బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సీసీఆర్‌సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో 23,314 మంది సీసీఆర్‌సీ కౌలు రైతులకు ఇంతవరకు రూ. 142.85 కోట్లు అందించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబరు వరకు రూ.6,639 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారన్నారు. మార్చి చివరి నాటికి నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60 శాతం ఉండాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో ఇది 199 శాతంగా ఉండటం మంచి పరిణామమన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 90.63 కోట్లు విద్యా రుణాలుగా, రూ.618.63 కోట్లు హౌసింగ్ రుణాలుగా అందించారని వీటిని మరింత విస్తృతం చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ పి.పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్.శ్రీనివాస్, ఎల్‌డీఎం డి.నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ఉధ్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఇ పి.సాల్మన్ రాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment