జెన్నీ, రోజ్, లిసా
మనసును తాకండి. అందమే అంతా కాదు. అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’. ఆశల్ని తుంచేయకండి. నవ్వుల్ని ఆర్పేయకండి. అమ్మాయిల్ని.. జబ్బున పడేయకండి. కొత్త కొరియన్ ‘పాప్’! గర్ల్ బ్యాండ్ పాడుతోంది. ప్రపంచం ఇష్టంగా వింటోంది.
‘‘నీ కళ్ల ముందే కూలిపోతున్నా.. పాతాళంలోకి జారిపోతున్నా.. అయినా రెండు చేతులతో నా ఆశను పట్టుకుని పైకి ఎగబాకుతున్నా.’’పాడుతున్నారు ‘బ్లాక్‌పింక్’ గర్ల్స్. ‘‘నన్ను చూడు, నీకు ఏమనిపిస్తోంది?’’ అని.. కొనసాగింపుగా అడుగుతున్నారు జెన్నీ, జిసూ, లిసా, రోజ్. ఎవరిని అడుగుతున్నారు! ఆడపిల్లకు ఆశలు కల్పించి పారిపోయే మగధీరుడొకడు ఉంటాడు కదా, అతడిని.
కొరియన్ గర్ల్ పాప్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ కొత్త ఆల్బమ్ ‘ది అల్బమ్’ లోని ఎనిమిది పాటల్లో ఒకటైన ‘హౌ యు లైక్ దట్’ లోని కూలిన ఆశల గీతమిది. అక్టోబర్ 2న ఈ నలుగురమ్మాయిల బ్యాండ్ విడుదల చేసిన ‘ది ఆల్బమ్’ అక్టోబర్ 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 20 వేల కాపీలకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అంటే ఇంతవరకు ఆ ఏడుగురు అబ్బాయిల బి.టి.ఎస్. బాయ్ బ్యాండ్ మాత్రమే. వారే పాప్ హీరోలు, వారే పాప్ కింగులు. ఇప్పుడీ గర్ల్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ ధాటికి ఆ ఏడుగురు 2013 నుంచీ నిర్మించుకుంటూ వస్తున్న ‘పాప్’ లోక దుర్భేద్య మహా సామ్య్రాజ్యం బీటలు వారబోతున్న దృశ్యం లీలగా ఆవిష్కృతం కాబోతున్నట్లే ఉంది. బ్లాక్‌పింక్ వరుసగా మూడో వారం ‘బిల్‌బోర్డ్ 200’ లిస్టులో తొలి పదిస్థానాలలో ఉంటూ వస్తోంది!
‘ది ఆల్బమ్’లోని రెండో ట్రాక్ ‘ది ఐస్ క్రీమ్’! ‘దాహంగా ఉన్నట్లున్నావు.. కొంచెం దగ్గరకు రా..’ అని కోన్‌ల లా మూతిని తెరిచి మూడు నిముషాల మూడు సెకన్లలో అబ్బాయిల్ని ఫ్రీజ్ చేసేసే బ్లాక్‌పింక్ గర్ల్స్.. మూడో ట్రాక్ ‘ప్రెట్టీ శావేజ్’లో ‘బాయ్స్.. మేం వైలెంట్‌గానే ఉంటాం. తట్టుకోగలిగితే ఉండండి’ అని కొంచెం రూడ్‌గానే చెబుతారు. ‘రూడ్ కాదు, అందరికన్నా రూడ్’ అని ఇప్పటికే, ఈ నాలుగేళ్లలో ఈ నలుగురు పిల్లలకు పేరొచ్చేసింది! 2016లో ప్రారంభించారు బ్లాక్‌పింక్ పాప్ బ్యాండ్‌ని. ఈ ఎనిమిది ట్రాక్‌లకు ముందు ఐదు సింగిల్స్ ఉన్నాయి. అసలు వాటితోనే వాళ్లేమిటో చూపించారు.
ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి ‘ది ఐస్ క్రీమ్’ కోసం! మొత్తం 174 సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో పది లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడై రికార్డు నెలకొల్పిన తొలి బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’! ఏమిటి బ్లాక్‌పింక్ అంటే?! ఈ అమ్మాయిలు కల్పించిన అర్థం.. ‘అందమే అంతా కాదు’ అని! అమ్మాయిల్ని అందమైన పింక్ గులాబీతో పోలుస్తాం. ‘అందాన్నే చూడకండి’ అంటూ పింక్‌కి బ్లాక్‌ని జోడించి బ్లాక్‌పింక్ అని తమ బ్యాండ్‌కి పేరు పెట్టుకున్నారు. బ్లాక్‌పింక్ అని కాకుండా, పింక్‌బ్లాక్ అంటే మళ్లీ అది బ్లాక్‌కి పింక్ అందాన్ని అంటు కట్టినట్లు. అందుకే బ్లాక్‌ని ముందుకు తీసుకున్నారు. తెలివైన అమ్మాయిలే.
‘లవ్‌సిక్ గర్ల్స్’ ఐదో ట్రాక్. అమ్మాయిల్ని ప్రేమ సతాయింపులు ఎంత జబ్బున పడేస్తాయో చూడండి. ‘ప్రేమ మనల్ని వలపన్ని కిటీకీలు లేని గదిలో బంధించింది. ప్రతిసారీ బాధిస్తోంది. గుండెలు పగిలి ఏడ్చేలా చేస్తోంది. చివరికి ఏడుపు కూడా రానంతగా మొద్దుబారుతున్నాం..’’ అని పాడతారు. ‘బెట్ యు వాన్నా’, ‘క్రేజీ ఓవర్ యు’, ‘లవ్ టు హేట్ మీ’, ‘యూ నెవర్ నో’ మిగతా నాలుగు ట్రాక్స్. ‘ఎక్కడికెళదామో చెప్పు, అన్నీ సర్దుకుని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను..’ (బెట్ యు వాన్నా), ‘నువ్వంటే నాకు పిచ్చి. నీ మనసులోనూ నేను ఉన్నానని తెలుసు. అయినా కానీ నువ్వు గీసుకున్న గీతను దాటి రానులే’ (క్రేజీ ఓవర్ యు), ‘నెగిటివ్ డేస్, నెగిటివ్ నైట్స్.
బేబీ యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్’ (లవ్ టు హేట్ మీ), ‘నేను ప్రకాశవంతంగా నవ్వుదామని ప్రయత్నించిన రోజు.. చీకటి మరింతగా గాఢమైన నన్ను మింగేయాలని చూస్తుంటుంది ఎందుకనో..’ (యూ నెవర్ నో).. అని జెన్నీ, జిసూ, లిసా, రోజ్.. అమ్మాయిలు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వల్ల అంతగా హర్ట్ అవుతూ ఉంటారని ‘ది అల్బమ్’ ట్రాకులలో పాడతారు. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’ అని చెబుతారు. అందుకే ‘బ్లాక్‌పింక్’ ఇంతగా హిట్ అయినట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment