వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. సీజన్ ఏదైనా కొన్ని ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తప్పని సరి. తీసుకునే ఆహారం పట్ల అవగాహన, అప్రమత్తత ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే అపోహలు, అవాస్తవాల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాంలో జాంపండు తినకూడదని, జలుబు చేస్తుందనే ఒక అపోహ ఉంది. మరి నిజం ఏంటో తెలుసు కుందామా..!
సీజన్ ఏదైనా జామకాయను సులభంగా అందరూ తినవచ్చు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ , ఫైబర్ ఎక్కువ. ఎదిగే పిల్లలనుంచి, పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ పండు తినవచ్చు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులుఈ పండ్లకు దూరంగా ఉండాలని కొంతమంది భావిస్తారు. జామపండు తినడానికి తియ్యగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. జామలో ఉండే పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జామ పండులో లభించే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయ పడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి, శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో ప్రతిరోజూ తినవచ్చు.
జామకాయలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామపండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 8 శాతం పెరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇక బరువు తగ్గడంలో కూడా జామ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాలరీలు తక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే జామలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.
నోట్ : అలెర్జీ ఉన్నవారు, జామ తిన్నతరువాత వికారం లేదా పొత్తికడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపించినా తినకూడదు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు ఆహారం విషయంలో వైద్యుల సలహాలను తు.చ. తప్పకుండా పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment