కొయ్యలగూడెం: వక్ఫ్ బోర్డు రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు కన్నాపురంలో సోమ వారం రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మతపరమైన రాద్ధాంతాన్ని ఖండించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకడం అన్యాయమని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుతో పేద ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని, అటువంటి బిల్లు రద్దు చేయడం ముస్లింలను తీవ్రంగా అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు. వక్ఫ్ బోర్డు రద్దు ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి కేంద్రంలోని బీజేపీని లొంగదీయాలని కోరా రు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. మెయిన్ సెంటర్‌లో రాస్తారోకో చేసి కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరంలో ర్యాలీలు నిర్వహించారు.
ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలి
బుట్టాయగూడెం : రాజమండ్రి బొల్లినేని ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జీలుగుమిల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నా యకురాలు ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు ముత్యాలమ్మ, సుధారాణి, వెంకటలక్ష్మి, బుల్లెమ్మ, సీతారామయ్య, బి.రాంబాబు, సీహెచ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు తగదు