మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్
నేటి తరానికి క్విల్ట్‌గా పరిచయమైన నిన్నటి తరం బొంతను జ్ఞాపకాల పుంతలా అందిస్తున్నవారిని గుర్తించింది ఢిల్లీ ఎన్‌సిఆర్. అంతేకాదు, ఈ అందమైన కళను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీతో పాటు అక్కడి చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే ఎన్‌సిఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) ఇటీవల పాత బట్టలతో కొత్తగా రూపొందించే రెండు క్విల్ట్ (బొంతల తయారీ) క్రాఫ్ట్ వెంచర్లను గుర్తించి, ఈ తయారీకి సపోర్ట్‌గా నిలిచింది. మెమరీ క్విల్ట్‌లుగా గతకాలపు జ్ఞాపకాలతో నిండిన పెట్టెలుగా మనల్ని హత్తుకునేలా తీర్చిదిద్దుతున్నారు వీటి రూపకర్తలైన మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్.
నలభై ఏళ్ల మనీషా దేశాయ్, నలభై మూడేళ్ల ఆయేషా దేశాయ్‌లు తోబుట్టువులు. ఇద్దరూ గురుగ్రామ్‌లోని గార్డెన్ ఎస్టేట్‌లో ఉంటున్నారు. వారి ట్రంక్ పెట్టెల నిండా గత కాలంలో ఉపయోగించిన అత్యుత్తమ దుస్తులు దొంతర్లుగా ఉంటాయి. మనీషా మాట్లాడుతూ ‘నేను పూణెలో ఉన్నప్పుడు 2016లో కర్ణాటక బెల్గాంలో ఉన్న మా పుట్టింటికి వచ్చాను. మా చిన్ననాటి నుంచి మేం వాడిన పాతబట్టలతో నిండిన పెద్ద ట్రంకు పెట్టె ఉంది. ఆ డ్రెస్సులన్నీ తీసేస్తానన్నప్పుడు మా అమ్మ పెద్ద గొడవ చేసింది. వాటిని ఏదైనా చేయాలనుకుంటే కూతుళ్లు అని కూడా చూడనని బెదిరించింది. ఎంత చెప్పినా తను వినలేదు. మా ఇంట్లో అందరం కూర్చొని వాటిని ఏం చేయాలో చర్చించుకున్నాం’ అని తమ క్రాఫ్ట్స్ తయారీ మూలం గురించి వివరించింది మనీషా.
గతంలో తాము ధరించిన దుస్తులకు మరింత ప్రత్యేకత జత చేయాలనే ఉద్దేశ్యంతో ఓ కుట్టు మిషన్‌ని కొని, కొన్ని బట్టలను ఎంచుకొని, వాటిలోని నాణ్యమైన భాగాలను ఎంపిక చేసుకుంటూ ఓ బొంతను కుట్టాం. అది చూసి అమ్మ ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ బాగా నచ్చింది. అడిగారు అని మా స్నేహితుల కోసం కొన్ని బొంతలు కుట్టి ఇచ్చాం’ అని తెలిపిన ఈ సోదరీమణులు ఆ మరుసటి ఏడాది ఎంతగా అంటే, ఇదే కాన్సెప్ట్‌తో ‘కార్నోకోపియా’ అనే పేరుతో ఒక సంస్థనే ఏర్పాటు చేశారు.
గతం ఇచ్చిన కానుకగా జత కట్టి
‘చాలా మంది తమ పాత బట్టలను వదులుకోవడానికి ఇష్టపడరు. వాటితో వారికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తమ కుటుంబసభ్యులు ప్రేమగా ఇచ్చినవి, ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేసినవి, తమకు తాముగా కుట్లు అల్లికలు చేసుకున్నవి.. ఇలా వాడిన దుస్తుల జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ జ్ఞాపకం దూరం చేసుకున్నట్టే అని భావిస్తారు. అలాగే ఉంచేయాలనుకుంటే వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ‘థీమ్ ఆధారిత ఎంబ్రాయిడరీ బొంతల’ను నాలుగేళ్ల క్రితం నుంచి తయారుచేయడం మొదలుపెట్టాం. ‘మెమరీ క్విల్ట్’లుగా పిల్లల పాత బట్టల నుండి ప్యాచ్‌లను తయారుచేయడం ప్రారంభించాం. టీ షర్టుల నుంచి ప్యాంటు వరకు అన్నీ వీటిల్లో ఉపయోగించాం.
కొన్ని సమయాల్లో షాపుల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలు కూడా సేకరించాం. గురుగ్రామ్ గార్డెన్ ఎస్టేట్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఢిల్లీ–ఎన్‌సిఆర్ పాల్గొంది. నివాసితులకు ఇవ్వడానికి కొన్ని బొంతలను తయారుచేయించింది. 4 అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఉండే మెత్తని బొంత రూ.7,500 ఉంటుంది. బొంత పరిమాణాన్ని బట్టి ధర పెరుగుతుంది’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. అంతే కాదు పాత వస్త్రాలను, క్లాత్ ముక్కలను నూలుగా మార్చడం, వీటి నుండే దారాలు తీయడంతో పాటు ప్యాకేజీకి పనికివచ్చే బ్యాగులను కూడా తయారుచేస్తారు ఈ అక్కాచెల్లెళ్లు.
జ్ఞాపకాలకే డిమాండ్
‘ఫ్యాబ్రిక్ వ్యర్థాల నుండి తయారుచేసిన క్విల్ట్‌ల కంటే మెమరీ క్విల్ట్‌లకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత ఈ తరహా మెత్తని బొంతల తయారీకి ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. జ్ఞాపకాలకు న్యాయం చేయడం అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. కానీ, కుటుంబాలు తమ జీవితాంతం ఉపయోగించుకునేలా మనపై నమ్మకం ఉంచినప్పుడు దానినే గౌరవంగా భావిస్తున్నాం. చంటిపాప అయినా, జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ, తాతయ్య అయినా వారు చెప్పే అందమైన కథలో మేమూ భాగం అవుతున్నాం. ఆ జ్ఞాపకాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు ఈ తోబుట్టువులు.
మనసు లోతులను తడమాలే కానీ ఇలాంటి ఎన్నో మధురానుభూతులను మిగిల్చే కళలు లోకంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటాయి. వీరి కళ నచ్చితే ఎవరైనా ఓ ప్రయత్నంతో ఈ జ్ఞాపకాల బొంతను సొంతంగా తయారుచేసుకోవచ్చు.
బిడ్డలను కథలా అల్లుకుపోయేలా..
ఫరీదాబాద్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ రాశీ మాలిక్ తన సోదరి కోసం మొట్టమొదటి జ్ఞాపకాల బొంతను సృష్టించినట్టు గుర్తుచేసుకుంది. ‘మా అక్క లండన్‌లో ఉంది. ఆమె బిడ్డ కోసం తన దుస్తులను ఉపయోగించి, ఒక అందమైన మందపాటి దుప్పటిని రూపొందించాను. అది ఎంత అందంగా అంటే, కొన్ని కథలు రోజూ కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉంటాయి. హృదయానికి హత్తుకున్న దృశ్యమవుతుంది. మా అక్క ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేను’ అని తన మొదటి జ్ఞాపకాల క్విల్ట్ రూపకల్పన గురించి వివరిస్తుంది రాశీ.
‘మామ్–ఎంటోస్’ పేరుతో క్విల్ట్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి, బేబీ క్విల్ట్‌లను సృష్టిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా తన వెంచర్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు తన వెంచర్ నుంచి పాత దుస్తులను ఉపయోగిస్తూ కుషన్లు, దిండు కవర్లు, బొమ్మలను కూడా తయారుచేస్తోంది. దుప్పట్లు, బొంతలు జ్ఞాపకాలను ఎలా స్పర్శిస్తాయో చెబుతూ ‘మంచం మీద పొరలుగా ఉన్నప్పడు చిన్ననాటి కథలు, మధురమైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ప్రదర్శిస్తాయి. పిల్లలకి వారు పెద్దయ్యాక తమ బాల్యం గురించి తెలుసుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. పెద్దలకు కానుక ఇస్తే.. పిల్లలు తల్లిదండ్రులకు తమ డిగ్రీపట్టాను కానుక ఇచ్చినంత సంబరాన్నిస్తుంది’ అని చెబుతుంది రాశీ మాలిక్.
చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment