క్యాన్సర్‌ను జయించే క్రమంలో... మీరు విజేత  కావాలంటే..? | Best Ways To Take Self Care During Cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను జయించే క్రమంలో... మీరు విజేత  కావాలంటే..?

Published Sun, Oct 31 2021 4:37 PM | Last Updated on Sun, Oct 31 2021 5:50 PM

Best Ways To Take Self Care During Cancer - Sakshi

మునపటి జవజీవాలూ, జీవితం పట్ల అనురక్తి, బతికే క్షణాలను ఆస్వాదించడం లేకుండా ఓ వ్యక్తి జీవితాన్ని కొన్ని రోజులూ, కొన్నేళ్లూ అంటూ పొడిగించడం సబబేనా?  ఓ జీవచ్ఛవంలా బాధితుడు తన బతుకును వెళ్లదీయడం సరైనదేనా? ఇలాంటిదే గతకాలపు చికిత్సల్లో చాలావరకు ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకునే... బాధితుడి జీవితాన్ని కేవలం కొద్దికాలం పొడిగించడానికి బదులుగా...  క్యాన్సర్‌ను జయించాక కూడా అతడు ఇంచుమించు ‘మునపటి జీవననాణ్యత’నే  అనుభవించేలా చేయడమే మంచి చికిత్స లక్ష్యం. ఇలా జరిగేలా ఇటీవలి చికిత్స ప్రక్రియలను మెరుగుపరస్తున్నారు. దీన్ని బట్టి... క్యాన్సర్‌ను జయించడం లేదా అధిగమించడమంటే (ఇంగ్లిష్‌లో చెప్పాలంటే క్యాన్సర్‌ సర్వైవర్‌షిప్‌ అంటే) ‘‘క్యాన్సర్‌ను కనుగొన్ననాటి నుంచి అతడి జీవితపర్యంతమూ... బాధితుడికి మునపటి జీవితాన్నీ, ఒకప్పటి సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇచ్చేలా చేయడమే’’ క్యాన్సర్‌ వైద్యమంటూ ఈ చికిత్సను పునర్నిర్వచించారు. అలా జరిగే క్రమంలో రోగి ఏయే దశలు దాటాల్సి వస్తుందో తెలుసుకోవడం అవసరం.

క్యాన్సర్‌ అంటే... అప్పట్లో తొలినాళ్లలో కేవలం 20 శాతం మంది మాత్రమే దాన్ని జయించేవారు. 80 శాతం మంది దాని బారినపడేవారు. కానీ వైద్యవిజ్ఞాన పురోగతితో అత్యాధునిక పరిశోధనల వల్ల ఇవాళ 85శాతం మంది దాన్ని పూర్తిగా జయిస్తున్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అంటే... క్యాన్సర్‌ చికిత్స విషయానికి వస్తే... గతం తాలూకు సన్నటి నల్లమబ్బుల వెండి అంచు స్థానంలో... ఇప్పుడు చాలావరకు కాంతిమంతమైన వెలుగురేకలు వ్యాపించాయి. కానీ ఇంకా అక్కడా ఇక్కడా ఇంకా కొన్ని కారుమేఘాలు కప్పే ఉన్నాయి. ‘‘ముందే కనుగొంటే క్యాన్సర్‌ పూర్తిగా తగ్గుతుంద’’ని భరోసా ఇవ్వడం అందరూ చెప్పేదే. కానీ  క్యాన్సర్‌ సోకాక ప్రతి దశలోనూ రోగి ఆవేదన, మనోభావాల గురించి ఇప్పటివరకు ఎవరూ పెద్దగా ఎవరూ చర్చించడంలేదు. చికిత్స సమయంలో బాధితులు క్యాన్సర్‌ను జయించే క్రమంలో కొన్ని మైలురాళ్లు దాటాల్సి వస్తుంటుంది. ఆ దశలెలా  ఉంటాయి, మాజీ రోగుల గత అనుభవాలతో ప్రస్తుత బాధితులు ఆ వేదనను ఎలా అధిగమించవచ్చో, క్యాన్సర్‌నెలా జయించవచ్చో తెలిపే కథనమిది. 

క్యాన్సర్‌తో పోరాటం ఒకింత గమ్మత్తయినది. ఒక్కోసారి పూర్తిగా తగ్గుతుంది. కానీ గత కాలపు శిథిలాల గుర్తుల్లా కొంత వేదననూ మిగుల్చుతుంది. దీన్ని ఎలా చెప్పవచ్చంటే... ‘గాయం మానింది... గాటు మిగిలింది’ లాంటి అనుభవంతో మిగిలిపోయిన మచ్చ కనిపిస్తూ మనసును సలుపుతూ ఉంటుంది. 

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

క్యాన్సర్‌ను జయించే క్రమంలో దశలివి... 
క్యాన్సర్‌ను పూర్తిగా జయించి, మునపటి మంచి జీవితాన్ని పొందే క్రమంలో ఈ కింది నాలుగు దశలను బాధితుడు దాటాల్సివస్తుంది. 
►క్యాన్సర్‌ను కనుగొనగానే (డయాగ్నోజ్‌ కాగానే) బాధితుడికి కలిగే షాక్‌ తొలిదశ. ఇందులో... క్యాన్సర్‌ అన్న మాట వినగానే ఎంతవారికైనా ఊహించని దెబ్బ తగిలినట్లవుతుంది. 
చికిత్సకూ... వ్యాధి నయమవడానికి మధ్యకాలపు సంధిదశ (ట్రాన్సిషనల్‌ సర్వైవర్‌షిప్‌): ఈ దశలో బాధితుడు జబ్బు నయమయ్యే దిశగా పురోగమిస్తున్నప్పటికీ ఎంతో కొంత ఉద్విగ్నతతో (యాంక్షియస్‌గా), వ్యాకులతతో, కుంగుబాటుకు లోనై (డిప్రెస్‌డ్‌గా) ఉంటాడు. ఈ దశలో వారినో సందేహం వేధిస్తుంటుంది. ఒకవేళ తగ్గినట్టే తగ్గినా ఇది మళ్లీ తిరగబెడుతుందా అన్న సంశయంలో ఉంటారు. 
జబ్బును అధిగమించాక దొరికిన జీవితం : (దీన్ని ఎక్స్‌టెండెడ్‌ సర్వైవర్‌షిప్‌గా చెప్పవచ్చు) మూడు రకాలుగా ఉంటుంది. అది (1) క్యాన్సర్‌ తగ్గిన దశ; (2)క్యాన్సర్‌ అంటూ ఉండదుగానీ... దానికోసం నిత్యం నిర్వహణ కార్యకలాపాలు (మెయింటెనెన్స్‌) ఉండాలి. ఆ మెయింటెనెన్స్‌ ఉన్నంతసేపూ క్యాన్సర్‌రహిత స్థితి ఉంటుంది. (3) క్యాన్సర్‌ ఉంటుంది గానీ... చివరి వరకూ కాస్త సాధారణ జీవితమే  కొనసాగుతుంటుంది. 
క్యాన్సర్‌నుంచి సంపూర్ణ, శాశ్వత విముక్తి (పర్మనెంట్‌ సర్వైవర్‌షిప్‌): ఈ దశలోనూ మళ్లీ మూడు చిన్న చిన్న దశలుంటాయి.

మొదటిది... క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోతుంది. దాని తాలూకు ఎలాంటి లక్షణాలూ లేకుండా మటుమాయమవుతుంది. 
రెండోది... క్యాన్సర్‌ పూర్తిగా తగ్గుతుంది. కానీ ఎవో కొన్ని అంశాలు మాత్రం దీర్ఘకాలం బాధిస్తుంటాయి. ఉదాహరణకు... కాస్తంత కుంగుబాటు (డిప్రెషన్‌) లేదా ఎప్పుడూ అలసటగా ఉండటం (ఫెటీగ్‌). 
మూడోది... అసలు క్యాన్సర్‌ తగ్గడం... కానీ దాని కారణంగా కొన్ని ఇతర అనుబంధ సమస్యలు బాధించడం. 
నాలుగోది... అసలు క్యాన్సర్‌ పూర్తిగా తగ్గుతుంది. కానీ అది ఇతర అవయవాలకు వ్యాపించి అనుబంధ క్యాన్సర్లకు కారణమవుతుంది. దాంతో మళ్లీ చికిత్స కొనసాగాల్సి వస్తుంటుంది. 
బాధితుడు ఈ నాలుగు దశలూ దాటక తప్పదని రోగులూ, వారి బంధువులూ, మిత్రులూ తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా అతడికి తగిన నైతిక మద్దతు అందిస్తే పూర్తిగా కోలుకోవడం తప్పక జరుగుతుంది. 

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

మరి రోగి, బంధువులు ఏం చేయాలి? 
ముందు చెప్పిన దశలన్నీ వచ్చే సమయంలో... అవి అనివార్యంగా రోగిపైనా, అతడి బంధుమిత్రులపైన కొంత ‘ఉద్వేగపూరితమైన’ భారాన్ని (ఎమోషనల్‌ బ్యాగేజ్‌ను) తప్పక మోపుతాయి. వాళ్లు ఆ బరువును ఎలా దించుకోవాలో తెలిపే సూచనలివి. 
►వారు గతంలో అనుభవించని కొత్త కొత్త ఉద్విగ్నతలకు, భావనలకు లోనవుతుంటారు. అది ప్రతిరోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ కావచ్చు. అది చికిత్స జరుగుతున్నప్పుడూ లేదా చికిత్స పూర్తయ్యాకా అనుభవంలోకి రావచ్చు. అతడికే కాదు. అతడి బంధుమిత్రులూ దీనికి గురికావచ్చు. ఇదంతా పూర్తిగా నార్మల్‌. 
►అనేక భావోద్వేగాలు కమ్మేయవచ్చు. తెలియని ఆగ్రహాలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు, ఆవేదనలు, అపరాధభావనలు, ఒంటరిదనం... లాంటి ఎన్నో ఫీలింగ్స్‌ వచ్చేస్తుంటాయి. ఇవి బాధిస్తున్నాయనే దానికి బదులుగా... వాటి నుంచి బయటపడటం ఎలా అనే దాని గురించే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. 
►అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే... బాధితుడు తనలోని భావాలూ, అనుభూతులూ, ఆవేదనలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల వాటినుంచి దూరం కావడం చాలా తేలిక. ఈ పనిని అతడు తనకు తానుగానూ చేయవచ్చు. లేదా కొన్నిసార్లు ఒకేలాంటి క్యాన్సర్‌తో అలాంటి చికిత్సనే తీసుకుంటున్నవారంతా ఒక గ్రూప్‌గా కూడా మంచి ఫలితం ఇస్తుంది. సాధ్యమైతే ఒక్కోసారి తాము అనుభూతిస్తున్న భావనలను మంచి శైలిలో రాయడం కూడా మేలైన ఫలితాలిస్తుంది. ఇలా బాధితుడు తన భావనల వ్యక్తీకరణకు ఎలాంటి మార్గమైనా ఎంచుకోవచ్చు, కాకపోతే వ్యక్తీకరించడమే ముఖ్యం. 
►ఈ క్రమంలో బాధితుడి అత్యంత వేదనాభరితమైన దశల్లో... కలిగింది చిన్నపాటి ప్రయోజనమైనా అది కొండంత అండ అవుతుంది. ఒకేమాటలో చెప్పాలంటే... ‘‘చిన్నపాటి మేలే తనకు చిరునవ్వు తెచ్చిపెడుతుంది’’. 
►క్యాన్సర్‌ బాధితులు చాలామంది చేసే పని... తాము చేయని తప్పుకు తమను నిందించుకుంటూ ఉంటారు. ‘‘మేం అప్పట్లో చేసిన ఆ పనివల్లనే ఈ పర్యవసానం. అదే పనిచేసినా... చేస్తున్నవారు హాయిగానే ఉన్నారు. మేమేం పాపం చేశామని మాకీ శిక్ష’’అంటూ బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో వైద్యవిజ్ఞానానికీ తెలియదు. ఇందులో బాధితుడి తప్పేమీ లేదు. అతడికా  అపరాధభావన అవసరమే లేదు. తమ గతకాలపు పనులకు తమను తాము నిందించుకోవడం కంటే... అన్నీ మరచి హాయిగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడమే మంచి జీవననాణ్యతకు మెరుగైన మార్గం.      
                                         
- డాక్టర్‌ సురేష్‌ ఏవీఎస్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ 

చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement