
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు
నరసాపురం రూరల్: అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం నరసాపురం మండలం చినమైనవానిలంక గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పొదిగించబడిన ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి పాఠశాల విద్యార్థులతో కలిసి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను సెక్షన్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీ సత్యనారాయణ నివృత్తి చేశారు. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లుపెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. తాబేళ్ల జాతి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బయటకు రావడంతో గుర్తించి అటవీశాఖ ఆధ్వర్యంలో వాటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె రాంప్రసాద్, ఉపాధ్యాయుడు జి రవీంద్రరాజు, గ్రామస్తులు ఎంపీ కుమారస్వామి, విద్యార్థులు, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రంలో పనిచేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.