కొల్లేరుపై సుప్రీంలో వాదనలు
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టులో బుధవారం వాడివేడిగా వాదనలు సాగాయి. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదని, కొల్లేరు సరస్సులో అక్రమంగా చేపల చెరువుల సాగు జరుగుతోందని కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి మృత్యుంజయరావు 2004 సెప్టెంబరులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ ఆగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులు గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేసి, కొల్లేరు ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమ చేపల చెరువులను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు మార్చి 14న విచారిస్తామని పేర్కొంది. దీంతో ఈ నెల 19 వరకు ప్రభుత్వం గడువు కోరింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ నివేదిక అందించింది.
సీఈసీ నివేదిక సమర్పించాలని ఆదేశం
సుప్రీంకోర్టులో బుధవారం కొల్లేరు అంశంపై విచారణ కొనసాగింది. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కుదించి మిగులు భూములు పంపినీ చేయాలని కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు నివేదికలు పంపింది. వైల్డ్ లైఫ్ బోర్డు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని నియమించింది. సుకుమార్, అజీజ్ అనే రెండు కమిటీలు అభయారణ్య కుదింపు అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదికలు సీఈసీకి అందించాయి. ఈ కమిటీల పూర్తి సారాంశాన్ని, కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యసాధ్యాలకు చేసిన సిఫార్సులను ఏప్రిల్ 2న సుప్రీంకోర్టుకు నివేదించాలని సీఈసీని కోర్టు ఆదేశించింది.
9,500 ఎకరాల్లో చెరువులకు గండ్లు
కొల్లేరులో అక్రమ చేపల చెరువులు ఉన్నాయని అటవీశాఖ గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. కొల్లేరులో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించమని, ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చెరువుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. రెండు జిల్లాల్లో 18 వేల ఎకరాల చెరువులకు గండ్లు కొట్టాల్సి ఉండగా కోర్టుకు నివేదిక పంపించే సమయానికి 9,500 ఎకరాల చెరువులకు అటవీశాఖ గండ్లు కొట్టింది. దీంతో అనేక గ్రామాల్లో గ్రామస్తులు నిరసన తెలిపారు.
ఏప్రిల్ 2న మరోసారి విచారణ
సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పూర్తి నివేదిక కోరిన సుప్రీం
అక్రమ చెరువుల ధ్వంసం వివరాలు అందించిన అటవీశాఖ
Comments
Please login to add a commentAdd a comment