మనలో చాలా మందికి ఇష్టంగా మారిన విదేశీ పండు కివి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితం. పేరుకే కాదు, నిజంగా కూడా ఇది న్యూజిలాండ్ పండే. వివిధ రంగుల్లో, వివిధ సైజుల్లో లభిస్తుంది. అయితే, సాధారణంగా... వెలిసిపోయిన ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉండే రకానికే ఆదరణ ఎక్కువ.
దీనిని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇక మన దగ్గర దొరికేది ఫుజీరకం కివి. పులుపు-తీపి కలగలిపి ఉంటుంది. ఇందులో జామ పండులాగా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ పండును విత్తనాలతో పాటే తినొచ్చు. న్యూజిలాండ్తో పాటు.. ఇటలీ, చిలీ, గ్రీస్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా దీనిని పండిస్తారు. కివీ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం!
కివీ పండు- పోషకాలు మెండు
విటమిస్ సీ పుష్కలం
సాధారణంగా నిమ్మకాయ, ఆరెంజ్‌లో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. అయితే, వీటిలో కంటే కివీలో రెండు రెట్లు ఎక్కువగా లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ సీ అత్యధికంగా కలిగి ఉండే కివీ పండు తినడం వల్ల కాన్సర్ ముప్పు తగ్గుతుంది. మంట, వాపు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నిద్రలేమికి చెక్ పెట్టేయొచ్చు!
తైపీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం... నిద్రలేమి సమస్యలకు కివీతో చెక్ పెట్టేయవచ్చు. సెరోటిన్ ఇందుకు దోహదం చేస్తుంది. నిద్రపోవడానికి ఓ గంట ముందు కివీ పండు గనుక తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
డైటరీ ఫైబర్ అధికం
కివీ పండులో డైటరీ ఫైబర్(కార్బోహైడ్రేట్) ఎక్కువ. దీని వల్ల హృద్రోగాల ముప్పు తగ్గుతుంది.
ఈ ఎంజైమ్ వల్ల..
బొప్పాయిలో పొపైన్ ఎలాగో.. కివీ పండులో ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ కూడా అలాగే పనిచేస్తుంది. ప్రొటిన్‌ను విడగొడుతుంది. పెద్ద పేగులో సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
ఫొలేట్ (విటమిన్- బి- 9) పుష్కలం
కివీ పండులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు దీనిని తినడం వల్ల... పిండం ఆరోగ్యంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు పెరిగే పిల్లలకు కూడా ఇది ఉపయోగకరం.
ఖనిజ లవణాల నిధి
కివీ పండులో విటమిన్ ఏ, బీ6, బీ12, ఇ ఉంటాయి. అదే విధంగా పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ అధికం. విటమిన్లు, ఖనిజ లవణాల నిధి అయిన కివీని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎముకలు బలపడతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కివిలో లుటిన్, జియాక్సంత్ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
కివీ పండును తినదలచినవారు దీన్ని పొట్టు తీయకుండా తినడం మంచిది. ఈ పొట్టులో యౌవనాన్ని చాలాకాలం పాటు నిలిచేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధినిరోధకశక్తి పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. అయితే, కచ్చితంగా వాటిని శుభ్రపరిచిన తర్వాతే తినాలి.
చదవండి: Pregnancy Planning: మాత్రల రూపంలో అమ్మే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల..
Comments
Please login to add a commentAdd a comment