ఓటీటీ బడిలో సృజనాత్మక పాఠాలు నేర్చుకుంటున్న యువతరం... దృశ్యలోకంలోనే ఉండిపోవడం లేదు. పుస్తక ప్రపంచం వైపు కూడా తొంగిచూస్తోంది. గంటల కొద్దీ సమయం పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోయినా, రకరకాల జానర్స్‌లోని పుస్తక సాహిత్యాన్ని సంక్షిప్త రూపంలో అందిస్తున్న డిజిటల్ వేదికలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి...
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు యూత్ మహారాజ పోషకులు అనే సత్యాన్ని రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు బలపరుస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ తరువాత ఓటీటీ వేదికల వైపు ఆకర్షితులవుతున్న యువతరం శాతం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ ధోరణి మంచికా? చెడుకా? అనే చర్చలో ‘ఓటీటీ వల్ల యువత కోల్పోతుందా? నేర్చుకుంటుందా?’ అనే ప్రధాన ప్రశ్న ముందుకు వచ్చింది.
‘నేర్చుకున్నదే ఎక్కువ’ అనేది చాలామంది అభిప్రాయంగా వినబడుతుంది. ‘లాక్‌డౌన్ టైమ్‌కు ముందు ఓటీటీ గురించి వినడం తప్ప పెద్దగా తెలియదు. అయితే అందులోకి వెళ్లాక మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఎన్నో చిత్రాలను చూశాను. మూడు ఫైట్లు, ఆరు పాటలు చూసీచూసీ మొహం మొత్తిన ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఇలా కూడా సినిమా తీయవచ్చా, ఇలాంటి సబ్జెక్ట్‌తో కూడా తీయవచ్చా! అని ఎన్నోసార్లు అనిపించింది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ నిఖిల.
పుస్తకాలు చదవడం వల్ల సృజనాత్మకత పదును తేరుతుంది. కొత్త సబ్జెక్ట్‌లు రాసుకోవడానికి వీలవుతుంది. కొత్త సబ్జెక్ట్‌లకు ఓటీటీ ఓకే అంటుంది. అయితే ఈ ఎస్‌ఎంఎస్‌ల కాలంలో పేజీలకు పేజీలు చదివే ఓపిక యూత్‌కు ఉందా?
ఇప్పుడు మనం అనుష్క శెట్టి(బెంగళూరు)ని పరిచయం చేసుకుందాం (హీరోయిన్ కాదు) ఒకప్పుడు అనుష్క శెట్టి పుస్తకాల పురుగు. ఎన్నో పుస్తకాలు చదివింది. అయితే తాను సైతం మొబైల్ ఫస్ట్–జెనరేషన్‌లో భాగం కావడానికి ఎంతకాలం పట్టలేదు. సోషల్ మీడియా, టెక్ట్సింగ్ యాప్స్ పైనే ఎక్కువ సమయాన్ని కేటాయించేది. ఈ నేపథ్యంలో ‘యూత్–బుక్‌రీడింగ్’ గురించి ఆలోచించగా, ఆలోచించగా ఆమెకు ఒక ఐడియా తట్టింది.
అదే..ప్లాప్ స్టోరీస్!
‘ఎడ్యుటెయిన్’ నినాదంతో రంగంలోకి దిగిన ఈ గ్లోబల్ ఇంటరాక్షన్ ఫిక్షన్ ఎంటర్ టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ బైట్–సైజ్‌డ్ ఫిక్షన్‌ను యూత్‌కు చేరువ చేస్తుంది. ‘యువతరాన్ని ఆకట్టుకోవడానికి పబ్లిషింగ్ ఇండస్ట్రీలో వినూత్న ప్రయత్నాలు జరగడం లేదు. కిండిల్ డిజిటల్ రీడింగ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, అది పేపర్ డిజిటలైజేషన్ మాత్రమే. ఈ నేపథ్యంలో పుస్తకపఠనాన్ని ప్లాప్ రూపంలో పునరావిష్కరించాం. టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో తక్కువ టైమ్‌లో యూత్‌కు సాహిత్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది ప్లాప్ స్టోరీస్ కో–ఫౌండర్ అనుష్క షెట్టి. ‘రీడింగ్ ట్రెండింగ్ అగేన్’ అనుకునే మంచి రోజులు రావాలని ఆశిస్తుంది అనుష్క.
క్రియేటర్స్‌గా రాణించడానికి సినిమాలు ఎంత ఉపయోగపడుతాయో, పుస్తక సాహిత్యం కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే పుస్తకాలు చదవడానికి గంటలకొద్దీ సమయాన్ని కేటాయించడానికి యువత సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో తక్కువ టైమ్‌లో పుస్తక సారాంశాన్ని తెలుసుకునే వేదికకు రూపకల్పన చేశాం. ట్రెయిలర్ నచ్చితే ఎలాగైనా సినిమా చూడాలనుకుంటాం. ఒక పుస్తకం లేదా నవల, కథ గురించి క్లుప్తంగా తెలుసుకున్నవారు మూలం చదివే ప్రయత్నం చేస్తారు అనేది మా నమ్మకం.
– అనుష్క శెట్టి, ప్లాప్ స్టోరీస్, కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment