దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంధం బోసు(31) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బోసును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు. బోసుపై దాడి జరిగి 48 గంటలు గడిచినా కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడం పట్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. బోసుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయ కర్త కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు డిమాండ్ చేశారు. దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా నిందితులను కనిపెట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో బోసు హత్యతో గంధరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రకమైన హత్యలు జరగడం దారుణమన్నారు. జీలుగుమిల్లి జాతరలో జరిగిన అవకతవకలపై పత్రికల్లో వచ్చిన వార్తలను బోసు ఫార్వార్డ్ చేయడంతో ఆలయ చైర్మన్, టీడీపీ నాయకుడు వెంకటేశ్వరరావు ఫోన్‌లోనే బోసును బెదిరించిన కొద్దిరోజుల్లోనే బోసుపై దాడి జరగడం, బోసు మృతి చెందడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. బోసు మరణం పార్టీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment