
చెట్ల సొమ్ము స్వాహా!
ద్వారకాతిరుమల: రోడ్డు మరమ్మతుల పేరుతో కూటమి నేతలు మార్జిన్‌లోని చెట్లను నరికివేశారు. వచ్చిన కలపను రూ.70 వేలకు అమ్మేసి సొమ్ములు స్వాహా చేశారు. ఇది జరిగి ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకూ రోడ్డు మరమ్మతుల ఊసెత్తలేదు సరి.. చెట్ల సొమ్ములు ఒక్క రూపాయి కూడా పంచాయతీకి జమ చేయలేదు. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహా రం చర్చనీయాంసమైంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనుకుంట నుంచి కామవరపుకోట మండలం వడ్లపల్లికి వెళ్లే గ్రావెల్ రోడ్డు ధ్వంసమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలతో వర్షం నీరు తడి ఆరక రోడ్డు దెబ్బతింటుందని కూటమి నేతలు కొందరు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లారు. చెట్లు నరికి, కలప విక్రయించగా వచ్చే సొమ్ముతో రోడ్డు మరమ్మతులు చేయించుకోమని ఆయన సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలో చెట్లు నరికి కలపను రూ.70 వేలకు విక్రయించారు. ఇందులో రూ.5 వేలను అటవీ శాఖ సి బ్బందికి వాటాగా ఇచ్చి మిగిలిన సొమ్మును నాయకులు స్వాహా చేశారు. ఇదిలా ఉండగా కలప సొమ్ము నగదు ఏమైందని ఎవరైనా ప్రశ్నిస్తే పంచాయతీకి జమ చేశామని ఆ నాయకులు చెబుతుండగా.. పంచాయతీ అధికారులను అడిగితే ఎలాంటి నగదు జమ చేయలేదని సమాధానమిస్తున్నారు.
వారం రోజులుగా మల్లగుల్లాలు : వారం రోజులుగా కూటమి నేతలు నగదు విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో విషయం బయటపడింది. సొమ్ములు స్వాహా చేసింది ఎవరూ, ఇంత జరుగుతుంటే పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ను వివరణ కోరగా చెట్లు నరికిన విషయం వాస్తవమని, ఆ సొమ్ములతో రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని నాయకులు తెలిపారన్నారు. అయితే సొమ్ములు ఏమయ్యాయన్న విషయంపై విచారణ చేస్తామని చెప్పారు.
చెట్లను అమ్మి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు
రూ.70 వేలు కూటమి నేతల జేబుల్లోకి..
అటవీ శాఖ సిబ్బంది వాటా రూ.5 వేలు !
ఆరు నెలలైనా పంచాయతీకి జమ కాని నగదు

చెట్ల సొమ్ము స్వాహా!