60 కుటుంబాలు.. ఒక జలదేవత | Bonda girl Malati Sisa Digs Well To Meet Water Needs Of 60 Families | Sakshi
Sakshi News home page

60 కుటుంబాలు.. ఒక జలదేవత

Published Wed, Oct 6 2021 12:30 AM | Last Updated on Wed, Oct 6 2021 4:12 PM

Bonda girl Malati Sisa Digs Well To Meet Water Needs Of 60 Families - Sakshi

మాలతి సిసా

గొడ్డలి నీటిలో పారవేసుకుంటే జలదేవత ప్రత్యక్షమవడం మనకు తెలుసు. కాని ఇక్కడ నీళ్లు లేవు. పారవేసుకోవడానికి పెన్నిధీ లేదు. ఆకలి బతుకుల గిరిజన జీవితం తప్ప. ఒరిస్సా అడవిలో అరవై కుటుంబాలు. ఎవరికి పడతాయి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతున్నాయి. అప్పుడు మాలతి సిసా వచ్చింది. ఏకంగా నీరు తగిలేంత లోతు బావి తవ్వింది. ‘వాటర్‌ గర్ల్‌’ అని మీడియా అంటోంది. జలదేవతే సరైన పదం.

ఇది అచ్చు సినిమాల్లో జరిగినట్టే జరిగింది. 25 ఏళ్ల మాలతి భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్‌ చేసి మల్కన్‌గిరి జిల్లాలోని తన గ్రామం బోండాఘాటీకి చేరుకుంది రెండు నెలల క్రితం. బోండాఘాటి అడవి ప్రాంతం. అక్కడ బోండులు అనే గిరిజన తెగ జీవిస్తూ ఉందని 1950 వరకూ భారత ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించాక కూడా వారి కోసం జరిగింది తక్కువ. ఇంకా చెప్పాలంటే మాలతి ఆ ఊరి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన తొలి అమ్మాయి. అంటే ఇన్నేళ్లు అక్కడ వారి అభివృద్ధికి ఏ మేరకు పని జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

సరే, అభివృద్ధి పెద్దమాట. తాగడానికి నీళ్లు ప్రాణాధారం కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఇప్పుడూ తన కుటుంబం నీళ్ల కోసం అవస్థ పడటం మాలతి గమనించింది. ఊళ్లో ఉండే బోరింగులు పాడయ్యాయి. కుళాయిలు పని చేయవు. నీళ్లు కావాలంటే తల్లి, తన ముగ్గురు చెల్లెళ్లు కిలోమీటరు మేర బిందెలు తల మీద పెట్టుకుని బయలుదేరాల్సిందే. ఇంతకు ముందు ఇదంతా మామూలు మాలతికి. కాని ఇప్పుడు తను చదువుకుంది. తనకు జరుగుతున్న అన్యాయం ఏమిటో... తమ వారి పరిస్థితులు ఏమిటో... బయట లోకం ఎలా ఉందో చూసింది. ఈ కష్టాలు మనమే తీర్చుకోవచ్చు అని తల్లిదండ్రులకు చెప్పింది. ‘మనమే బావి తవ్వుదాం’ అంది.

ఇలా ఊళ్లో ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా లేదు. మాలతి తండ్రి ధబులు, తల్లి సమరి కూతురికి సపోర్ట్‌ చేయాలనుకున్నారు.  మాలతి ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత... ‘అక్కా... మేము నీకు సాయం పడతాం’ అన్నారు. ‘ఈ బావి మన కోసం మాత్రమే కాదు... ఊళ్లో ఉన్న 60 కుటుంబాల కోసం’ అంది మాలతి. వెంటనే బావి తవ్వే పని మొదలైంది. మాలతి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు పలుగూ పారా తీసుకుని నాలుగైదు అడుగుల వెడల్పు ఉన్న చుట్టు బావి తవ్వడం మొదలెట్టారు. తలా కొంచెం తవ్వి పోస్తున్నారు.

14 అడుగుల లోతుకు వెళ్లాక నీళ్లు పడ్డాయి. కాని సహజంగానే అవి బురద నీరు. ఆ నీటిని తోడి పోస్తూ మరి కాస్త లోతుకు వెళితే తేట నీరు వస్తాయి. ‘నా దగ్గర డబ్బు లేదు. అయినా నీ కోసం ప్రయత్నిస్తా’ అని తండ్రి అటు తిరిగి ఇటు తిరిగి 7 వేలు తెచ్చి మాలతికి ఇచ్చాడు. మాలతి దాంతో మోటరు కొని బురద నీళ్లు బయటకు తోలించింది. మళ్లీ బావి తవ్వింది. ఇప్పుడు తేట నీళ్లు వచ్చాయి. తియ్యటి నీళ్లు. దాహం తీర్చే నీళ్లు.

ఊళ్లోని అందరూ వచ్చి ఈ నీళ్లు చూసి మాలతిని పట్టుకుని మెటికలు విరిచారు. ‘మా తల్లే మా తల్లే’ అన్నారు. మాలతిని చూసి ఇంకో రెండు మూడు యువ బృందాలు మరో రెండు మూడు బావులు తవ్వుతున్నాయి. అవి పూర్తవుతున్నాయి కూడా. ఈ సంగతి తెలిసిన మీడియా మాలతి మీద కథనాలు రాసి ఆమెను ‘వాటర్‌ గర్ల్‌’గా వ్యాఖ్యానించాయి. అధికారులు కదిలారు. ‘మీ బావి ఖర్చు, కూలి ఖర్చు ఇస్తాం’ అంటున్నారు. ‘వాటి సంగతి తర్వాత నా బావికి సిమెంటు రింగులు లేవు అవి వేయించండి’ అంటోంది మాలతి.

మాలతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి గొప్ప పని చేసింది’ అంటున్నారు. మాలతి ఇంతటితో ఆగాలని అనుకోవడం లేదు. గూడెంలో పిల్లలకు చదువు చెప్పాలని అనుకుంటోంది. అందరి కోసం పని చేయాలని అనుకుంటోంది. అంతా కలిసి 25 వేల జనాభా కూడా ఉండదు బోండులది. అరుదైన తెగ అది. దానిని కాపాడుకుని సంతోషంగా ఉండేలా చూడటం కూడా చేయడం లేదు ప్రభుత్వాలు. వారి కళ్లు తెరుచుకోవాలంటే ఇంటికో మాలతి అవసరమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement