గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, గట్టిగా నిలబడి మార్పునకు దారి చూపిన వంద మంది మహిళల జాబితాను బి.బి.సి. నిన్న మంగళవారం విడుదల చేసింది. ఏటా ఆ సంస్థ విడుదల చేసే ఆ జాబితాలో ఈ ఏడాది నలుగురు భారతీయ మహిళలూ ఉన్నారు. బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే (12) ఆ నలుగురు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క ఎదురీత, పోరాట పటిమ, ఉద్యమ నిర్వహణ. అసమాన ప్రావీణ్యం.
బిల్కిస్ (బానో) దాది
గత సెప్టెంబరులో ప్రధాని మోదీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులతో పాటు ఈ ఏడాది ‘టైమ్’ మ్యాగజీన్ చోటిచ్చిన 100 మంది శక్తిమంతుల జాబితాలో కూడా 82 ఏళ్ల బిల్కిస్ దాదీ ఉన్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ – సి.ఎ.ఎ.)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజులకు పైగా జరిగి, కరోనా వల్ల ఆగిపోయిన మహిళల బైఠాయింపు ప్రదర్శనలో బిల్కిస్ దాదీ చివరి రోజు వరకు పాల్గొన్నారు! గడ్డ కట్టించే చలిలో స్ఫూర్తిమంతమైన మాటలు చెబుతూ షహీన్‌బాగ్ నిరసనకు ఉద్యమరూపం తెచ్చారు బిల్కిస్. ఆ ప్రేరణతో దేశంలో మిగతాచోట్ల కూడా షహీన్‌బాగ్ తరహా మహిళా ఉద్యమాలు తలెత్తాయి.
గానా ఇసైవాణి
‘గానా’ అనేది ఒక ఆలాపన ధోరణి. అందులో పురుషుల స్వరాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. చెన్నై అమ్మాయి ఇసైవాణి గానాలో పట్టుసాధించి పురుష గాయకులకు దీటుగా నిలిచింది. పోటీ ఇచ్చింది. ప్రజాదరణ పొందింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ‘గానా’ పాటలు పాడేందుకు ముందుకు వచ్చారు!
మానసీ జోషి
పారా అథ్లెట్. బ్యాడ్మింటన్‌లో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్. అంగవైకల్యం, పారా క్రీడల విషయంలో భారతీయుల వైఖరిని సానుకూలంగా మార్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు. మానసీ జోషీ రాజ్‌కోట్ యువతి. ఇంజినీరింగ్ చదివారు. ఇటీవలే ‘టైమ్’ మ్యాగజీన్ ప్రకటించిన ‘నెక్స్›్ట జనరేషన్ లీడర్’ జాబితాలోనూ మానసీ ఉన్నారు.
రిధిమా పాండే
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవలసిన అవసరం గురించి తోడి విద్యార్థులను జాగృతం చేస్తున్న రిధిమా ఈ చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక చైతన్య సదస్సులలో పాల్గొంది. వాతావరణ మార్పుల విషయంలో భారత ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తో తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమ ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో పిటిషన్ వేసింది. గత ఏడాది గ్రెటా థన్‌బెర్గ్, ఇతర బాల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కమిటీలో ఫిర్యాదు చేసింది. పాండే ఉత్తరాఖండ్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment