వధువు తల్లిదండ్రులతో నూతన దంపతులు
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె.
అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది.
ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు.
ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్‌మేన్‌గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది.
ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్‌కు వచ్చి మరీ వివాహం చేసుకుంది.
ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్‌ఆనంద్ కథ.
ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్‌పూర్ దగ్గర గైడ్‌గా పని చేస్తున్న దేవ్ ఆనంద్‌ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్‌ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్‌గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఆరేళ్ల క్రితం
ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్‌లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్‌గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్‌లో మేరీ టెక్స్‌టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్‌లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది.
ఫోన్ ప్రేమ
టూరిస్ట్‌లు టూర్ ముగిసిన వెంటనే గైడ్‌లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్‌కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్‌గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్‌ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు.
తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు
ప్రేమతో పని చేస్తుంటే
పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్‌గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్‌లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్‌ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్‌లో పెళ్లి.
వియ్యంకులయ్యారు
రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్‌ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్‌మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్‌పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్‌కు వెళ్లనుంది.
కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్‌లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment