బుట్టాయగూడెం: అధికారం మాది.. మేం చెప్పిందే వినాలి.. మేం చేసిందే చూడాలి.. మమ్మల్ని ఆపేదెవడ్రా.. అన్నట్టు సాగుతోంది గిరిజన ప్రాంతంలో మట్టి దందా. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో రాత్రీపగలు తేడాలేకుండా పొక్లయిన్లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కొండలు, గుట్టలను తవ్వుతూ జేబులు నింపుకుంటున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ తతంగమంతా జరుగుతోందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
తవ్వుకో.. తరలించుకో..
సామాన్యులు ఎవరైనా చెరువులో గుప్పెడు మట్టి తీసుకువెళ్తే వాహనం సీజ్ చేసి అపరాధ రుసుం విధించే అధికారులు మన్యం ప్రాంతంలో నెలల తరబడి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా నిమ్మను నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు మరింత చెలరేగిపోతున్నారు. చెరువులు, కొండల్లో మట్టి, గ్రావెల్‌ను తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. బుట్టాయగూడెం మండలంలోని దండిపూడి చెరువులో, మర్రిగూడెం చెరువులో, కోయరాజమండ్రి సమీపంలోని దొర మామిడి, గాడిదబోరు సమీపంలో కొండలను తవ్వి గ్రావెల్, మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలంలో కూడా గ్రావెల్, మట్టి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గట్టును ఆనుకుని ఉన్న ఆర్‌అండ్‌ఆర్ భూమిలో పొక్లయిన్లతో మట్టిని తవ్వి తరలించారు. అలాగే బుట్టాయగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతం సమీపంలో కూడా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తరలింపులు జరిగాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి : ప్రభుత్వం చేపట్టిన పనులు, రహదారి నిర్మాణాలకు మట్టి, గ్రావెల్ కావాల్సి వస్తే సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాలి. వాణిజ్య అవసరాలకు అయితే రూ.135 నుంచి రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ట్రాక్టర్‌కు రూ.750 నుంచి రూ.800 వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయి తే ఏజెన్సీ ప్రాంతంలో ఇవేమీ అమలుకావడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
చెరువు మట్టి.. కొల్లగొట్టి
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
రాత్రీపగలూ తోలకాలు
నిబంధనలు మీరినా పట్టని అధికారులు
కూటమి నేతల అక్రమాలు
ఎలాంటి అనుమతులూ లేవు
బుట్టాయగూడెం మండలంలో మట్టి, గ్రావెల్ తోలకాలకు ఎటువంటి అనుమతులు లేవు. ఎవరైనా అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.
– పీవీ చలపతిరావు,
తహసీల్దార్, బుట్టాయగూడెం
అడ్డుకట్ట వేయాలి
కూటవి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కొందరు చెరు వులు, కొండలను కొల్లగొడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాకు అధికారులు అడ్డు కట్టవేయాలి.
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం
మన్యంలో మట్టి దందా
మన్యంలో మట్టి దందా
మన్యంలో మట్టి దందా
మన్యంలో మట్టి దందా