నారు.
గ్రేడింగ్‌లో జాగ్రత్తలు అవసరం
ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చే అంశం. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి మొదటి రకం అంటే హై గ్రేడ్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన గ్రేడులు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది రైతులకు సానుకూలాశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేడ్‌లు వేరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని బోర్డు అధికారులు కోరుతున్నారు.
24 నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం
గతేడాది కంటే ఎక్కువ ధరపై ఆశపెట్టుకున్న రైతులు
సరాసరి రూ.300 ఇవ్వాలని డిమాండ్
మొత్తం వేలం కేంద్రాలు – 5
పొగాకు రైతుల సంఖ్య – 12,487
సాగు విస్తీర్ణం – 28,719 హెక్టార్లు
బోర్డు అనుమతించిన ఉత్పత్తి 58.94 మిలియన్ల కేజీల
పంట ఉత్పత్తి అంచనా 70 మిలియన్ల కేజీలు
అధికారుల సూచనలు పాటించాలి
ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉంది. గత ఐదేళ్లలో ఈ విధంగా పండలేదు. రైతులు అవశేషాలు లేని హీట్, సాఫ్ లేకుండా గ్రేడుల ఆధారంగా పొగాకును సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది హై గ్రేడ్ పొగాకు పండింది. అధికారులు సూచనలు పాటిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంది.
– బి.శ్రీహరి, ఆక్షన్ సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం –1
ధరపైనే ఆశలు
పొగాకు పంటలకు సాగు ఖర్చులు భాగా పెరిగాయి. పొలం, బ్యారన్ కౌలు, కూలి రేట్లు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మంచి ధర వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాము. సరాసరి రూ.300 ధర వచ్చేలా బోర్డు అధికారులు కృషి చేస్తేనే రైతులు గట్టెక్కుతారు.
– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం
ఊరిస్తున్న పొగాకు ధరలు
ఊరిస్తున్న పొగాకు ధరలు
ఊరిస్తున్న పొగాకు ధరలు
ఊరిస్తున్న పొగాకు ధరలు
Comments
Please login to add a commentAdd a comment