
చేదెక్కుతున్న మామిడి
దిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆందోళన
మండలం మామిడి దిగుబడి
విస్తీర్ణం (అంచనా)
ఎకరాలు టన్నుల్లో
నూజివీడు 10,434 41,736
ఆగిరిపల్లి 17,655 71,060
ముసునూరు 2,520 8,500
చాట్రాయి 3,619 14,476
చింతలపూడి 4,000 15,315
లింగపాలెం 3,000 11,500
మొత్తం 41,208 1,62,587
నూజివీడు: పండ్లలో రారాజు మామిడి.. అయితే మామిడికి గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. గత నాలుగేళ్లుగా మామిడి దిగుబడి దారుణంగా పడిపోతుండటంతో మామిడి రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక.. గొయ్యి అన్న చందంగా తయారైంది. మామిడి పంట సంక్షోభం దిశగా పయనిస్తోంది. రైతులు పూత నిలుపుకునేందుకు ఎకరాకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టినా ప్రకృతి సహకరించక.. తెగుళ్లు, పురుగుల బెడదతో పూతలు మాడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
41వేల ఎకరాల్లో మామిడి తోటలు
జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా నూజివీడు నియోజకవర్గంలో మామిడి తోటలు సాగవుతుండగా మొత్తంమ్మీద 41 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు వంటి రకాలున్నాయి. వరి, మొక్కజొన్న, పామాయిల్ వంటి పంటలతో పాటు మామిడి కూడా ప్రధానంగా రైతులు సాగు చేస్తున్నారు. దీంతో రైతులు మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతుండగా కాలం కలిసి రాకపోవడంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.
నిలవని పూత
ఈ ఏడాది మామిడి తోటల్లో పూతలు బాగా వచ్చినప్పటికీ ఏ మాత్రం నిలబడలేదు. రెండు విడతలుగా పూత రాగా ముందు విడత పూత డిసెంబరు 15 నుంచి జనవరి మొదటి వారం వరకు వచ్చింది. రెండో విడత పూత జనవరి 20 తరువాత నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు వచ్చింది. మొత్తం విస్తీర్ణంలో దాదాపు 95 శాతం తోటలు పూత పూసినప్పటికీ పూత నిలవలేదు. నల్లతామర పురుగు ఆశించడంతో వచ్చిన పూతంతా తుడిచిపెట్టుకుపోయి కేవలం పూత కాడలే మిగిలాయి. దీంతో మామిడి పూత మొత్తం విస్తీర్ణంలో 20 శాతం కూడా లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పూతను నిలుపుకునేందుకు రైతులు మామిడి తోటలకు 12 నుంచి 15 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. అయినప్పటికీ నల్లతామర దాటికి పూతంతా మాడి మసైపోవడంతో రైతులు నష్టాల పాలై నిండా మునిగిపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా దిగుబడి లేకపోవడంతో రైతులు అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయారు.
ధర అంతంత మాత్రమే
దిగుబడి లేనప్పటికీ మామిడికి ధర అంతంత మాత్రంగానే ఉందని రైతులు వాపోతున్నారు. కాయలు బాగుంటే బంగినపల్లి టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు, తోతాపురి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర మాత్రమే పలుకుతున్నాయని, కాయలపై మచ్చలు ఉంటే ఆ మాత్రం ధర కూడా రావడం లేదని పేర్కొంటున్నారు.
పూత నిలవలేదు
పదెకరాల మామిడి తోటకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టి పురుగుమందులు కొట్టినా పురుగు చావలేదు. మామిడి రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నిసార్లు పిచికారీ చేసినా పురుగులు చావడం లేదు. వేలాది రూపాయలతో కొనుగోలు చేసి కొట్టినా పురుగు మందులు పనిచేయడం లేదు. నకిలీ పురుగు మందులు వస్తున్నాయనే అనుమానం ఉంది.
– బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు

చేదెక్కుతున్న మామిడి

చేదెక్కుతున్న మామిడి