కృష్ణా వర్సిటీకి రూ.20 కోట్ల కేటాయింపు
నూజివీడు: కృష్ణా యూనివర్సిటీకి పీఎం ఉష పోగ్రామ్‌లో భాగంగా రూ.20 కోట్ల నిధులు వచ్చాయని, వీటిలో రూ.2 కోట్లను నూజివీడులోని ఎమ్మార్ అప్పారావు కాలేజీ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు(పీజీ సెంటర్) విడుదల చేసినట్లు కృష్ణా యూని వర్శిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ని స్థానిక పీజీ సెంటర్‌ను బుధవారం ఆయన సందర్శించారు. దీనిలో భాగంగా క్యాంపస్‌లోని క్యాంటీన్, బాలికల హాస్టల్, నూతనంగా నిర్మించిన అకడమిక్ భవనాన్ని, తరగతి గదులను, లేబొరేటరీలను, బాత్‌రూమ్‌లు పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపాల్ జే.నవీన లావణ్యలతకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా నూతన కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెడతామన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో యూనివర్శిటీ ఉద్యోగుల జీతాల కోసం రూ.10.50 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. బాలికల హాస్టల్ వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున హాస్టల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్శిటీ రెక్టార్ ఆచార్య మండవ వెంకట బసవేశ్వరరావు, ప్రిన్సిపాల్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. తరగతి గదుల్లో, కారిడార్‌లో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం లేదని, మంచినీటి కోసం క్యాంటీన్ వరకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment