30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని ! | 30 years waite to see mother a heartwarming story of a daughter | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !

Published Mon, Mar 10 2025 2:37 PM | Last Updated on Mon, Mar 10 2025 2:42 PM

30 years waite to see mother a heartwarming story of a daughter

 ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరిన మావోయిస్టు దంపతుల తనయ 

2001లో మద్దిమల్ల ఎన్‌కౌంటర్‌లో తండ్రి మృతి 

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోలొంగిపోయిన తల్లి 

పోలీసుల సమాచారంతో 30 ఏళ్ల తర్వాత తల్లిని

కలిసేందుకు కాంకేర్‌కు వెళ్లిన భవాని కోరుట్ల

తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. 

వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్‌ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్‌ డివిజన్‌ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. 

చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!

మోకాళ్ల నొప్పులు, షుగర్‌ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్‌ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్‌ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్‌లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది.  ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను 

ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...
చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు.   – భవాని  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement