వణికించే చలిలో వేడివేడిగా తినాలని.. | Chapati And Roti Food Special Dishes And Recipes Special Story | Sakshi
Sakshi News home page

వణికించే చలిలో వేడివేడిగా తినాలని..

Published Sun, Nov 29 2020 11:20 AM | Last Updated on Sun, Nov 29 2020 1:06 PM

Chapati And Roti Food Special Dishes And Recipes Special Story - Sakshi

చలి గజగజలాడిస్తోంది. వణికించే చలిలో వేడివేడిగా తినాలని అంతా అనుకుంటారు. అందుకు వేడిగా కాదు.. స్పైసీగా కూడా కాస్త నోట్లో పడితే ఆ మజాయే వేరు. అందుకోసమే ఈ ప్రయత్నం. అన్నం, చపాతీ, రోటీ, పరాఠా... వంటకం ఏదైతేనేం... ఈ రుచులను జోడిస్తే పసందుగా ఉంటాయి. తియ్యగా, కారంగా, పుల్లగా.. కావలసిన రుచులను ఆస్వాదించొచ్చు.

సర్సో దా సాగ్‌ (పంజాబీ వంటకం)
కావలసినవి:
ఆవ ఆకు – రెండు కప్పులు; తోటకూర – అర కప్పు; పాలకూర – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు; వెన్న – 1 టీ స్పూన్‌; మొక్కజొన్న పిండి – ఒక టేబుల్‌ స్పూన్‌; రాళ్ళ ఉప్పు – కొద్దిగా; నీళ్ళు – తగినన్ని.

తయారీ:

  • ముందుగా ఆకు కూరలను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ’ ఒక ప్యాన్‌లో ఆకు కూరలకు తగినన్ని నీళ్ళు జత చేసి, స్టౌ మీద ఉంచి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి దింపేయాలి
  • బాగా చల్లారాక పప్పు గుత్తితో బాగా మెదిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచుకోవాలి
  •  స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి, వేయించాలి
  • పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు జత చేసి, బంగారు రంగులోకి వచ్చేవరకూ వేయించాలి
  • ఆకు కూరల ముద్దను జత చేసి, ఐదు నిముషాల పాటు కలపాలి
  • ఉడుకుతుండగానే రాళ్ళ ఉప్పు, మొక్కజొన్న పిండి జతచేసి, బాగా కలిపి, నాలుగైదు నిముషాలు ఉడికించాలి
  • నెయ్యి జత చేసి, బాగా కలిపి ప్లేటులోకి తీసుకోవాలి
  • వెన్నతో అలంకరించాలి
  • రోటీలు, పూరీలు, పరాఠాలు, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.  

 బీట్‌ రూట్‌ కబాబ్‌
కావలసినవి:
బీట్‌ రూట్‌ తురుము – ఒక కప్పు; టోఫు – అర కప్పు (తురమాలి); వెల్లుల్లి ముద్ద – అర టేబుల్‌ స్పూను; ఆమ్‌ చూర్‌ పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన దానిమ్మ గింజల పొడి – ఒక టేబుల్‌ స్పూను; చాట్‌ మసాలా – చిటికెడు; రాళ్ళ ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – పావు కప్పు; ఓట్స్‌ పొడి – అర కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత.

తయారీ:

  • ఒక పాత్రలో బీట్‌ రూట్‌ తురుము, టోఫు తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా, ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి, బాగా కలిపి, చేతితో కట్‌లెట్‌ మాదిరిగా ఒత్తాలి
  • ఒక్కొక్క దానిలో జీడిపప్పు పలుకులు వేసి, కబాబ్‌ మాదిరిగా గుండ్రంగా చేయాలి
  • ఓట్స్‌ పొడిని అద్దాలి ∙స్టౌపై బాణలిలో నూనె కాగాక, కబాబ్స్‌ని అందులో వేయించి, కిచెన్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి
  • గ్రీన్‌ చట్నీతో వేడిగా అందించాలి

 చిలగడ దుంప రబ్డీ
కావలసినవి:
పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్‌ స్పూన్.

తయారీ:

  • స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి
  • ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి
  • చిన్న కప్పులో గోరు వెచ్చని నీళ్ళలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి
  • ఏలకుల పొడి జతచేయాలి
  • పల్లీ, పిస్తా, జీడిపప్పల పొడి జత చేసి, కలిపి దింపేయాలి
  • చల్లారాక, ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి, తీసి అందించాలి. 

 భర్వాన్‌ గోబీ
కావలసినవి:
క్యాలీఫ్లవర్‌ తరుగు – ఒక కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్‌ కోసం: చీజ్‌ తురుము – అర కప్పు కిస్‌మిస్‌ – 15; దానిమ్మ గింజలు – 3 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పు తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; కోవా పొడి – 4 టేబుల్‌ స్పూన్లు
పిండి కోసం:సెనగ పిండి – ఒక కప్పు; వాము – ఒక టేబుల్‌ స్పూను; వెల్లుల్లి తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని.

తయారీ:

  • స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు జత చేసి మరిగించి దింపేయాలి
  • క్యాలీఫ్లవర్‌ తరుగును అందులో వేసి, మెత్తపడే వరకు ఉంచాలి
  • ఒక పాత్రలో చీజ్‌ తురుము, కిస్‌మిస్, దానిమ్మ గింజలు, జీడి పప్పు తరుగు, కొత్తిమీర, అల్లం తురుము, కోవా పొడి వేసి అన్నీ బాగా కలిపి, మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి
  • క్యాలీఫ్లవర్‌ తరుగును ఇందులో వేసి అన్నీ కలిసేలా కలపాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్‌ను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, వేడివేడిగా అందించాలి.

 ముల్లంగి కోఫ్తా

కావలసినవి: 
ముల్లంగి – అర కేజీ, కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను, పల్లీలు – అర టేబుల్‌ స్పూను, వేయించిన సెనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, గరం మసాలా – ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి – 2, పచ్చి మిర్చి – 1, ఉల్లిపాయ – 1, కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత,

గ్రేవి కోసం:
ఎండు మిర్చి – 4, వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, పసుపు – అర టీ స్పూను, ఉల్లి తరుగు – ఒక కప్పు, ఉల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను, నూనె – 100 మి.లీ, పెరుగు – అర కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూను, ఏలకులు – 4.

తయారీ:

  • ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి, దింపేయాలి 
  • నీరంతా ఒంపేసి, ముల్లంగి ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి 
  • ఒక పాత్రలో కొబ్బరి తురుము, పల్లీలు, సెనగ పిండి, గరం మసాలా, ఎండు మిర్చి వేసి బాగా కలపాలి
  • పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి మరోమారు కలపాలి
  • ఉప్పు, ముల్లంగి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి 
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. 

గ్రేవీ తయారీ:

  • మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు వేసి మెత్తగా చేసి, స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఈ ముద్దను వేసి వేయించాలి 
  • ఉల్లి తరుగు, ఉల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి 
  • పెరుగు, గరం మసాలా, ఏలకులు, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి 
  • అర కప్పు నీళ్లు పోసి, మంట బాగా తగ్గించి, రెండుమూడు నిమిషాలు ఉంచాలి 
  • వేయించి ఉంచుకున్న కోఫ్తాలను ఇందులో వేసి, బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
  • చపాతీలు, ఫ్రైడ్‌ రైస్, బిర్యానీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది.

కోవా బఠానీ టిక్కీ

కావలసినవి:
నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; అల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; ఉడికించిన బఠానీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు.

ఫిల్లింగ్‌ కోసం:  
కోవా – ఒక కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పిస్తా తరుగు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – ఒక టీ స్పూను; ఖర్జూరం తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత
తయారీ:

  • స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వేసి దోరగా వేయించాలి
  • బఠానీ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు జతచేసి, కొద్దిగా వేగిన తరవాత పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకూ మెదపాలి
  •  ఒక పాత్రలో కోవాను చేతితో మెదుపుతూ పొడి చేయాలి
  • పచ్చి మిర్చి, పిస్తా, కొత్తిమీర, ఖర్జూరం తరుగు, జత చేసి బాగా కలపాలి
  • బఠానీ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, వెడల్పుగా ఒత్తి, కొద్దిగా కోవా మిశ్రమాన్ని మధ్యలో ఉంచి, టిక్కీ మాదిరిగా ఒత్తాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేడెక్కాక, టిక్కీలను అందులో వేసి దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకి తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి.

స్నాక్‌ సెంటర్‌
 చికెన్‌ స్విస్‌ రోల్‌
కావలసినవి: చికెన్‌ తురుము – 1 కప్పు (చికెన్‌ని మెత్తగా ఉడికించి.. సన్నని తురుము చేసుకోవాలి), స్వచ్ఛమైన కొబ్బరి నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్‌వి, చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 3(చిన్నచిన్న ముక్కలు కట్‌ చేసుకోవాలి), అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – 2 రెబ్బలు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున, కొత్తిమీర తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, బంగాళదుంప గుజ్జు – అర కప్పు (దుంపలను ఉడకబెట్టి ముద్దలా చేసుకోవాలి), మైదా పిండి – 1 కప్పు, రవ్వ – పావు కప్పు, గోధుమ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు, పాలు – 5 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ ఫ్రైౖ కి సరిపడా.

తయారీ: 

  • ముందుగా స్టవ్‌ చిన్న మంట మీద పెట్టుకుని.. పాన్‌లో కొబ్బరి నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి.
  • తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి.
  • చికెన్‌ తురుము, కొత్తిమీర తురుము, బంగాళదుంప గుజ్జునూ వేసి  వేయించుకోవాలి.
  • ఇప్పుడు చిన్న బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, రవ్వ వేసుకుని సరిపడే నీళ్లతో చపాతీ ముద్దలా కలిపి పక్కనపెట్టుకోవాలి.
  • మరో చిన్న బౌల్‌లో గోధుమపిండి, పాలను పలచగా కలిపి  ఉంచుకోవాలి.
  • అవసరం అనుకుంటే అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు.
  • ఇప్పుడు మైదాతో చేసిన చపాతీ ముద్దను కాస్త మందంగా చపాతీల్లా చేసుకుని.. అందులో చికెన్‌ మిశ్రమాన్ని పెట్టి.. రోల్‌ చేసుకుని  ఇరువైపులా ఫోల్డ్‌ చేసుకోవాలి.
  • వాటిని గోధుమపిండి–పాల మిశ్రమంలో ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి.

 బనానా డోనట్స్‌
కావలసినవి:  
అరటిపండ్లు –2, గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార – అర కప్పు, ఉప్పు – చిటికెడు, బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్, గుడ్లు – 2, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 1 టీ స్పూన్, బటర్‌ – పావు కప్పు (కరిగించినది).

తయారీ:

  • ముందుగా అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకుని.. అందులో పంచదార, ఉప్పు, గుడ్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • బేకింగ్‌ పౌడర్, కరింగించిన బటర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు గోధుమ పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
  • తర్వాత డోనట్స్‌ మేకర్‌లో పాన్‌కి బ్రష్‌తో కొద్దిగా నూనె రాసి.. గరిటెతో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని అందులో వేసి.. స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది.


 క్యారెట్‌ పుడ్డింగ్‌
కావలసినవి:  క్యారెట్‌ – 3 (గుండ్రంగా ముక్కలు కట్‌ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 కప్పులు (వేడి చేసినవి), ఉప్పు – చిటికెడు, వేరుశనగలు – 2 టేబుల్‌ స్పూన్లు (వేయించి తొక్క తీసినవి), పంచదార – అర కప్పు, పాల పొడి – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:

  • ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. క్యారెట్‌ ముక్కలు పాన్‌ బౌల్‌లో వేసుకుని.. అందులో వేడి వేడి పాలు పోసుకుని.. చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి.
  • ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి గరిటెతో తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి.  
  • వేరుశనగలనూ వేసి వాటినీ మెత్తగా ఉడకనివ్వాలి. క్యారెట్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత.. స్టవ్‌ ఆఫ్‌ చేసి.. చల్లారనివ్వాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ బౌల్‌లో వేసుకుని, మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముందుగా ఉపయోగించిన బౌల్‌లోనే వేసి పంచదార, పాల పొడి వేసుకుని మరికాసేపు గరిటెతో కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని గరిటెతో తిప్పుతూ మళ్లీ ఉడకనివ్వాలి.
  • బాగా దగ్గర పడిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరింత  దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
  • మొత్తం నెయ్యి వేసి.. చివరిగా ఒకసారి కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. 5 అంగుళాల లోతుండే బౌల్‌లోకి తీసుకుని రెండు లేదా మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • అప్పుడు దాన్ని బోర్లించి.. బయటకు తీసుకుంటే క్యారెట్‌ పుడ్డింగ్‌.. జున్ను ఉంటుంది.
  • దాన్ని నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement