కరోనా వైరస్ మన దేహంలోకి ప్రవేశించగానే సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస అందకపోవడం వంటివి చాలామందిలో కనిపించాయి. అందుకే తొలుత దాన్ని ఓ ఫ్లూ లాంటి జలుబుగా పరిగణించారు. కానీ మరికొంత మందిలో నీళ్ల విరేచనాలు, గొంతులో మంట, యాసిడ్ బయటకు తన్నినట్లుగా అనిపించడం, ఛాతీ బరువుగా ఉండటం, ఛాతీలో మంట, పొట్ట/ఛాతీ భాగంలోని కండరాలు పట్టేయడం (క్రాంప్స్), వికారం (వాంతి అవుతున్నట్లుగా అనిపించడం) వంటి లక్షణాలూ కనిపించాయి. కొంత పరిశీలన తర్వాత నిపుణులు వీటిని కూడా కరోనాకు సూచనగా పరిగణించడం మొదలుపెట్టారు.
అయితే వీటిలో నీళ్ల విరేచనాలు, వికారం వంటి కొన్నింటిని మినహాయిస్తే... మిగతావి గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలు కూడా కావడంతో... కరోనా గుండె, రక్తప్రసరణ వ్యవస్థనూ దెబ్బతీసి కొందరిలో గుండెపోటుకూ కారణమవుతుందని వెల్లడైంది. క్రమంగా వైరస్‌లో కనిపించిన జన్యుమార్పుల వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాలు సైతం ఎక్కువగానే కనిపించడం మొదలైంది. అదేవిధంగా కరోనా అనంతరం మిగతా అవయవాలపై దుష్ప్రభావాలు ఉన్నట్లే... జీర్ణవ్యవస్థపై కూడా ఈ వైరస్ కొన్ని ప్రతికూల ప్రభావాలను వదిలిపెట్టి వెళ్లడాన్ని శాస్త్రవేత్తలు, నిపుణులు గమనించారు. ఈ విషయమై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి కూడా.
కరోనా తర్వాతా కొనసాగే లక్షణాలు...
సాధారణంగా కరోనా వైరస్ సోకిన 14 రోజుల్లోనే దాని ప్రభావం తగ్గడం, నిర్ధారణ పరీక్షలు చేయిస్తే నెగెటివ్ రావడం, అంతకు ముందునుంచే లక్షణాలు క్రమంగా తగ్గడం వంటివి జరుగుతుంది. కానీ కొందరిలో దాదాపు అన్ని వ్యవస్థలకు చెందిన కొన్ని రకాల అనర్థాలు కనిపించినట్టే జీర్ణవ్యవస్థలోనూ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు యాసిడ్ పైకి ఎగజిమ్మేలా చేసే యాసిడ్ రిఫ్లక్స్, వికారం, కడుపు ఉబ్బరించినట్లుగా ఉండటం (బ్లోటింగ్), పొట్టలో తీవ్రమైన నొప్పి (అబ్డామినల్ పెయిన్), తరచూ విరేచనాలు కావడం వంటి లక్షణాలు... ఇటీవల చాలామందిలో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా కనిపిస్తున్నాయి. ఇక మరికొందరిలోనైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత కూడా అడపాదడపా పునరావృతం కావడం జరిగింది.
లక్షణాలు ఎందుకు కనిపిస్తాయంటే?
వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఈ లక్షణాలు ఉంటాయి. ఓ వ్యక్తిలో వైరస్ పరిమాణం మరీ ఎక్కువగా ఉండటం కారణంగా జీర్ణవ్యవస్థలోని పలు భాగాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావచ్చు. ఆ వైరస్ దేహంలో చాలాకాలం పాటు ఉండటం కూడా ఓ కారణం కావచ్చు. అప్పుడు ఏదైనా భాగం ఇన్‌ఫ్లమేషన్‌కు గురైనప్పుడు వాపు, మంట, ఎర్రబారడం జరుగుతుందన్న విషయం తెలిసిందే. జీర్ణవ్యవస్థలోనూ ఈ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా జీర్ణవ్యవస్థలోని కీలకమైన భాగాలు ప్రభావితమవుతాయి.
హైపాక్సియా కూడా ఓ కారణమే...
ఇటీవల కరోనా కారణంగా ‘హైపాక్సియా’ అనే కండిషన్ గురించి ప్రజలందరికీ తెలిసి వచ్చింది. దేహంలోని అన్ని కణాలకూ ఆక్సిజన్ తగినంత పరిమాణంలో అందకపోవడమే ‘హైపాక్సియా’. ఇటీవల కరోనా తర్వాత అన్ని ప్రచార, ప్రసార సాధనాల ద్వారా మన రక్తంలో ఆక్సిజన్ పరిమాణం దాదాపు 95 శాతానికి మించి ఉండాలనీ, అంతకంటే తగ్గితే... బాధితుడిని తక్షణం హాస్పిటల్‌కు తరలించాలన్న అవగాహన అందరికీ తెలిసింది ఈ కరోనా సమయంలోనే. మనకు తెలిసిందల్లా రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గితే... శ్వాస అందకపోవడం, ఆయాసం, ఛాతీనొప్పి, గుండెకు కలిగే నష్టం గురించే తెలుసు. కానీ దీని వల్ల గుండె, ఊపిరితిత్తులకే కాదు... జీర్ణవ్యవస్థ మొత్తానికి (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్‌కు) తీరని నష్టం కలుగుతుంది. హైపాక్సియా కారణంగానే బాధితుడు అస్థిమితంగా ఉండటం, కంగారు కంగారుగా వ్యవహరించడం, యాసిడ్ పైకి ఎగజిమ్మినట్టుగా కావడంతో పాటు ఇతర జీర్ణవ్యవస్థ తాలూకు లక్షణాలు వ్యక్తమవుతుంటాయని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల పరిశీలనల్లో, పరిశోధనల్లో తేలింది. ఇలా ఆక్సిజన్ తగ్గడం వల్ల తీవ్రమైన నిమోనియా వంటి లక్షణాలు, అనర్థాలు ఎంతగా కలుగతాయో... కరోనా వచ్చి తగ్గాక కూడా దీర్ఘకాలపు జీర్ణవ్యవస్థ సమస్యలూ అంతగానే సంభవిస్తాయి.
మందుల దుష్ప్రభావాలు కూడా...
కరోనా వచ్చినా... లేదా మరేదైనా సమస్య వచ్చినా దాన్ని నయం చేసుకోవడం కోసం మనం మందులు వాడుతుంటాం. మనం నోటి ద్వారా తీసుకున్న మందులన్నీ జీర్ణవ్యవస్థలోకి వెళ్లి... జీర్ణమై.. ఆ మందు ప్రభావాలన్నీ ఆయా రుగ్మతల మీద పనిచేయాలి. మనం విచ్చలవిడిగా మందులు వాడే ఈ క్రమంలో అవి కడుపులో పడగానే దాని రసాయన ప్రతికూలతలూ, ప్రభావాలు తొలుత పడేది జీర్ణవ్యవస్థలోని గోడల మీదే. అయితే జీర్ణవ్యవస్థలోని గోడలు ఎప్పటికప్పుడు తమను తాము రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ కారణంగా చాలావరకు వాటి దుష్ప్రభావాలు మనకు కనిపించవు... లేదా అతికొద్దికాలం పాటు కనిపించి అవే తగ్గిపోతాయి.
కానీ కరోనా చికిత్సలో తీసుకునే కొన్ని మందులు మూత్రపిండాలపై దుష్ప్రభావం చూపినప్పుడు కూడా... ఆ దుష్ప్రభావాలు జీర్ణవ్యవస్థ తాలూకు లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కానీ మూత్రపిండాలు ప్రభావితమై ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు చాలా నిశితంగా గమనించి, మూత్రపిండాలు మరింత దెబ్బతినకుండా రక్షించడం, అవి మరిన్ని దుష్ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.
కాలేయంపైన కూడా...
ఇవే మందులు కాలేయంపై కూడా తమ దుష్ప్రభావాలు చూపవచ్చు. ఉదాహరణకు కాలేయం వాచడం, దాని నుంచి కొన్ని ఎంజైములు అధికంగా స్రవించడం జరగవచ్చు. ప్రధానంగా దేహంలో స్రవించాల్సిన ఇన్సులిన్ మోతాదులు తగ్గినప్పుడు కూడా ఇలా జరగవచ్చు. దీనివల్ల కూడా జీర్ణవ్యవస్థలో కనిపించే సమస్యలు... అంటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఆకలి మందగించడం వంటివి కనిపించవచ్చు. .
జీర్ణవ్యవస్థపై ఎందుకీ ప్రభావం?
కరోనా వైరస్ అన్నది తన ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఏంజైమ్–2 (ఏసీఈ–2) రిసెప్టార్‌ల సహాయంతో దేహంలోకి ప్రవేశిస్తుందన్న అంశం తెలిసిందే. గుండెతో పాటు ఈ రిసెప్టార్‌లు మన జీర్ణవ్యవస్థలోని కడుపు (గట్) భాగంలో ఎఉ్కవగా ఉంటాయి. దాంతో కరోనా వైరస్‌కు ఉన్న కొమ్ముల్లాంటి భాగాలైన స్పైక్‌లతో ‘గట్’ను బలంగా అంటిపెట్టుకోడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకే వైరస్‌కు ఊపిరితిత్తులు, గుండెలాగే... జీర్ణవ్యవస్థను సైతం తేలిగ్గానే ప్రభావితం చేసేందుకు సాధ్యమైంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కనిపించే నీళ్లవిరేచనాలు, యాసిడ్ పైకి రావడం (రిఫ్లక్స్), వికారం వంటివి కలగడం మొదలైంది.
నిర్లక్ష్యం చేయడం సరికాదు... ఎందుకంటే?
సాధారణంగా గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు కొద్దిపాటివి కనిపించినా బాధితులు మంచి జాగ్రత్తలు పాటిస్తారు. కానీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండరు. ఇది ఆ తర్వాతి కాలంలో చాలా చేటు చేయవచ్చు. ఎందుకంటే... మన దేహానికంతటికీ పోషణ ఇచ్చేది జీర్ణవ్యవస్థ. మనకు ఆహారంతో అందాల్సిన పోషకాలూ, అవసరమైన శక్తి–సామర్థ్యాలూ, వ్యాధినిరోధకత... ఇవన్నీ మనం తీసుకునే ఆహారం, అది జీర్ణమయ్యే తీరు, వంటికి పట్టే విధానంతోనే సాధ్యమవుతాయి. ఆ కార్యకలాపాలు సక్రమంగా జరగకపోతే మొత్తం దేహంతో పాటు... దాని అన్ని వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. దేహానికి అవసరమైన శక్తి అన్ని కీలక అవయవాలకు అందకపోవడంతో పాటు అనేక అనర్థాలు కలుగుతాయి. అందుకే జీర్ణవ్యవస్థకు సంబం«ధించి చిన్న సమస్యలుగా పరిగణించేవాటిని కూడా నిర్లక్ష్యం చేయడం తగదు.
ఎదుర్కోవడం, చక్కదిద్దుకోవడం ఇలా...
కరోనా అనంతరం వ్యక్తిలో కనిపించే ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు జీర్ణవ్యవస్థ సమస్యలపైనా అంతే శ్రద్ధ చూపాలి. ఇంకా చెప్పాలంటే, దేహానికంతా పోషకాలనూ, శక్తినిచ్చే కీలకమైన వ్యవస్థ కావడం వల్ల ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే చూపాలి. దీనికి అవసరమైన జాగ్రత్తలు కూడా చాలా సులువే. ఉదాహరణకు కొద్దిపాటి సమస్యగా పరిణమించే నీళ్లవిరేచనాల వంటివి కనిపించినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం, దేహం తన ద్రవాలను కోల్పోతున్నందున నీళ్లు ఎక్కువగా తాగుతూ, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. ఇక వాటితో పాటు విటమిన్–సి, విటమిన్–డి, విటమిన్–బి12, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకుంటూ ఉండాలి. ఇది పూర్తి దేహంతో పాటు జీర్ణవ్యవస్థకూ మేలు చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడే పీచుపదార్థాలు అందేలా కాయధాన్యాలు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
మన జీర్ణవ్యవస్థ పొడవునా... మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఇది జీర్ణప్రక్రియకూ ఉపయోగపడుతుందని తెలిసిందే. మనకు మేలు చేసే ఈ బ్యాక్టీరియానే ‘ప్రోబయోటిక్స్’ అంటారు. సాధారణంగా కాస్తంత పులియడానికి అవకాశం ఉన్న ఇడ్లీ, దోసెపిండి వంటి వాటితో పాటు మజ్జిగ, పెరుగుతో ఈ ప్రోబయాటిక్స్ మనకు స్వాభావికంగానే లభ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కరోనా అనంతరం కోలుకునే సమయంలో మన ఆహారంలో ఈ ప్రోబయాటిక్స్‌ను ఇచ్చే పదార్థాలు, వంటకాలు తీసుకుంటూ ఉండాలి. ప్రోబయాటిక్స్ అనేవి జీర్ణవ్యవస్థలో ఉపయోగపడటమే కాకుండా.. మొత్తం జీర్ణవ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉండటానికీ, వ్యవస్థ పాడైనప్పుడు దాన్ని వేగంగా నయం చేయడానికీ ఉపకరిస్తాయి.
మన ఆహారంలో ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే జీర్ణం కావడానికి కాస్తంత ఎక్కువ సమయం పట్టే (హెవీ) ఆహారాలను వీలైనంతగా తగ్గించాలి. కరోనా నుంచి కోలుకునే సమయంలోనూ, అలాగే కరోనా అనంతరం జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలు కనిపిస్తున్న సమయంలోనూ వీలైనంతవరకు వేపుళ్లు, ప్రాసెస్‌డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. అసలే బాగాలేని జీర్ణవ్యవస్థకు అవి మరింత శ్రమ కలిగించే అవకాశం ఉంది. అందుకే కరోనా నుంచి కోలుకున్నవారూ, కరోనా తర్వాత కూడా సుదీర్ఘకాలంపాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపించేవారు మంచి పోషకాలు ఉన్న తేలికపాటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సమస్యలు మరీ తీవ్రంగా ఉంటే అవసరమైన రక్త, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment